Monday, May 6, 2024

అతిధుల పైనే ఆశలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్‌ల ఘట్టం పూర్తయింది. ప్రచారం హోరెత్తించే కార్యాచరణలో అభ్యర్థులున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఎస్టార్ క్యాంపెయినర్‌ల మీదే ఆశలు పెట్టుకున్నారు. చివరి పదిరోజుల్లో సమీకరణాలు అనుకూలంగా మారుతాయని భావిస్తున్నారు. ప్రజల్లో ఆకర్షణ ఉన్న నేతలను రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు. ప్రచారంలో ఎన్ని కోట్లు గుమ్మరించిన సరే క్యాడర్‌లో జోష్ రావడానికి అగ్రనేతల రావడం అనివార్యంగా భావిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోజువారీగా ఆయా ప్రాంతాల్లో క్షణం తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీపావళి పండగతో ఒక్కరోజు విరామం తీసుకున్నారు. మరుసటి రోజే రంగంలోకి దిగారు. తాము చేస్తున్న ప్రచారానికి తోడు అగ్రనేతలు వచ్చి ఒక్కసారి ఉపన్యాసాలు ఇస్తేనే తమ ప్రచారానికి మరింత ఊపు వస్తుందనే అంచనాలో అభ్యర్థులున్నారు. అందుకే అగ్రనేతల ఎన్నికల ప్రచారంపైనే అభ్యర్థులు గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ మేరకు ఆయా నేతల ప్రచార షెడ్యూల్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆర్థిక భారమే అయినా అభ్యర్థులు లెక్క చేయడం లేదు.

నామినేషన్‌ల ఘట్టం పూర్తి అయి ప్రచారం హోరెత్తిస్తున్న అభ్యర్థులు అగ్రనేతలను బరిలోకి దింపే కార్యాచరణ పై దృష్టి పెట్టారు. ఈ వ్యూహ రచనలో బిఆర్‌ఎస్ ముందుంది. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగించారు. ఆయన పాల్గొన్న ప్రజాశీర్వాద సభలకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించారు. ఉమ్మడి జిల్లాలో అన్ని తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆయన సభలు సూపర్ హిట్ అయ్యాయి. క్యాడర్‌లోనూ సహజంగానే ఉత్సాహం మరింత పెరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ కామారెడ్డి నియోజక వర్గ ఇంచార్జిగా పని చేస్తూ క్యాడర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం బోధన్ అర్బన్, నియోజక వర్గాలకు ఇంచార్జిగా ఉండి క్షేత్ర స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఆమె మిగితా నియోజక వర్గాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల మీద అలుక బూనిన నేతలు వీరి రాకతో యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే కార్యాచరణలో ఉంది. చివరి వారంలో అగ్రనేత రాహుల్‌ను జిల్లాకు రప్పించడానికి అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు షబ్బీర్, సుదర్శన్ రెడ్డి తమ నియోజక వర్గాల్లో రాహుల్ సభల కోసం పట్టుబడుతున్నారు. రాహుల్ ఈపాటికే ఓదఫా ఎన్నికల ప్రచారం ఆర్మూర్, బాల్కొండలో చేసి వెళ్లారు.

బోధన్‌లో ఎన్నికల ప్రచార సభ వాయిదా పడింది కానీ ఇప్పటిదాకా రాహుల్ టూర్‌పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం కామారెడ్డికే వచ్చి వెళ్తున్నారు. కానీ ఆయన కనీసం రెండు దఫాలుగా జిల్లాకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. బిజెపి అభ్యర్థులు సైతం అగ్రనేతల కోసం ఆరాట పడుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలో రెండు రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు కొద్దీ రోజుల ముందే ప్రధాని మోడీ జిల్లాకు వచ్చి వెళ్లారు. ఆయన వచ్చేఛాన్స్ లేకపోవడంతో కనీసం అమిత్ షా లేదంటే యోగిలతో ప్రచారం చేయించుకోవాలని బిజెపి అభ్యర్థులు యోచిస్తున్నారు. అర్బన్, ఆర్మూర్‌లలో యోగి పర్యటించే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికల ప్రచారం అతిథులతో మరింత హూరెత్తించే పనిలో అభ్యర్థులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News