Saturday, April 27, 2024

సముద్రాలు కాలుష్య నిలయాలు!

- Advertisement -
- Advertisement -

 

సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే అన్వేషకులు ప్రయాణించి అనేక దేశాలను కూడా కనుక్కొన్నారు. ప్రపంచంలో నాలుగింట మూడొంతులు నీరే ఉంది. ఇది కూడా సముద్ర రూపంలోనే ఉంది. సముద్ర నీరు మొత్తంగా నీటిలో 97 శాతం ఉంది. మరో విచిత్రమైన అంశమేమిటంటే భూమండలం మీద 99 శాతం జీవులకు సముద్రాలే ఆధారం. ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్ల మంది సముద్ర ఆధారంగా జీవిస్తున్నారు. ప్రపంచ జిడిపిలో 5 శాతం ఆదాయం సముద్రం నుంచి ఏటా లభిస్తోంది. సాధారణంగా ప్రాణ వాయువు మనకు వృక్షాలు నుండే లభిస్తుంది అని అనుకుంటాం కానీ మనం పీల్చే ప్రాణవాయువు సగ భాగం సముద్రాల నుంచే వస్తుంది. అలాగే మనం విడుదల చేసే కార్బనై డై ఆక్సైడ్‌లో నాలుగో వంతు సముద్రాలే శోషించుకుంటున్నాయి, తిండినిస్తున్నాయి. మనకన్నా ముందే ఆవిర్భవించిన జల చరాలకు నివాసాన్ని అందిస్తున్నాయి. భూగోళంపై వర్షాలకూ, వాతావరణ సమతుల్యతకు కారణమవుతున్నాయి.

భూమికి అత్యంత విలువైన సహజ వనరులు అందిస్తూ భూమి స్థితిని, వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి ఈ మహా సముద్రాలు. ఒకవిధంగా చూస్తే భూమిపై కంటే, సముద్రాలలోనే అధిక జీవరాశి వుంది. ఉష్ణోగ్రతలు, రుతుపవనాలు, వర్షాలు, ప్రాణవాయువు, ఆహారం, రవాణా ఇలా అనేక రకాలుగా మనమే కాదు మొత్తం జీవజాల స్థితిగతులన్నీ సముద్రాల మీద ఆధారపడి ఉన్నాయి. సముద్రంలో పనికిరాని పదార్ధం అంటూ ఏదీ లేదు. చమురు సహజవాయువు కూడా సముద్రం నుండి లభిస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే భూగ్రహానికి సముద్రం గుండె వంటిదని చెప్పవచ్చు. భూగ్రహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే గుండె వంటి సముద్రాలను కాలుష్య రహితంగా ఉంచుకోవాలని మనం గుర్తుంచుకోవాలి. మనకు ఎన్నో ఇచ్చి, ఎంతో చేసిన సముద్రానికి మనం తిరిగి ఏమిస్తున్నామంటే? కాలుష్యం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యాన్ని మనకు సముద్రంలోకి తరలిస్తున్నాం. సముద్రం ఉప్పు తిని మనం చేస్తోంది ఏంటంటే.. ఆ సముద్రాన్నే ముంచేస్తున్నాం.
పిల్ల కాలువలు వాగుల్లో, వాగులు నదుల్లో, నదులు సముద్రాలలో కలవడం అనే ప్రక్రియ ద్వారా భూమ్మీద ఏర్పడే కాలుష్యం అంతిమంగా మహాసముద్రాలలో మునుగుతోంది. మనకు అక్కరకు లేని ప్రతి వస్తువు చివరకు సముద్రంలోకి చేరుతుంది. ఇది ఇలాగే కొనసాగితే అది సముద్రాలకే కాదు మనుషులకు చేటే. సముద్రాల మనుగడ మన చేతుల్లోనే ఉంది. మన మనుగడ సముద్రం చేతిలో ఉంది. పారిశ్రామిక, వ్యవసాయ, నివాసాల వ్యర్థాలు ఇష్టారీతిగా వదిలివేయడం వలన సముద్ర కాలుష్యం ఏర్పడుతుంది. దాదాపు ఎనిమిది శాతం సముద్ర కాలుష్యం భూమి నుంచే వచ్చిందని చెబుతున్నారు.

