Friday, April 26, 2024

రాష్ట్రవ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు

- Advertisement -
- Advertisement -

Heavy rains across Telangana

రేపటి నుంచి అతి భారీ వర్షాలు
మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ
వర్షానికి మునిగిపోయిన మలక్‌పేట ముసారాంబాగ్ బ్రిడ్జి
లోతట్టు ప్రాంతాలు జలమయం
పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇక నగరంలో ప్రతి రోజు ఏదో ఒక సమయంలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మూసీ పరివాహక ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున

వర్షాల నేపథ్యంలో గండిపేటకు భారీగా వరద నీరు చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అంబర్‌పేట్- మూసారాంబాగ్ వంతెన నీటమునిగింది. మలక్‌పేటలోని ముసారాంబాగ్ బ్రిడ్జి నీటిలో మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు వాహనాలను దారి మళ్లీంచారు. ఇలాంటి సమయంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది.

ములుగు జిల్లా, వెంకటాపురంలో 11 సెంటిమీటర్లు

ఈమేరకు రానున్న 3 రోజులు రాష్ట్రంలో ఆరెంజ్ అలెర్ట్, ఆ తరువాత 4 రోజులు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో ములుగు జిల్లా, వెంకటాపురంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, సంగారెడ్డి జిల్లా, జోగిపేట, పెద్దపల్లి జిల్లాలో 9 సె.మీ , కొమురంభీం జిల్లా (దహేగావ్లో)8, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 7, కొత్తగూడెంలో 13, నల్గొండ జిల్లా చండూరులో 11, సిద్దిపేట జిల్లాలో 11.1, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో 10.6, హైదరాబాద్‌లో 8.5, రంగారెడ్డిలో 6.8, మెదక్‌లో 5.6, యాదాద్రి భువనగిరి 7.5, కామారెడ్డి 7, సిద్ధిపేట 6.5 సెంటీమీటర్లు మిగతా జిల్లాలో 3 నుంచి 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ కురిశాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌గర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈనెల 6వ తేదీ నుంచి 12వ తేదీలోగా అల్పపీడనాలు….

బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని దీని ప్రభావంతో ఈనెల 6వ తేదీ నుంచి 12లోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. రుతుపవనాల కదలికలు సాధారణంగానే ఉన్నాయని, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అతి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి

నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట ప్రధాన రహదారిపై భారీగా వర్షంనీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. వరద ఉధృతికి ద్విచక్ర వాహనాలు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. మలక్‌పేటలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పలు కాలనీల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మీర్‌పేట, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, కోఠి, అబిడ్స్, గోల్కొండ, కార్వాన్, లంగర్‌హౌస్, మెహిదీపట్నం, అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతోపాటు నగరంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వారం రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరింది. బస్టాండ్ సమీపంలోని అండర్ బ్రిడ్జిలో నీరు చేరడంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News