Saturday, April 27, 2024

కోహ్లి సేనకు పరీక్ష

- Advertisement -
- Advertisement -

India vs England first Test today

ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేటి నుంచి తొలి టెస్టు

నాటింగ్‌హామ్: సుదీర్ఘ భారత్‌-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వరల్డ్ టెస్ట్ చాంపింయన్‌షిప్ సీజన్2లో ఇంగ్లండ్, భారత్‌లకు ఇదే తొలి సిరీస్ కావడంతో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. భారత్ చాలా రోజుల ముందే ఇంగ్లండ్‌కు చేరుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం దాదాపు రెండు నెలల క్రితం భారత్ ఇక్కడికి చేరింది. ఇక వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఆ తర్వాత భారత క్రికెటర్లకు నెల రోజుల విరామం ప్రకటించారు. విరామం తర్వాత క్రికెటర్లు నాటింగ్‌హామ్ చేరుకుని క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక సిరీస్ కోసం పటిష్టమైన బయోబబుల్ వాతావరణాన్ని సృష్టించారు.

ఆందోళన కలిగిస్తున్న గాయాలు

సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లు గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా సోమవారం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా గాయం బారిన పడ్డాడు. దీంతో అతను తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. వీరిద్దరూ అందించే శుభారంభంపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంది.

పుజారాకు కీలకం

ఇక ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారాకు సవాల్ వంటిదే అనడంలో సందేహం లేదు. కొంతకాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతున్న పుజారా కనీసం ఈ సిరీస్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న పుజారాకు విదేశాల్లో మంచి రికార్డే ఉందని చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన సిరీస్‌లలో అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇలాంటి స్థితిలో పుజారాను తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ సిరీస్‌లో విఫలమైతే మాత్రం అతనికి టీమిండియాలో స్థానం ప్రశ్నార్థకం కావడం ఖాయం. మరోవైపు వైస్ కెప్టెన్ అజింక్య రహానె పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొన్నేళ్లుగా అతను టెస్టుల్లో అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. ఒకప్పుడూ పరుగుల వరద పారించిన సీనియర్లు పుజారా, రహానె వరుస వైఫల్యాలు చవిచూడడం టీమిండియాకు ప్రతికూలంగా మారుతోంది. ఇక కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌లో వీరిద్దరూ మెరుగ్గా రాణించక తప్పదు.

అందరికళ్లు విరాట్‌పైనే..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా సిరీస్ కీలకంగా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఒకప్పుడూ వరుస సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా ఓ వెలుగు వెలిగిన కోహ్లి కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తన పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. తెలుగుతేజం హనుమ విహారి, యువ సంచలనం రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు కూడా బ్యాట్‌ను ఝులిపించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ భారాన్ని ఇశాంత్ శర్మ, బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌లు మోయనున్నారు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఫేవరెట్‌గా రూట్ సేన

ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై సిరీస్ జరుగుతుండడం రూట్ సేనకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా ఉంది. భారత్‌తో పోల్చితే ఇంగ్లీష్ జట్టులో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్టువర్ట్ బ్రాడ్, శామ్ కరన్, ఓలి పోప్, మార్క్‌వుడ్ వంటి స్టార్‌లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. రోరి బర్న్, డొమినిక్ సిబ్లి, కెప్టెన్ రూట్, జానీ బెయిర్‌స్టో, బట్లర్ తదితరులతో బ్యాటింగ్ కూడా పటిష్టంగా ఉంది. అంతేగాక అండర్స్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్ ఉండనే ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ గెలుపే లక్షంగా తొలి టెస్టుకు సిద్ధమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News