Saturday, April 1, 2023

జైశంకర్ వాషింగ్టన్ పర్యటన

- Advertisement -
- Advertisement -

Jaishankar Washington tour

 

‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్‌తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్ తదితరాలపై భారత్ అమెరికా ద్వౌపాక్షిక చర్చ’, ‘ట్విట్టర్, వాట్సాప్ గురించి అమెరికా పర్యటనలో జైశంకర్ చర్చ’, ‘జైశంకర్ అమెరికా పర్యటనలో తొలి చర్చనీయాంశం చైనా’, ‘చతుష్టయ కూటమికి వెన్నుదన్నుగా భారత్ ’ మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మే 24 నుంచి 28 వరకు జరిపిన అమెరికా పర్యటనకు ముందు, ఆ సమయంలో వచ్చిన కొన్ని వార్తల శీర్షికలు ఇవి. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా అన్నీ విడియో కాన్ఫరెన్సుల ద్వారా జరుగుతుంటే స్వయంగా వెళ్లటం అంటే ముఖాముఖి తేల్చుకునేవి ఉండి ఉంటాయని జనం అనుకున్నారు. ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారు, ఏమి సాధించారు అని దేశం తిరిగి వచ్చిన తరువాత ఎవరైనా అడిగితే ఏం చెబుతారో తరువాత చూద్దాం.

జైశంకర్ పర్యటనకు ముందు వివిధ మీడియా సంస్ధలు పర్యటన లక్ష్యం, ఉద్దేశాల గురించి కథనాలు రాశాయి. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లుగా పరిపరి విధాలుగా అవి ఉన్నాయి. జేవ్‌‌సుబాండ్‌గా మోడీ అభిమానులు వర్ణించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికన్లతో ఫోన్లో మాట్లాడి దెబ్బకు దిగివచ్చేట్లు చేశారు చూడండి అంటూ ఏప్రిల్ నాలుగవ వారంలో కాషాయ దళాలు ఊదరగొట్టాయి. ఇంకేముంది ఫోను పెట్టేలోగానే వ్యాక్సిన్ తయారీ ముడి పదార్ధాలతో అమెరికా విమానాలు గుంపులు గుంపులుగా ఎగురుకుంటూ బయలు దేరాయి చూడండి అన్నట్లుగా వాట్సాప్‌లో తెగ ప్రచారం చేశారు. ట్రంప్ బెదిరించగానే నిషేధం ఎత్తి వేసి ఎందుకంత ఆగ్రహం జీహుజూర్ అంటూ మనం హైడ్రోక్సీక్లోరోక్విన్ మాత్రలు పంపిన మాదిరి మనకు వ్యాక్సిన్ ముడి పదార్ధాలను పంపటానికి అక్కడున్నది నరేంద్ర మోడీ కాదని గత ఐదు వారాల్లో రుజువైంది. వచ్చిన వార్తలను బట్టి అమెరికాలో వినియోగానికి అనుమతి ఇవ్వకుండానే కొనుగోలు చేసిన ఆరు కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను, మరో రెండు కోట్ల ఇతర కంపెనీల వ్యాక్సిన్లను మనకు విక్రయించటానికి లేదా దానంగా ఇవ్వటానికి మాత్రమే అమెరికా సుముఖంగా ఉంది.

బోలెడు సానుభూతి కబుర్లు తప్ప వ్యాక్సిన్ ముడి పదార్ధాల సరఫరా గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఒక వైపు ప్రాణాలు పోతున్నా, అక్కడ వాడని వాటి మీద కూడా నెలల తరబడి అమెరికా నిర్ణయం తీసుకోలేదని గమనించాలి. అమెరికా దానం చేసే వ్యాక్సిన్ల కోసం, ముడి పదార్దాలు విక్రయించండి మహా ప్రభో అని స్వయంగా వెళ్లి ఐదు రోజులు ఉండాల్సి అవసరం ఉందా? కేవలం వాటి కోసమే అయితే అవసరం లేదు.