సముద్రంలోకి వదులుతున్న పురుగుమందుల అవశేషాలు, వాయు కాలుష్యం, సముద్రజీవులకు హానికరంగా పరిగణిస్తున్నాయి. సముద్ర జీవారణ్యంలోకి చేరిన పురుగు మందుల అవశేషాలు సముద్ర జీవుల పెరుగుదలకు హాని చేస్తుంది. దీనివలన ఇప్పటికే సముద్ర జీవరాశిలోని దాదాపు ఐదు రకాల జలరాశులు కాలుష్యంలో అదృశ్యమైపోయాయి. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య కారకాల వలన సముద్రాలలో రెండు లక్షల నలభై అయిదువేల చదరపు కిలోమీటర్ల మేరకు 400 పైగా మృత ప్రాంతాలుగా తయారయ్యాయి మితిమీరిన చేపల వేట సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి విఘాతం కలిగిస్తోంది. కాలాలతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం కొనసాగించే వేట వల్ల సముద్రాల్లోని అరుదైన జీవరాశులు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. సముద్రాలను కాలుష్యానికి గురి చేసే వాటిలో ప్రధానమైనది ప్లాస్టిక్ వ్యర్ధాలు. ఏటా మనం పారవేసే ప్లాస్టిక్ చెత్తను వరసగా పేర్చుకుంటూపోతే, భూగోళం చుట్టూ కనీసం నాలుగుసార్లు తిరగవచ్చు అని అంచనా. మనం ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ చెత్త, చాలా వరకూ సముద్రాలలోనే కలుస్తోంది.

భూమండలంపై ఏటా సుమారు మూడున్నర కోట్ల టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం పేరుకుపోతూ, అందులో నాలుగోవంతు దాకా సముద్ర జలాల్లోకి చేరుతుంది అని గణాంకాలు చెబుతున్నాయి. నేలలోనే జీర్ణం కాని ఈ ప్లాస్టిక్, నీటిలో కరుగుతుందా?! కరగదు కాబట్టి జలచరాల ప్రాణాలను తీస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది నీటి పక్షులు, వేలాది జల క్షీరదాలు కేవలం ప్లాస్టిక్ కారణంగా మరణిస్తున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో సముద్రాలలో ప్లాస్టిక్ నాలుగింతలు పెరగవచ్చని ప్రభుత్వాలే అంచనా వేశాయి. ఈ ప్లాస్టిక్ వృథాలు ఇలాగే కొనసాగితే మరో 30 సంవత్సరాలకు సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ సంచులే ఎక్కువ వుంటాయి అనడంలో సందేహం లేదు. మనం శిలాజ ఇంధనాలను దహనం చేస్తూ గాలి మాత్రమే కలుషితమవుతోందని అనుకుంటాం. కానీ, ఆ విధంగా విడుదల అయిన కర్బన ఉద్గారాలలో పాతిక శాతం సముద్రాలే పీల్చుకుంటాయి. దాంతో సముద్ర నీటిలో మార్పులొచ్చి ఉపరితల నీరు యాసిడ్‌గా మారుతుంది. ఈ ఆమ్లీకరణ ప్రక్రియ ఇప్పుడు వేగం పుంజుకుంది. ఇదేవిధంగా కొనసాగితే, కొంతకాలానికి సముద్ర జలాలు ఉప్పగానే కాదు యాసిడ్ లాగా కూడా మారతాయి. మరి అటువంటి నీటిలో జీవులు బతుకుతాయా?

