Saturday, May 11, 2024

యుపిలో ఐటి దాడుల కలకలం

- Advertisement -
- Advertisement -
IT Raids At Several Close Aides Of Akhilesh Yadav
అఖిలేష్ యాదవ్ సన్నిహితుల ఇళ్లలో సోదాలు
ఎన్ని దాడులు చేసినా సైకిల్ జోరు ఆగదు: అఖిలేష్

లక్నో: యుపి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్‌వాది పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్లపై ఆదాయం పన్ను శాఖ దాడులు చేయడం కలకలం సృష్టించింది. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ కి చెందిన నివాసాలతో పాటు పలు జిల్లాల్లో ఆ పార్టీకి చెందిన నేతల ఇళ్లపై ఐటి దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. రాజీవ్ రాయ్‌కి చెందిన మావులోని నివాసాలపైన, అలాగే అఖిలేష్‌కు సన్నిహితుడుగా భావిస్తున్న జైనేంద్ర యాదవ్, మైన్‌పురిలో వ్యాపారవేత్త మనోజ్ యాదవ్ నివాసాలలో ఐటి బృందాలు శనివారం సోదాలు నిర్వహించాయి.

దాడుల వివరాలను ఐటి విభాగం వెల్లడించలేదు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని మాత్రమే తెలిపింది. రాజీవ్ రాయ్‌కి చెందిన సంస్థ కర్నాటకలో చాలా విద్యాసంస్థలను నడుపుతోంది. ఈ సంస్థ పన్ను ఎగవేతకు సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులను రాయ్ తీవ్రంగా ఖండించారు. ‘నాకు ఎలాంటి క్రిమినల్ బ్యాక్‌గౌండ్ లేదు. నా దగ్గర నల్లధనం కూడా లేదు. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ప్రభుత్వానికి అది నచ్చడం లేదు. దాని ఫలితమే ఈ దాడులు’ అని రాయ్ మీడియాతో అన్నారు.

ఎన్ని దాడులు జరిగినా భయం లేదు: అఖిలేష్

కాగా తమ పార్టీ నేతల ఇళ్లపై ఐటి దాడులు జరపడంపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. అధికార బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రజలను భయపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ దారిలోనే బిజెపి కూడా వెళుతోందని అన్నారు. యుపి ప్రజలంతా విపక్షం వైపే ఉన్నారన్నారు. ఓడిపోతామన్న భయం బిజెపిలో పెరిగే కొద్దీ విపక్షాలపై దాడులు కూడా పెరుగుతాయన్నారు. ఏం జరిగినా సమాజ్‌వాది పార్టీ రథయాత్ర, ఇతర కార్యక్రమాలు ఆగవన్నారు.‘ ఇప్పటికైతే ఐటి శాఖ వచ్చింది. తర్వాత ఇడి వస్తుంది.. సిబిఐ వస్తుంది. కానీ సైకిల్ (సమాజ్‌వాది పార్టీ గుర్తు) మాత్రం ఆగదు. ఇదే వేగంతో ముందుకెళ్తాం. యుపిలో బిజెపిను తుడిచిపెట్టుకు పోయేలా చేస్తాం. యుపి ప్రజలు తెలివి లేనోళ్లేం కాదు. రాజీవ్ రాయ్ ఇంటిపై నెల రోజుల ముందు సోదాలు ఎందుకు జరపలేదు? ఇప్పుడే ఎందుకు? ఎన్నికలు దగ్గరపడ్డాయనా?’ అంటూ ప్రశ్నలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News