మనకు కరోనా వ్యాక్సిన్ ముడి పదార్ధాలను అమెరికా ఇవ్వదా? ఎందుకివ్వదు, ఇస్తుంది. ఎప్పుడు? ఉద్రిక్తలను మరింతగా పెంచకుండా, దెబ్బ లాటలకు దిగకుండా లడఖ్ సరిహద్దుల్లో ఉన్న సైన్యాల ఉపసంహరణ గురించి మనం చైనాతో జరుపుతున్న చర్చలు జో బైడెన్ సర్కార్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయా? చైనా విషయంలో భారత్ రాజీపడుతున్నదనే అనుమానం అమెరికాలో తలెత్తిందా? కరోనా కారణంగా మన దేశంలో తలెత్తిన విపత్కర పరిస్ధితిని వినియోగించుకొని మనల్ని మరింతగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టేందుకు వ్యాక్సిన్ ముడిపదార్దాల సరఫరాను ఎరగా వేస్తున్నదా? మన దేశం దానికి లొంగిపోతున్నదా? ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. హైడ్రోక్సీక్లోరోక్విన్ మాత్రలు మలేరియా చికిత్సలో వినియోగిస్తారు. అవి కరోనా నివారణకు కూడా పనికి వస్తాయోమో అన్న ఆలోచన రాగానే మన దేశం వాటిపై నిషేధం విధించింది.

తన ఎన్నికలు ముందున్నాయి, అమెరికాలో కరోనా పుచ్చిపోతోంది, భారత్ సదరు ఔషధం మీద నిషేధం విధించిందంటే నిజంగానే అది పని చేస్తుందేమో అన్న ఆశతో డోనాల్డ్ ట్రంప్ తనకు కౌగిలింతల సన్నిహితుడు అని కూడా చూడకుండా బహిరంగ బెదిరింపులతో నరేంద్ర మోడీని అవమానించాడు. ఇప్పుడు వ్యాక్సిన్లు తప్ప మరొక చికిత్సలేదు అని తేలిపోయింది, అవి అందుబాటులోకి వచ్చాయి గనుక వాటితో రాజకీయం చేసేందుకు అమెరికా నిర్ణయించుకుంది. ముందు చూపులేని కారణంగా మోడీ సర్కార్ జనాన్ని బలి చేస్తున్నది. ముతక సామెత చెప్పినట్లు మంచమిరిగినా… అన్నట్లు కరోనా మహమ్మారిని కూడా సామ్రాజ్యవాదం తన ఎత్తుగడలకు అనుగుణ్యంగా వినియోగించుకుంటుంది అన్నది తేలిపోయింది. నిజానికి మన సర్కార్‌తో లెక్కలు తేలి ఉంటే జైశంకర్ పర్యటన సమయంలోనే వ్యాక్సిన్ ముడిపదార్దాల సరఫరా గురించి నిర్దిష్టమైన ప్రకటన అమెరికా వైపు నుంచి వెలువడి ఉండేది. జో బైడెన్ జనవరిలో అధికారాన్ని స్వీకరించిన తరువాత మన కేంద్ర మంత్రి ఒకరు అమెరికాలో పర్యటించటం ఇదే ప్రథమం. ప్రపంచ పరిణామాల గురించి ఎవరి దృష్టి వారికి ఉంటుంది, మన వైఖరి ఏమిటో కూడా వారు వినాలి కదా అని జైశంకర్ చెప్పారు.

తన పర్యటనలో ప్రతి సమావేశంలోనూ కరోనా మీద పోరు, వ్యాక్సిన్ సరఫరాలు, ఉత్పత్తి గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు చెప్పారు. అయినా అమెరికా వైపు నుంచి నిర్దిష్ట ప్రకటన లేదా సూచన లేదు. అంటే ఇంకా మన నుంచి ఏదో ఆశిస్తున్నది. ఇటీవలి అనుభవాల తరువాత అమెరికాతో పూర్తిగా అంటకాగితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నది స్పష్టమైంది. బహుశా దీనికి సూచికగానే తమ దేశ ప్రయోజనాలు, ప్రాధాన్యతలకు అనుగుణ్యంగానే విదేశాంగ విధానం కొనసాగుతుందని అమెరికా పర్యటనకు ముందు ఒక సమావేశంలో జైశంకర్ చెప్పారు. ఇలాంటి వైఖరి అమెరికన్లకు నచ్చదు. వారు ఆడించినట్లు ఆడే కీలు బొమ్మలుగా ఉండాలి. తాము కూడా ప్రపంచ స్ధాయి కార్పొరేట్లుగా ఎదగాలనుకుంటున్న మన దేశీయ కార్పొరేట్లకు అలాంటి లొంగుబాటు నష్టదాయకం కనుక అలాంటి వైఖరిని పూర్తిగా అంగీకరించరన్నది గత అనుభవం.

