సిడ్నీ: ఇటీవల కాలంలో జరుగుతున్న చాలా టెస్టుల్లో ఫలితాలు వస్తున్నాయి. ఇక చాలా మ్యాచులు నాలుగు రోజుల్లోపే ముగుస్తున్నాయి. ఇలాంటి స్థితిలో మ్యాచ్‌లు డ్రాగా ముగియడం చాలా అరుదుగా జరుగుతోంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. టెస్టు క్రికెట్..బ్యాటు బంతి మధ్య జరిగే పోరాటానికి అసలైన వేదికగా. ఈ మ్యాచ్‌లో డ్రా కోసం టీమిండియా ఆటగాళ్ల చేసిన పోరాటం టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పోరాడిన తీరును ఎంత పొగిడినా తక్కువే. ఈ మ్యాచ్‌లో భారత ఆర్డర్ కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. ఏంటా పట్టుదల.. ఏంటా కసి.. ఏంటా తెగువ.. ఏంటా సాహసం.. ఏంటా సహనం.. ఏంటా డిఫెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మ్యాచ్‌లో చాలా విషయాలే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపు మాటేలా ఉన్నా కనీసం డ్రాతో గట్టెక్కడం కూడా గగనమే అనుకుంటున్న సమయంలో టీమిండియా అద్భుత ఆటతో అలరించింది. చటేశ్వర పుజారా, యువ సంచలనం రిషబ్ పంత్‌లకు తోడు తెలుగుతేజం హనుమ విహారి, స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అసాధారణ పట్టుదలతో బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా గెలుపు అవకాశాలను నీరుగార్చారు. అంతేగాక భారత్‌కు విజయంలాంటి డ్రాను అందించారు. 1980 తర్వాత భారత్ తొలిసారి నాలుగో ఇన్నింగ్స్‌లో 131 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి పాత రికార్డును తిరగరాసింది. 98/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం చివరి రోజు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో సఫలమైంది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 131 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ డ్రా వైపే మొగ్గు చూపింది.
ఆరంభంలోనే..
చివరి రోజు భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ అజింక్య రహానె (4) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. లియాన్ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఈ ఇలాంటి స్థితిలో భారత్ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం కష్టమేనని అనిపించింది.
ఆదుకున్న పంత్, పుజారా
ఈ దశలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సందర్భంగా గాయానికి గురైన పంత్ ఈసారి బరిలోకి దిగుతాడా అనేదే సందేహంగా కనిపించింది. కానీ గాయం నుంచి కోలుకున్న పంత్ విహారి కంటే ముందే బ్యాటింగ్ దిగాడు. ఆరంభంలో కాస్త సమన్వయంతో ఆడాడు. ఒకటి రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపట్టాడు. అయితే కుదురుకున్న తర్వాత పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఒకవైపు పుజారా తన మార్క్ డిఫెన్స్ ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించగా, పంత్ మాత్రం వాళ్లపై ఎదురుదాడికి దిగాడు. ఒత్తిడిలోనూ అతను కనబరిచన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించాడు.దొరికిన బంతిని దొరికినట్టు చావా బాదాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. వన్డే తరహాలో బ్యాటింగ్ కొనసాగిస్తూ ముందుకు సాగాడు. పంత్ దూకుడును చూస్తుంటే టీమిండియా గెలుపుపై ఆశలు చిగురించాయి. ఇటు పుజారా అటు పంత్ సమన్వయంతో ఆడుతూ నాలుగో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయిన పంత్ 118 బంతుల్లోనే 12 బౌండరీలు, మరో మూడు సిక్సర్లతో 97 పరుగుల చేసి ఔటయ్యాడు. అతను మూడు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇదే క్రమంలో పుజారాతో కలిసి 148 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ వెంటనే పుజారా కూడా వెనుదిరిగాడు. తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించిన పుజారా 205 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. అయితే పంత్, పుజారా వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో భారత్‌లో మళ్లీ కష్టాల్లో చిక్కుకుంది. టివిరామ సమయానికి టీమిండియా 280/5తో ఉంది. ఇలాంటి స్థితిలో మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టంగా కనిపించింది.
గట్టెక్కించిన విహారి, అశ్విన్
ఈ దశలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. సిరీస్‌లో ఇటు విహారి, అటు అశ్విన్ బ్యాటుతో పెద్దగా రాణించలేదు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ మ్యాచ్‌ను రక్షిస్తారని ఎవరూ ఊహించలేదు. పైగా విహారి గాయంతో సతమతమయ్యాడు. పిక్క కండరాలు పట్టేసి పరుగు తీయలేని స్థితిలో ఉన్నాడు. ఫిజియో వచ్చి రెండు మూడుసార్లు పరీక్షించాడు. విహారి ఔటైతే మరోకరు ఉన్నారా అంటే ఎవరూ లేరనే సమాధానం. తొలి ఇన్నింగ్స్‌లో బొటనవేలు విరిగినా జడేజా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే నొప్పితో బాధపడుతున్న జడేజా ఎంతసేపు క్రీజులో ఉంటాడు అనేది అందరిలోనూ ఆందోళన కలిగించింది. దీంతో అభిమానులతో పాటు టీమిండియా కూడా ఇటు విహారి, అటు అశ్విన్‌లపైనే ఆశలు పెట్టుకుంది. అయితే మూడో సెషన్‌లో పిచ్ బౌలర్లకు సహకరిచడం అనవాయితీ. ఇలాంటి స్థితిలో 34 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని మ్యాచ్‌ను కాపాడుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపించింది. కానీ అశ్విన్, విహారిలు అసాధారణ పోరాట పటిమతో దీన్ని ఆచరణలో చేసి చూపించారు. ఈ జోడీ 259 బంతులాడి అజేయంగా నిలిచింది. అంతేగాక 62 పరుగులు కూడా జోడించింది. ప్రత్యర్థి ఆటగాళ్లు పదేపదే స్లెడ్జింగ్ చేసి ఏకాగ్రత చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. బాడీలైన్‌తో దేహం మీదకు బంతులు విసిరుతున్నా వీరిద్దరూ తమ పోరాటాన్ని కొనసాగించారు. ఒకవైపు నొప్పి బాధిస్తన్న విహారి 161 బంతులు ఎదుర్కొని 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు అశ్విన్ కూడా 128 బంతులు ఆడి ఏడు ఫోర్లతో 39 పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరు చివరి వరకు తమ వికెట్‌ను కాపాడుకుని ఆస్ట్రేలియాను గెలుపు నుంచి దూరం చేశాడు. ఇక మ్యాచ్‌లో ఎలాగైన గెలవాలని భావించిన కంగారూలకు విహారి, అశ్విన్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో కోలుకోలేని షాక్ ఇచ్చారు.
IND vs AUS 3RD Test Match Draw