Monday, April 29, 2024

పాక్‌తో పోరు భారత్‌కు తేలికేం కాదు..

- Advertisement -
- Advertisement -

దుబాయి : ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ టీమిండియాకు అంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర వేదికలతో పోల్చితే యుఎఇలో పాకిస్థాన్‌కు మంచి రికార్డు ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అంతేగాక ఇటీవల జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో కూడా ఇక్కడ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి ఎదురైన విషయాన్ని మరువ కూడదని వారు హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ నిలకడైన విజయాలు సాధిస్తుండడం కూడా వారికి కలిసి వచ్చే అంశంగా వారు పేర్కొంటున్నారు.

మరోవైపు విరాట్ కోహ్లి ఫామ్ లేమీతో సతమతమవుతుండడం కూడా భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని వారంటున్నారు. మరోవైపు భారత్‌తో పోల్చితే దుబాయి స్టేడియంపై పాకిస్థాన్ ఆటగాళ్లకే మంచి అవగాహన ఉందనే విషయాన్ని మరువకూడదంటున్నారు. కొన్నేళ్లుగా వివిధ సిరీస్‌లలో దుబాయిని పాకిస్థాన్ హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగించుకుంటుండం కూడా వారికి సానుకూల అంశమేనని పేర్కొంటున్నారు. ఇక స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది లేకున్నా పాకిస్థాన్ బౌలింగ్ విభాగం బలంగానే ఉందని, ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లకు ఆ జట్టులో కొదవలేదని వారు వివరిస్తున్నారు. దీనికి తోడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని అతనితో భారత బౌలర్లకు ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఫకర్ జమాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ తదితరులతో పాకిస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉందన్నారు. ఇలాంటి స్థితిలో పాకిస్థాన్‌ను ఓడించడం టీమిండియాకు అంత సులువు కాదని, దీని కోసం సర్వం ఒడ్డి పోరాడక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదిలావుండగా ఆసియాకప్‌కే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆదివారం ఈ మ్యాచ్ జరుగనుంది. దాయాదిల మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడు పోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆసియాకప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు ఒక గ్రూప్‌లో ఉన్నాయి. మరో గ్రూప్‌లో శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు చోటు సంపాదించాయి. హాంకాంగ్ క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ఆసియాకప్‌కు అర్హత సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News