Tuesday, April 30, 2024

విద్యుత్ సరఫరాలో అద్భుత విజయం

- Advertisement -
- Advertisement -

Increased household electricity consumption with lockdown

హైదరాబాద్: ఆరేళ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినట్టుగానే విద్యుత్ సరఫరాలోనూ అద్భుత విజయాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 2014 నవంబర్ నుంచి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను టిఆర్‌ఎస్ ప్రభుత్వం అందచేస్తోంది. 2014 నవంబర్ 20 నుంచి కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింందనడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిచింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు గృహాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది.

రాష్ట్ర విభజన తరువాత ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విక్రయించే స్థాయికి వచ్చింది. సమైక్య పాలనలో పరిశ్రమలకు రూ. 10 వేల కోట్ల నష్టం రాగా, నిరంతర విద్యుత్‌తో ఇప్పుడు రూ.2 వేల కోట్ల టర్నోవర్‌తో విద్యుత్ శాఖ అద్భుత ప్రగతిని సాధిస్తోంది. 2020 మార్చిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యుత్ వాడకం మరింత పెరగ్గా, వర్షాకాలం సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు విద్యుత్‌కు శాఖకు నష్టం కలిగింది. సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని 2020లో జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ హామినిచ్చింది. టారిఫ్ పట్టికలో కొత్త కేటగిరీ సృష్టించి వీరికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇలా 2020 సంవత్సరం చాలా చేదు జ్ఞాపకాలను మిగల్చడంతో పాటు దేశంలోనే నాణ్యమైన విద్యుత్ సరఫరాలో నెంబర్‌వన్‌గా నిలిచి ఈ శాఖకు మరింత పేరు తీసుకొచ్చింది.

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ పరిధిలో 1,57,39,911 విద్యుత్ కనెక్షలు

2020, 21 సంవత్సరానికి వ్యవసాయం , ఇళ్లు వివిధ రకాల కంపెనీలకు రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ పరిధిలో మొత్తం 1,57,39,911 విద్యుత్ కనెక్షలను ఇచ్చింది. అందులో వ్యవసాయానికి సంబంధించి 24,49,200 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, గృహాలకు సంబంధించి 1,14,96,838 విద్యుత కనెక్షన్లు ఉన్నాయి. ఇక వివిధ రకాల కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించి 17,93,873 నూతన విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది. ఉన్న కనెక్షన్‌లలో 51,49,669 మంది వినియోగదారులుండగా, మొత్తం 53 శాతం మంది గ్రేటర్ పరిధిలో ఉన్నారు. టిఎస్‌ఎస్‌పిడిఎస్‌ఎల్ పరిధిలో 2020 మార్చిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 7,284 మెగావాట్లుగా నమోదు కావడం విశేషంగా చెప్పవచ్చు.

ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ నివేదికను సమర్థించిన సుప్రీంకోర్టు

టిఎస్‌ఐపాస్‌తో రాష్ట్రానికి అనేక సంస్థలు, పరిశ్రమలు రావడంతో విద్యుత్ కనెక్షన్లు కూడా పెరిగాయి. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నింపడ వలన బోరుబావుల్లో నీరు సమృద్ధిగా వచ్చింది. రాష్ట్రంలో ఈ ఏడు కురిసిన వర్షాలకు విద్యుత్ శాఖకు నష్టంతో పాటు లాభం చేకూరింది. ఆగష్టు 21వ తేదీన శ్రీశైలంలో జల విద్యుత్‌లో భారీ అగ్నిప్రమాదం వల్ల ఆరు యూనిట్లు దెబ్బతినడంతో పాటు 9 మంది ఉద్యోగులు మృత్యువాతపడిన ఘటన ఆ శాఖలో విషాధ సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒక్కో యూనిట్ నుంచి 128 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి అయ్యేది, మొత్తం 800లకు పైగా యూనిట్ల విద్యుత్ నిలిచిపోగా ఆ శాఖకు కోట్లలో నష్టవచ్చింది. ప్రస్తుతం ఇప్పటికే మూడు యూనిట్లను మరమ్మతు చేసి విద్యుత్ ఉత్పత్తిని ఆ శాఖ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు చాలాకాలంలో కోర్టులో నలుగుతున్న ఉద్యోగుల విభజన వివాదం ఆరేళ్లపాటు కొనసాగింది. డిసెంబర్ నెలలో ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు సమర్ధించడంతో ఈ వివాదం ముగిసింది. తెలంగాణ నుంచి 600 మంది ఉద్యోగులు ఎపికి వెళ్లగా అంతేస్థాయిలో ఎపి నుంచి తెలంగాణకు రావడం గమన్హారం. దీనిపై ఇప్పటికే విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో దీనిని వ్యతిరేకిస్తున్నారు.