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటికి భారీ మంచు పర్వతాలు సైతం క్రమంగా కరిగి అంతరించిపోయే ప్రమాదముంది. ఇదే జరిగితే సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగి తీర ప్రాంతంలో నగరాలు, పట్టణాలూ మునిగిపోయి కోట్లాది మంది ప్రజలు మృత్యువాతపడే అవకాశముంది. హిమానీ నదుల్లో సాధారణంగా మైనస్ డిగ్రీతో ఉండే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటం, మంచు కూడా అదే స్థాయిలో కరుగుతూ సముద్రాల మట్టాలు పెరిగి వరదలు, ముంపులు జరుగుతాయి. కొన్ని చిన్న ద్వీపాలు నీట మునిగిపోతాయి. ఈ మార్పులవల్ల సముద్ర మట్టాలు కూడా పెరిగి పోతున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. భూతాపానికి నీరు ఆవిరైనా అది చల్లబడి మబ్బులై వర్షంగా మారడానికి అనుకూల పరిస్థితులు రాకపోవచ్చు. అందువల్ల వర్షాభావం కలుగుతుంది. ఆ కారణంగా అరణ్యాలు అంతరించిపోతాయి. జంతుజలాలు తగ్గిపోతాయి. ఒకప్పటి పొలాలు బీళ్ళై, ఎడారులుగా మారతాయి. సముద్ర తీర ప్రాంతాలలో ఉండే మడ అడవుల విస్తీర్ణం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతుండటం ఆందోళనకర పరిణామం. గడచిన అరవయ్యేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80 శాతం మేరకు ఇవి అంతరించిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా సముద్రాల్లో కార్బన్ కాలుష్యం పెరుగుతోంది. కేవలం మడ అడవుల్లో మాత్రమే కనిపించే 70 రకాల అరుదైన జీవజాతుల్లో 11 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయని ‘కన్జర్వేషన్ ఇంటర్నేషనల్’ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఒకప్పుడు తుఫాన్లు ఎప్పటికో కానీ అనుభవంలోకి వచ్చేవికావు. కానీ, ఈ మధ్య దాదాపు ప్రతి ఏడాది ఎక్కడో ఓ చోట తుఫాను బీభత్సాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. కాలాలు మారాయి. రుతువులు గతి తప్పాయి. తెలిసో.. తెలీకో అందుకు కారణం మాత్రం మనమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భూమిపైన ప్రాణి పుట్టుకకు ఆయువు పట్టులాంటి ‘వెచ్చదనం’ భూమికే ప్రత్యేకం. దీన్ని నియంత్రించేవి సముద్రాలు. ఇప్పుడి సముద్ర ఆవరణ వ్యవస్థలో ప్రతికూల మార్పులు వస్తే జీవానుకూల వ్యవస్థంతా దెబ్బతింటుంది. జీవ సమతుల్యతకు ఆటంకం కలుగుతుంది.

చివరికి మానవుడి ఉనికీ ఈ భూమిపై జీవించడం అనేది ప్రశ్నార్ధకం కానుంది. సముద్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటివల్ల సముద్ర గర్భంలోని జీవరాశితో పాటు, నేల మీద నివసించే మనుషులకు వాటిల్లే ముప్పు గురించి శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచే మొత్తుకుంటున్నా, ఇరవయ్యో శతాబ్ది చివరి రోజుల్లో మాత్రమే ప్రపంచ దేశాల ప్రభుత్వాల్లో కొంత చలనం వచ్చింది. తొలిసారిగా 1992 జూన్ 8న వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘వరల్డ్ ఓషన్స్ డే’గా ప్రకటించి కెనడాలో ఒక సమావేశం నిర్వహించాయి. సముద్రాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం వరల్డ్ ఓషన్స్ డేను 2008లో అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి వివిధ దేశాల ప్రభుత్వాలు, సముద్ర పరిశోధనలు సాగించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ రోజున సాగరాల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ సంవత్సరం (2021) మహాసముద్రం: జీవితం, జీవనోపాధి ధీమ్ తో ప్రపంచ మహా సముద్రాల దినోత్సవాన్ని జరపడానికి నిర్ణయించారు. మనం తాత్కాలిక సౌలభ్యం, సౌకర్యం కోసం మనమే భూగోళ స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరచి మహా సముద్రాలను కాపాడుకోకపోతే మహా విషాదమే మిగులుతుంది..భావి తరాల ఆవాసం లేకుండా పోతుంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News