Monday, April 29, 2024

ఇంగ్లండ్ ఆశలు సజీవం

- Advertisement -
- Advertisement -

India lost second ODI against England

 

చెలరేగిన స్టోక్స్, బెయిర్‌స్టో మెరుపులు, రాహుల్ సెంచరీ వృథా, రెండో వన్డేలో భారత్ ఓటమి, 1-1తో సిరీస్ సమం

పుణె: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య ఆదివారం చివరి వన్డే జరుగనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టాప్ ఆర్డర్ రాణించడంతో ఇంగ్లండ్ అలవోక విజయంతో సిరీస్‌ను సమం చేసింది.

శుభారంభం..

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయ్ 52 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 55 పరుగులు చేసి రనౌటయ్యాడు. అప్పటికే తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించాడు.

స్టోక్స్ వీర విధ్వంసం..

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఇటు స్టోక్స్ అటు బెయిర్‌స్టో భారత బౌలర్లను హడలెత్తించారు. ఈ జోడీని కట్టడి చేయడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు. ఎలాంటి బంతినైనా ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తూ పరుగుల వరద పారించారు. ఇక స్టోక్స్ అయితే సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని దెబ్బకు బౌలర్లు లయ తప్పారు. ఇదే క్రమంలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ 52 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. స్టోక్స్ ఒక పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

బెయిర్‌స్టో శతకం

మరోవైపు బెయిర్‌స్టో చిరస్మరణీయ సెంచరీని సాధించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బెయిర్‌స్టో 112 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో స్టోక్స్‌తో కలిసి రెండో వికెట్‌కు 175 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ జోస్ బట్లర్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ రెండు పరుగుల తేడాతో మూడు వికెట్లను కోల్పోయింది. అయితే డేవిడ్ మలాన్ 16 (నాటౌట్), లియామ్ లివింగ్‌స్టోన్ 27 (నాటౌట్) జాగ్రత్తగా ఆడి మరో వికెట్ కోల్పోకుండానే ఇంగ్లండ్‌కు విజయం సాధించి పెట్టారు.

రాహుల్ సెంచరీ..

అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (4), రోహిత్ శర్మ (25)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్‌లు సమన్వయంతో ఆడి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 66 పరుగులు చేశాడు. ఇదే సమయంలో రాహుల్‌తో కలిసి మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 114 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 108 పరుగులు చేశాడు.

పంత్, హార్దిక్ మెరుపులు..

మరోవైపు రిషబ్ పంత్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. రాహుల్‌తో కలిసి స్కోరును పరిగెత్తించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేసిన పంత్ 40 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 77 పరుగులు చేశాడు. ఇక మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ 16 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో ఫోర్‌తో 35 పరుగులు సాధించాడు. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News