Wednesday, May 15, 2024

గాజాలో గతితప్పిన యుద్ధం

- Advertisement -
- Advertisement -

ఖాన్ యూనిస్ : ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ ఇప్పుడు పూర్తిగా దారితప్పింది. గాజాలోని అతి పెద్ద అల్ షిఫా ఆసుపత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సేనలు లోపలికి చొచ్చుకువెళ్లి సోదాలకు దిగారు. ఈ ఆసుపత్రి లోపల హమాస్ మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో ఇజ్రాయెల్ సేనలు దీనిపై విరుచుకుపడ్డాయి. లోపల చాలా రోజులుగా సరైన ఔషధాలు అందక , కనీస ఏర్పాట్లు లేక, చావు బతుకుల మధ్య వందలాదిగా రోగులు బెడ్స్‌పై ఉన్న దశలోనే సేనలు లోపలికి చొరబడ్డాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆసుపత్రి లోపల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందనేది అయోమయంగా మారింది. ఇప్పటికే భూతల దాడిని మరింత ఉధృతం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పలు దిక్కుల్లో గాజాసిటిపైనా, ఉత్తర ప్రాంతంలో తన అదుపు చాటుకుంది.

షిఫా హాస్పిటల్ ఇప్పుడు బాధిత పాలస్తీనియన్ల ఆర్తనాదాలకు, సాయుధ బలగాల పరస్పర భీకర పోరుకు ప్రతీక అయింది. అక్టోబర్ 7వ తేదీనాటి హమాస్ దాడి తరువాతి క్రమంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంది. భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్ హమాస్‌ను పూర్తిగా దెబ్బతీసేందుకు కార్యాచరణకు దిగింది. హమాస్ మిలిటెంట్లు పాలస్తీనియా పౌరులను తమ రక్షణకవచాలుగా వాడుకుంటున్నారని, వీరిని ముందుకు నెట్టి తాము తప్పించుకోవడం లేదా, దాడికి పదును పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనిని పాలస్తీనియా అధికారులు ఖండిస్తున్నారు. ఎవరి వాదన వారికి ఉందని, అయితే చివరికి బాధితులు అయ్యేది సామాన్య పౌరులు అని వాపోతున్నారు.

కాంపౌండ్‌లోకి మిలిటరీ ట్రక్కులు …ఎమర్జెన్సీ వార్డుల్లో సైనికులు
షిఫా ఆసుపత్రిలో ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందని గాజాలోని ఆసుపత్రుల డైరెక్టరు మెహమ్మద్ జాఖౌత్ తెలిపారు. ఇజ్రాయెల్ సేనల ట్యాంకులు కాంపౌండ్ దాటి వచ్చాయి. సైనికులు ఆసుపత్రి భవనంలోకి వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులు, సర్జరీ విభాగాలను కూడా వదలకుండా తనిఖీలకు దిగుతున్నారని తెలిపారు. పలువురు రోగులకు అత్యవసర చికిత్సలు అందించే విభాగాలలో భయానక పరిస్థితి ఏర్పడిందని వివరించారు. వార్తాసంస్థలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పలువురు రోగులు, వృద్ధులు, మహిళలు వణికిపోతున్నారు.

చికిత్సలకు కోసం తరలివచ్చిన తమకు వెలుపల ఉండే స్వేచ్ఛ లేదని, లోపల పరిస్థితి చావు బతుకుల నడుమ ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక వారి సమీప బంధువులు చాలా మంది రోగులను వదిలిపెట్టి వెళ్లుతున్నారు. సైన్యం పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు రోగుల ఆక్రందనలు, నిస్సహాయత పరిస్థితిని దిగజార్చిందని, ఇక తాము రోగులను ఆదుకునే పరిస్థితి ఏమీ లేదని, వారి ప్రాణాలను గాలికి వదిలిపెట్టి రావడమే తమ పరిస్థితి అయిందని అధికారులు తెలిపారు.
నిర్థిష్ట లక్షిత ఆపరేషన్ ః ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిలో హమాస్ కమాండ్ వ్యవస్థ
తాము రోగులను భయభ్రాంతులను చేస్తున్నామనే వాదనను ఇజ్రాయెల్ సైనికాధికారులు తోసిపుచ్చారు. భూతల దాడుల క్రమంలో తాము అత్యంత నిశితంగా, నిర్థేశిత లక్షంతో అత్యంత సున్నితమైన కార్యచరణకు దిగాల్సి వచ్చిందని వివరించారు. షిఫా హాస్పిటల్‌లో ఓ ప్రాంతం గురించి తమకు నిర్థిష్ట సమాచారం అందిందని , దీనితో హమాస్‌ను టార్గెట్ చేసుకుని ఈ దాడికి దిగాల్సి వచ్చిందని, అయినా ఆసుపత్రిలోపల తాము సోదాలకు దిగుతున్నామని తెలిపారు. గాజా నిర్వాహక అధికారులు ఇప్పుడు వెంటనే గాజా ఆసుపత్రిలో వెంటనే అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలని కోరుతున్నారని, కానీ తాము ఇందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఆసుపత్రి పనిచేసే తీరులో పనిచేయాల్సి ఉంటుంది. ఇతరత్రా కార్యకలాపాలకు దీనిని వాడుకుంటే తమ పని తాము చేసుకువెళ్లుతామని తెలిపారు.

షిఫాలోపల, ఇక్కడి నేలమాళిగలో హమాస్‌కు భారీ స్థాయిలో స్థావరాలు ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడ హమాస్ విస్తృత స్థాయి బలగం పనిచేస్తోందని తెలిపిన ఇజ్రాయెల్ సేనలు ఇందుకు ఎటువంటి సాక్షాధారాలను వెలువరించలేదు. మరో వైపు హమాస్ , ఇక్కడి ఆసుపత్రి వర్గాలు ఇక్కడ సాయుధ బలగాల ఉనికి ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాయి. దాడులు సోదాలకు గంటల ముందు అమెరికా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆసుపత్రి హమాస్‌కు స్థావరంగా మారిందని, ఇక్కడ సొరంగాల ద్వారా మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని తమకు సొంతంగా ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని తెలిపారు. ఇక్కడ బందీలను దాచి ఉంచారని అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత కొద్ది సేపటికి ఆసుపత్రిపై సైన్యం దాడి జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News