Tuesday, April 30, 2024

కొడంగల్ మీద మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొడంగల్ మీద మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. కొడంగల్‌లో జర్నలిస్టులకు కూడా బెదిరింపులు వచ్చాయని మండిపడ్డారు. కొడంగల్‌కు కెసిఆర్ ఎన్నో మంచి పనులు చేశారని, కరివెన ప్రాజెక్టు పూర్తి చేశామని, కాలువ తవ్వితే నీళ్లు వస్తాయన్నారు. కరివెను ప్రాజెక్టు కాలువ పనుల టెండర్లను సిఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. కొడంగల్ పర్యటిస్తున్న హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు… 13 హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండేది బిఆర్‌ఎస్ అని, పదేళ్లు అధికారంలో లో ఉంటూ ప్రజల కోసం పని చేశామని, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. బిఆర్‌ఎస్ ఏం చేసిందంటే వంద స్కీములు చెబుతారని, బిజెపి ఏం చేసిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. పేదలు, రైతులు, దళిత, గిరిజనులకు బిజెపి ఏమైనా చేసిందా? అని అడిగారు. బిజెపి పెట్రోల్ ధర వందకు పైగా పెంచిందని, రూ.350 ఉన్న గ్యాస్ ధరను వెయ్యికి పెంచింది బిజెపి కాదా? అని హరీష్ రావు నిలదీశారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి మోసం చేసిందని దుయ్యబట్టారు. బిజెపి చెప్పుకోవడానికి ఏమీలేక దేవుడి ఫొటోలు, చీరలు పంచుతున్నారని చురకలంటించారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ ఇవ్వలేదని, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేదని, పాలమూరు లిఫ్ట్ పూర్తి చేస్తామని గత ఎన్నికల్లో పిఎం మోడీ హామీ ఇచ్చారని, ఐదు సంవత్సరాలు అయినా పాలమూరు లిఫ్టుకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వలేదని అడిగారు. కల్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం ఏమైందని రేవంత్‌ను సూటిగా హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే తాను ఇస్తానని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ చెప్పిందని, ఎవరికైనా ఇచ్చిందా? అని నిలదీశారు. డిసెంబర్ 9నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, రుణమాఫీ అయిన వాళ్లంతా కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ కాని వాళ్లంతా బిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News