Wednesday, May 1, 2024

అవకాశం వస్తే డబ్బింగ్‌తో పాటు పాటలు కూడా పాడతా!

- Advertisement -
- Advertisement -

Interview with Priya prakash varrier

 

ప్రియా ప్రకాశ్ వారియర్… యువకులు ఈ అమ్మాయిని మర్చిపోవడం అంత సులభం కాదు. మలయాళంలోని ఓ సినిమాలో ఆమె కన్నుగీటిన దృశ్యాన్ని యువకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యం అప్పట్లో జోరుగా వైరల్ అయి యువకుల మతులు పోగొట్టింది. ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు ‘చెక్’ చిత్రంలో నటించింది. నితిన్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘చెక్’. ఈ చిత్రం 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

అందుకే ఓకే చేశా…

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘మనమంతా’ చూశా. తెలుగు కాదు… మలయాళంలో. అక్కడ ‘విస్మయం’ పేరుతో విడుదలైంది. అందులో నా అభిమాన హీరో మోహన్ లాల్ నటించడంతో మిస్ కాలేదు. ఆ సినిమా చూసినప్పుడు చందూ సార్ ఎంత గొప్ప డైరెక్టర్ అనేది అర్థమైంది. ఆయన ఫోన్ చేసి… ‘చెక్’లో నువ్వు నటించాలని అడిగారు. నితిన్, రకుల్ చేస్తున్నారని చెప్పారు. మంచి స్టార్ కాస్ట్, మంచి ప్రొడక్షన్ హౌస్ కనుక హ్యాపీగా ఈ సినిమాకు ఓకే చేశా.

అడ్వెంచరస్ గర్ల్ తరహాలో…

సినిమాలో నా పాత్ర గురించి ఎక్కువ చెప్పలేను. కానీ హీరో ఆదిత్య ప్రేయసి యాత్ర పాత్రలో నటిస్తున్నాను. ఆదిత్యగా నితిన్ అద్భుతంగా నటించారు. ఆదిత్య ప్రయాణమే ‘చెక్’. ఆ ప్రయాణంలో యాత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అడ్వెంచరస్ గర్ల్ తరహాలో నా పాత్ర ఉంటుంది.

అప్పుడు టెన్షన్ పడ్డా…

-నితిన్ మంచి అనుభవం ఉన్న హీరో. నేను ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించాను. అందుకని అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రారంభంలో టెన్షన్ పడ్డాను. అయితేసెట్‌లో అందరూ నేను కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకున్నారు. నితిన్ సీనియర్, నేను న్యూకమర్ వంటి తేడాలు చూపించలేదు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సమానంగా చూశారు.

రీడింగ్ సెషన్స్‌లో…

-షూటింగ్ ప్రారంభించడానికి రెండు రోజుల ముందు దర్శకుడు చంద్రశేఖర్, కో డైరెక్టర్లతో కలిసి కొన్ని రీడింగ్ సెషన్స్‌లో పాల్గొన్నా. ప్రతి డైలాగ్ చదివాను. దాని అర్థం ఏంటో అడిగి తెలుసుకున్నాను. నేను ఏం చెబుతున్నానో నాకు పూర్తిగా తెలిస్తే… భావోద్వేగాలను బాగా పలికించగలను. సెట్స్‌లో కూడా డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత నెక్స్ సీన్‌కు సంబంధించిన డైలాగులు ప్రాక్టీస్ చేశా.

అది కుదరలేదు…

తెలుగులో ప్రైవేట్ సాంగ్ ‘లడీ లడీ’ పాడాను. అవకాశం వస్తే నా సినిమాల్లోనూ పాడాలని అనుకుంటున్నా. ‘చెక్’లో ఒకే ఒక పాట ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ ఉంది. ముందు దాన్ని నాతో పాడించాలని అనుకున్నారు. ఎందుకంటే… మేం షూటింగ్ చేసేటప్పుడు సెట్స్‌లో నేను పాటలు హమ్ చేస్తూ ఉండేదాన్ని. అది దర్శకుడు గమనించారు. సాంగ్ ట్రాక్ పంపించారు. కానీ కుదరలేదు. ఇక నుంచి కుదిరితే నా పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో పాటు అవకాశం వస్తే పాటలు కూడా పాడాలని అనుకుంటున్నాను.

తదుపరి చిత్రాలు…

ప్రస్తుతం – తెలుగులో ‘ఇష్క్’ చేస్తున్నా. కన్నడలో ‘విష్ణుప్రియ’ చేశా. అందులో ఓ పాట కూడా పాడాను. హిందీలో ‘శ్రీదేవి బంగ్లా’తో పాటు మరో సినిమాలో కూడా నటించా.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News