Sunday, April 28, 2024

జమ్మూలో 6, కశ్మీర్‌లో ఒక అసెంబ్లీ సీటు పెంపు

- Advertisement -
- Advertisement -
Increase of Assembly seats in Jammu and Kashmir
డీ లిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన
బిజెపి రాజకీయ అజెండాకు అనుగుణంగా ఉన్నాయని విపక్షాల విమర్శ

న్యూఢిల్లీ: జమ్మూ,కశ్మీర్‌పై ఏర్పాటు చేసిన నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ జమ్మూకు అదనంగా ఆరు అసెంబ్లీ స్థానాలను, కశ్మీర్‌కు ఒక స్థానాన్ని పెంచాలని ప్రతిపాదించింది. కాగా మొత్తం స్థానాల్లో 16 స్థానాలను ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వ్ చేయాని ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలను రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కమిషన్ సిఫార్సులు బిజెపి రాజకీయ అజెండాకు అనుగుణంగా ఉన్నాయని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటుగా బిజెపి పట్ల సానుకూలంగా ఉండే పిడిపి, జెకె అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీలు కూడా జమ్ము కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చివేసే ఈ ముసాయిదా సిఫార్సులను గట్టిగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. అసెంబ్లీలో కశ్మీర్ డివిజన్‌లో ప్రస్తుతం 46 స్థానాలుండగా, జమ్మూ డివిజన్‌లో 37 స్థానాలున్నాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సోమవారం ఇక్కడ రెండోసారి సమావేశం అయింది.

ఈ కమిషన్‌లో జమ్మూ, కశ్మీర్‌కు చెందిన ఐదుగురు ఎంపిలు అసోసియేట్ సభ్యులుగా ఉండగా, ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో పాటుగా నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ముగ్గురు ఎంపిలు తొలిసారి ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో పాటుగా ఇద్దరు బిజెపి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత పెంపుపై తమ అభిప్రాయాలను ఈ నెల 31లోగా సమర్పించాలని పార్టీలను సమావేశం కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా కమిషన్‌లో జరిగిన చర్చల వివరాలను అయిదుపార్టీల కూటమి అయిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌తో పాటుగా తమ పార్టీకి వివరిస్తానని సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. గుప్కార్ కూటమికి ఫరూక్ అబ్ద్దుల్లా చైర్మన్ కూడా. కమిషన్‌కు తమ అభిప్రాయాలను పంపడానికి ముందు కూటమి సీనియర్ నేతలతో చర్చిస్తానని ఆయన చెప్పారు. కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ప్రతిపాదనలపై తీవ్రంగా స్పందించారు.

శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగుతామని చెపిన కమిషన్ దానికి బదులు రాజకీయ దృక్పథంతో వ్యవహరించిందని ఆయన ఓ ట్వీట్‌లో దుయ్యబట్టారు. కాగా కేవలం బిజెపి రాజకీయ ప్రయోజనాలను కాపాడడం కోసమే కమిషన్‌ను ఏర్పాటు చేశారని, 2019 నాటి రాజ్యాంగవ్యతిరేక, చట్ట వ్యతిరేక నిర్ణయాలను చట్టబద్ధం చేసే ప్రభుత్వాన్ని జమ్మూ, కశ్మీర్‌లో ప్రతిష్ఠించడమే కేంద్రం అసలైన వ్యూహమని పిడిపి అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. 2019 ఆగస్టులో పార్లమెంటులో జమ్మూ, కశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఏడాది లోగా కమిషన్ తన పని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో మరో ఏడాది పొడిగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News