Monday, April 29, 2024

సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

Inquiry in High Court on regularization of Sadabainama

 

కొత్త దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్: సాదా బైనామాల క్రమబద్దీకరణపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవిదాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈక్రమంలో కొత్త దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం అమలు తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిశీలించవద్దని, రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్దీకరణ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే కొత్త రెవెన్యూ చట్టానికి ముందు దరఖాస్తులను పరిశీలించవచ్చని హైకోర్టు తెలిపింది. అక్టోబర్ 29 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు.

ఈక్రమంలో పేద చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎజి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు చట్టాలకు లోబడే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధత లేని జివొలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది. అలాగే సాదా బైనామాల కోసం 2016లో ఓ సారి అవకాశం ఇచ్చారని ఇప్పుడు పాత తేదీలతో కాగితాలు సృష్టించి దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అక్టోబర్ 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయన్నారు. అక్టోబర్ 29 నుంచి మంగళవారం నాటి వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయన్నారు.

కౌంటర్ దాఖలుకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ రెండు వారాల గడువు కోరారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 6,74,201 దరఖాస్తులు పరిశీలించవద్దని హైకోర్టు తెలిపింది. రిజిస్ట్రేషన్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం అక్టోబరు 29 తర్వాత అందిన దరఖాస్తుల పరిశీలన నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు అక్టోబరు 29 తర్వాత చేసుకున్న దరఖాస్తులకు సంబంధించిన క్రమబద్ధీకరణ ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు అందిన దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించవచ్చునని, కాకపోతే తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News