మార్చి 31 వరకు మొత్తం 15,980.40 మెగావాట్ల విద్యుత్

2020 మార్చి 31 వరకు టిఎస్ జెన్‌కోతో పాటు ప్రైవేటు సంస్థలు కలిపి మొత్తం 15,980.40 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. అందులో బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్టుల నుంచి 2,962.50 మెగావాట్ల ఉత్పత్తి చేసింది. జలవిద్యుత్ ద్వారా 2,430.60 మెగావాట్లు, మినీ ప్లాంట్‌ల నుంచి 11.16, సౌర విద్యుత్ ఒక మెగావాట్‌గా ఉత్పత్తి చేస్తున్న టిఎస్ జెన్‌కో మొత్తం 5,405.26 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా అంతర్‌రాష్ట్ర జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి 76.31 మెగావాట్ల, సంయుక్త రంగమైన గ్యాస్ ఆధారిత ప్లాంట్‌ల నుంచి 24.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ప్రైవేటు రంగంలో గ్యాస్ ఆధారిత ప్లాంట్‌ల ద్వారా 807.31 మెగావాట్ల విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర విద్యుత్ 3,680 మెగావాట్లు, మున్సిపల్ మెగా వేస్టు, వాయు విద్యుత్ రూపంలో 380.36 మెగావాట్లు, సింగరేణి థ్మరల్ పవర్ ప్రాజెక్టు ద్వారా 1,200 మెగావాట్లు, ఛత్తీస్‌ఘడ్ నుంచి 1,000 మెగావాట్ల రూపంలో మొత్తం ప్రైవేటు రంగంలో 7,067.67 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణకు లభిస్తోంది. మరో 2,567.30 మెగావాట్ల విద్యుత్ కేంద్రం వాటాగా తెలంగాణకు దక్కుతోంది. సెయిల్ నుంచి 839 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వస్తోంది. ఇక నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్, ఖమ్మంలోని మణుగూర్ పవర్ ప్లాంట్ పూర్తయితే మరో 5 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. దీంతో తెలంగాణ మరింత మిగులు విద్యుత్‌గా కావడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చింది.

జిహెచ్‌ఎంసి పరిధిలో 39,01,953 మందికి సబ్సిడీ

జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 42,35,764 మంది వినియోగదారులుండగా వీరిలో 39,01,953 మంది సబ్సిడీని పొందుతున్నారు. ప్రతినెలా 45, 71,63,730 యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా రూ.137.32 కోట్లను ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇది వరకు 50 యూనిట్లకు మించి విద్యుత్‌నందించగా టివిలు, ఇతర గృహాపకరణాలతో విద్యుత్ వాడకం పెరిగిపోయింది. దీంతో చాలా యూనిట్‌లలో 50 యూనిట్లకు మించి విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.

పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, థియేటర్లకు రూ.840 కోట్ల ప్రయోజనం

వచ్చేనెల నుంచి సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరాను అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపోందిస్తోంది. హెచ్‌డీ, ఎల్టీ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కనీస డిమాండ్ చార్జీలు రద్దు చేయనున్నట్టు టిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, థియేటర్లకు రూ.840 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. లాక్‌డౌన్‌తో మార్చి నుంచి సెప్టెంబర్ దాకా పరిశ్రమలన్నీ మూతపడినా డిమాండ్ చార్జీలు, కస్టమర్ చార్జీల భారం పడడంపై పరిశ్రమలు, థియేటర్ల యజమానులు ఆ భారం తగ్గించాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టిఎస్‌ఈఆర్‌సీ)లో పిటిషన్లు దాఖలు చేశారు.

ఏడు నెలల చార్జీల నుంచి మినహాయింపు వచ్చే అవకాశం

అయితే మార్చి, ఏప్రిల్, మే నెల చార్జీలు మాత్రమే పక్కనపెట్టిన ఈఆర్‌సీ వాటిని తర్వాత చెల్లించడానికి అవకాశం ఇచ్చింది. చార్జీలు రద్దు చేసే అధికారం లేదంటూ వందలాది పిటిషన్లను తోసిపుచ్చింది. ఇప్పుడు ఆ చార్జీలను రద్దు చేస్తామని టిఆర్‌ఎస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జనవరి 2021 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల 1,32,194 పరిశ్రమలకు మేలు జరుగనుంది. ఏడు నెలల చార్జీల నుంచి మినహాయింపు లభించనుంది. అయితే వీరంతా ఇప్పటికే విద్యుత్ చార్జీలు చెల్లించినందున తదుపరి చార్జీల్లో మినహాయింపులిచ్చే అవకాశం ఉంది.

సెలూన్లు, దోబీఘాట్లకు లబ్ధి

క్షౌరశాలలు(సెలూన్లు), లాండ్రీలు, ధోబీఘాట్‌లకు ఈనెల నుంచి ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు సిఎం ప్రకటించిన నేపథ్యంలో 70 వేల సెలూన్లకు రూ.90 నుంచి 110 కోట్ల ప్రయోజనం చేకూరనుంది. ఇక ధోబీఘాట్లు/లాండ్రీలు కలుపుకొని 1.50 లక్షల దాకా ఉంటా యి. వాటికీ రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా లబ్ధి రజకులకు కలగనుంది. కాగా ఎస్సీ, ఎస్టీల్లో 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ను వినియో గించే వారి సంఖ్య 3,16,963. తాజా నిర్ణయంతో మరో 2.5లక్షల మందికి ఉచిత విద్యుత్ అందనుంది. సెలూన్లు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్‌తో రూ.200 కోట్ల మేర అదనంగా ప్రభుత్వం భరించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News