Saturday, April 27, 2024

ఒక్కతాటి పైకి వద్దాం

- Advertisement -
- Advertisement -

భారతావనిలో మతోన్మాద కోరలు
భిన్నత్వంలో ఏకత్వం, సకల సంస్కృతుల సంగమానికి ముప్పు
అణగారిన వర్గాల కోసం ఏకమవుదాం
సామాజిక న్యాయం కోసం అఖిల భారత సమాఖ్యగా ఏర్పడుదాం
పార్టీల తరఫున ఒక్కో ప్రతినిధిని సూచించండి
కాంగ్రెస్, వామపక్షాలు, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సహా 37 పార్టీల చీఫ్‌లకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలు

చెన్నై : అణగారిన వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు సామాజిక న్యాయం కోసం తాము ఏర్పాటు చేయబోయే అఖిల భారత సమాఖ్యతో కలిసి రావాలని డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దేశంలో రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు బుధవారంనాడు ఆయన బిజెపి మినహా ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సహా దేశంలోని 37 రాజకీయ పార్టీల నాయకత్వాలకు లేఖలు రాశారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న మత దురభిమానం, మతాధిపత్యం కారణంగా అద్భుతమైన భిన్నత్వంలో ఏకత్వం, భిన్న సంస్కృతుల సంగమానికి ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ భయాలను నిలువరించాలంటే సమానత్వం, ఆత్మ గౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసం కలిగిన వారంతా ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నది కాదని, ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగా ఈ గణతంత్ర భారతంలో భిన్న వర్గాలకు గుర్తింపు లభించిందని, దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడడం, జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం కోసం అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయబోతున్నట్లు, అందులో భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలు, పౌర సమాజం, సంస్థలను ఒక వేదికపైకి ఆహ్వానిస్తానని ఇటీవల గణతంత్ర దినోత్సవ సందేశంలో చెప్పినట్లు స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరికి ఆర్థిక సమానత్వం, రాజకీయ, సామాజిక హక్కులు, అవకాశాలు కల్పించబడాలని అన్నారు. అప్పుడే రాజ్యాంగ రూపకర్తల ఆశయాలను సాధించడమే కాకుండా సమసమాజాన్ని స్థాపించినవారమవుతామన్నారు. తమిళనాడులో ప్రతి అణువు సామాజిక న్యాయ విప్లవం గురించే మాట్లాడుతుందని, పెరియార్ రామస్వామి అడుగుజాడల్లో నడుస్తుందన్నారు. తమిళ ప్రజల్లో నరనరాన పెరియార్ సామాజిక న్యాయం అనే భావనను నింపి వెళ్లారని స్టాలిన్ గుర్తు చేశారు. ఆయన నెలకొల్పిన ఆదర్శ భావాల పునాదులపై 8 దశాబ్దాలుగా తమిళ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. పెరియార్ అడుగుజాడల్లోనే డిఎంకె నడవడమే కాకుండా అణగారిన వర్గాల పురోభివృద్ధిక కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే అఖిల భారత స్థాయిలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన పోరాటం చేస్తున్నామని, అది తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దేశంలో సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను ఏర్పాటు చేస్తున్న అఖిల భారత సమాఖ్య తప్పకుండా కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం అఖిల భారత సమాఖ్య(ఎఐఎఫ్‌ఎస్‌జె)కు తమతమ పార్టీల తరపున ఒక్కో వ్యక్తిని, లేదా ప్రతినిధిని ఎంపిక చేసి తమకు తెలియజేయాలని లేఖ ద్వారా స్టాలిన్ కోరారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కడంలో అన్ని పార్టీలు తమవంతు పాత్ర పోషిస్తాయని అభిలషిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు.

సోనియా గాంధీ(కాంగ్రెస్), పన్నీర్ సెల్వం(ఎఐఎడిఎంకె), లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్‌జెడి), ఫరూక్ అబ్దుల్లా(ఎన్‌సి), శరద్ పవార్(ఎన్‌సిపి), డి.రాజా(సిపిఐ), సీతారాం ఏచూరి(సిపిఎం), దేవెగౌడ(జెడిఎస్), కె.చంద్రశేఖరరావు(టిఆర్‌ఎస్), చంద్రబాబు నాయుడు(టిడిపి), నవీన్ పట్నాయక్(బిజెడి), మమతా బెనర్జీ(టిఎంసి), మెహబూబా ముఫ్తీ(పిడిపి), ఉద్ధవ్ థాక్రే(శివసేన), అరవింద్ కేజ్రీవాల్ (ఎఎపి), జగన్మోహన్ రెడ్డి(వైఎస్‌ఆర్‌సిపి), హేమంత్ సోరెన్(జెఎంఎం), ఎన్.రంగస్వామి(ఎన్‌ఆర్ కాంగ్రెస్), లలన్ సింగ్(జెడియు), అఖిలేష్ యాదవ్(ఎస్‌పి), మాయావతి(బిఎస్‌పి), పవన్ కల్యాణ్(జనసేన), వెలప్పన్ నాయర్(ఎఐఎఫ్‌బి), అసదుద్దీన్ ఒవైసి(ఎఐఎంఐఎం), కెఎం ఖదీర్(ఐయుఎంఎల్), రేణు జోగి(జనతా కాంగ్రెస్), అమరీందర్ సింగ్(పంజాబ్ లోక్ కాంగ్రెస్), సుఖ్బీర్ సింగ్ బాదల్(ఎస్‌ఎడి), చిరాగ్ పాశ్వాన్(లోక్‌జనశక్తి చీలిక వర్గం), రాజ్ థాక్రే(ఎంఎన్‌ఎస్), ఒంప్రకాశ్ చౌతాలా(ఐఎన్‌ఎల్‌డి) తదితర పార్టీలకు లేఖ స్టాలిన్ లేఖలు రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News