Sunday, April 28, 2024

రక్షణ వ్యయం!

- Advertisement -
- Advertisement -

Sampadakiyam

 

రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్‌లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక పాటవాన్ని పెంచుకుంటూపోక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్న మాట వాస్తవం. అయితే దానికి అంతెక్కడ అనే ప్రశ్నకు సమాధానం సులభ సాధ్యం కాదు. సైనిక వ్యయంలో అమెరికా, చైనా తర్వాత మూడవ స్థానానికి భారత దేశం చేరుకున్నదని స్టాక్ హోమ్ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) తాజా నివేదిక నిగ్గు తేల్చింది. పాకిస్థాన్, చైనాలతో గల ఉద్రిక్తతలు, శత్రుత్వం ఇందుకు చెప్పుకోదగిన కారణాలని అభిప్రాయపడింది. 2019లో భారత దేశ సైనిక వ్యయం 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. అంతకు ముందు వరకు ఈ విషయంలో మూడవ స్థానంలో ఉండిన రష్యాను ఇండియా వెనుకకు నెట్టివేసింది. అయితే 2019లో రక్షణ రంగంపై చైనా పెట్టిన 261 బిలియన్ డాలర్ల ఖర్చుతో పోలిస్తే మన మిలిటరీ వ్యయం చాలా తక్కువే. అలాగే అమెరికా వెచ్చించిన 732 బిలియన్ డాలర్ల కంటే మరింత స్వల్పం. అయితే అమెరికా, చైనాలు ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నందున వాటి భారీ సైనిక వ్యయాలు కొంత వరకు అర్థం చేసుకోదగినవే. మన ఖర్చు ఇంతగా పెరగడానికి సైన్యానికి వేతనాలు, పెన్షన్ చెల్లింపులలో వృద్ధి కూడా ఒక కారణమని తేలింది. వాస్తవానికి ఈ ఏడాది బడ్జెట్‌లో మన రక్షణ కేటాయింపు ఆ రంగం ఆధునికీరణ లక్షాల సాధనకు తగినంతగా లేదనే అభిప్రాయం కూడా ఉన్నది. కలహాలు దేశాల మధ్యనే కాని వాటి ప్రజల మధ్య కావు. సరిహద్దు వివాదాలు తీవ్రమై యుద్ధాలకు దారి తీయడం ఇప్పుడు తగ్గుముఖం పట్టినా పొరుగు దేశంతో సఖ్యత లేకపోడమనేది నిరంతరం రెప్పవేయడానికి వీలులేని పరిస్థితిని సృష్టిస్తున్నది. అందుచేత సైనిక సామర్థాన్ని ఎల్లప్పుడు సునిశితంగా ఉంచుకోక తప్పుదు. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, పోరాట విమానాలు , హెలీకాప్టర్లు వంటి వాటిని అదనంగా సమకూర్చుకోవలసి ఉంటుంది. ప్రపంచ యుద్ధ సన్నద్ధ రంగంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అమ్ముల పొదిలో చేర్చుకోడం కూడా అవసరం. అమెరికా వంటి దేశాలు కేవలం ఆయుధాల ఉత్పత్తి, అమ్మకం ద్వారానే విశేషంగా గడిస్తున్న చేదు వాస్తవం తెలిసిందే. వాటి ఆయుధ పరిశ్రమలు వర్థిల్లడం కోసం దేశాల మధ్య పొరపొచ్చాలు, కలహ కాండలు అనివార్యమైన ముడి సరకులు అవుతున్నాయి. నిజానికి 1962నాటి సరిహద్దు యుద్ధం తర్వాత చెప్పుకోదగిన ఘర్షణ వాతావరణం చైనాతో ఏర్పడలేదు. పాకిస్థాన్‌తో అటువంటి పరిస్థితి తలెత్తినా దానిని ఎదుర్కోడం కష్టతరమనిపించడం లేదు. అది తన గడ్డ మీది నుంచి ఉగ్రవాదులను ఉసిగొల్పే పరోక్ష యుద్ధ తంత్రానికి పాల్పడుతున్నా దానికి తగిన రీతిలో జవాబు చెప్పగలుగుతున్నాము. ఉగ్రవాదం పై పోరులో అంతర్జాతీయ సమాజం దృష్టిలో పాకిస్థాన్‌ను బోనెక్కించగలుగుతున్నాము. అయినప్పటికీ పొరుగున మన కీడును కోరే శక్తులున్నంత వరకు సైనిక సర్వసన్నద్ధత అత్యవసరం. ఇక్కడ భారత వ్యతిరేకతలో చైనా, పాకిస్థాన్‌లు తోడుదొంగలన్న విషయాన్ని మరచిపోరాదు. 2020 21 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ శాఖకు రూ. 4,71,378 కోట్లు (66.9 బిలియన్ డాలర్లు) కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 15.49 శాతం. అదే సమయంలో విద్య, వైద్య రంగాల వికాసానికి నిధులను బహు తక్కువగా విదిల్చారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పేట్రేగిపోయి 21.1 శాతానికి చేరుకున్నది. యువతకు పనిపాటు లేని స్థితి మరింతగా విజృంభించింది. జనాభాలో అత్యధికంగా ఉన్న సాధారణ ప్రజానీకం ఆకలి, దారిద్య్రాల కోరల్లోకి ఇంకా జారిపోక తప్పని భవిష్యత్తు భయపెడుతున్నది. ఇటువంటి స్థితిలో విద్య, వైద్య రంగాలకు భారీగా కేటాయింపులు జరపవలసి ఉంది. స్థూల దేశీయోత్పత్తిలో (జిడిపి)లో 2.5 శాతం మేరకు వైద్యానికి కేటాయించవలసి ఉండగా కేవలం 1 శాతం నిధులనే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఆ రంగానికి ప్రత్యేకించారు. ఇప్పటికే చతికిలపడిపోయిన ప్రభుత్వ విద్యా రంగాన్ని మెరుగుపర్చడానికి ఎంతో చేయవలసి ఉంది. అయినా బడ్జెట్‌లో ఈ రంగాన్ని కూడా చిన్న చూపే చూస్తున్నారు. దేశంలో ఏటా 26 కోట్ల మంది వివిధ కోర్సుల్లో కొత్తగా చేరుతున్నారు. కనీసం 6 కోట్ల మంది చదువుకు దూరంగా బతుకుతున్నారు అని విద్యా హక్కు వేదిక వెల్లడించింది. వచ్చే రెండేళ్లల్లో జిడిపిలో 6 శాతం నిధులు విద్యపై ఖర్చు చేయకపోతే అవసరాలకు తగినట్టుగా ఆ రంగం పుంజుకోజాలదని నీతిఅయోగ్ స్పష్టం చేసింది. దేశంలో నేర్పుతున్న విద్య కనీస ప్రమాణాల్లోనైనా లేకపోడం వల్లనే నిరుద్యోగం ప్రబలుతున్నది. ఇలా వైద్య, విద్యా రంగాలు రెండింటికీ భారీగా కేటాయింపులు జరిపి దేశ ప్రజల వికాసానికి విశేషంగా పాటుపడవలసిన తరుణంలో అందుబాటులోని నిధులలో అధిక భాగం రక్షణ రంగానికే కుమ్మరించడం ఆదర్శప్రాయమైన విధానం కాదు.

India 3rd Largest Military Spender in World: SIPRI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News