ఉదాహరణకు అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ యజమాని మన దేశం వచ్చినపుడు ఎక్కడ ముఖేష్ అంబానీకి కోపం వస్తుందో అని నరేంద్ర మోడీ కనీసం దర్శనానికి అనుమతి కూడా ఇవ్వలేదు. అమెజాన్ వాణిజ్య విస్తరణను అడుగడుగునా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా భారత్‌ను మరింతగా ముందుకు తోసేందుకే వ్యాక్సిన్‌ను ఆయుధంగా చేసుకొని అమెరికా ఇలా చేస్తున్నదని, సాయం చేసినా షరతులతో కూడినదే అవుతుందని చైనా పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాదు కరోనా రెండవ తరంగం విషయంలో వైఫల్యంతో తలెత్తిన జనాగ్రహాన్ని చల్లార్చేందుకు మోడీ సర్కార్ దౌత్యపరమైన బహిరంగ తమాషాకు పాల్పడిందని కూడా ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. అందుకే జైశంకర్ పర్యటన సాధించింది ఏమిటనే ప్రశ్నకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఒకవైపు చైనా పెద్ద ఎత్తున వివిధ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న నేపధ్యం, మా వ్యాక్సిన్ మాకే అన్న అమెరికా మీద ప్రపంచం అంతటి నుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక తమకు పనికిరాని దానిని గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు ఇతర షరతులను తగిలించి దానం పేరుతో ఆరు కోట్ల ఆస్ట్రాజెనెకా, మరో కోట్ల ఇతర వ్యాక్సిన్లు కలిపి ఎనిమిది కోట్ల డోసులను ఇతర దేశాలకు ఇస్తామని ప్రకటించింది. దానిలో మన దేశానికి ఎన్నో ఇంతవరకు తేల్చలేదు. ఇంతవరకు మనకు వచ్చిందేమైనా ఉంటే మిగతా దేశాల మాదిరి ఆక్సిజన్ కానసెంట్రేటర్లు, ఇతర చిన్నచిన్న పరికరాలు తప్ప కీలకమైన వ్యాక్సిన్ ముడిసరకుల సరఫరాలు లేవు. ఎప్పటిలోగా ఇచ్చేది కూడా ఇంతవరకు చెప్పలేదు. చతుష్టయ కూటమి ఆలోచన ఇప్పటిది కాదు. 2007లోనే రూపుదిద్దుకుంది తప్ప ముందుకు సాగలేదు. మరుసటి ఏడాదే దేశ రాజకీయ అంతర్గత విభేదాల కారణంగా ఆస్ట్రేలియా కూటమి నుంచి తప్పుకుంది. తిరిగి 2017లో చేరింది.

చైనా భారత్‌ల మధ్య సరిహద్దు ఘర్షణల నేపథ్యం, ట్రంప్ అధికారాన్ని కోల్పోవటంతో చతుష్టయంలో కొనసాగినా చురుకుగా ఉండకపోవచ్చని మన దేశాన్ని అమెరికా అనుమానించింది. అలాంటిదేమీ లేదు, పూర్తి స్ధాయిలో పని చేస్తామని ఈ పర్యటన సమయం లో జైశంకర్ స్పష్టం చేసినట్లు ఈ పర్యటన మీద వెల్లడైన విశ్లేషణలు, వ్యాఖ్యలు వెల్లడించాయి. ‘సభ్యులంగా దేనికైనా సిద్ధపడాలి, దాని గురించి మాకు చాలా స్పష్టత ఉంది. లేనట్లయితే మేము సభ్యులుగా ఉండజాలము. ఇప్పటి వరకు ఈ కూటమి సముద్ర ప్రయాణ భద్రత, సంబంధాల గురించే చర్చించేదిగా ఉంది, ఇటీవలి సంవత్సరాలలో అది సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సరఫరా వ్యవస్థలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి గురించి కూడా చర్చిస్తున్నది, అంటే అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల గురించి ఆందోళన ఉంది.

పెరుగుతున్న చైనా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పని చేస్తే మనకు ఒరిగేదేమీ లేదని గత ఏడు సంవత్సరాల అనుభవం నేర్పుతున్నా, మోడీ సర్కార్ వైఖరిలో పునరాలోచన ఉన్నట్లు కనపడదు. మరోవైపు చైనా నుంచి తనకు ఎదురవుతున్న సవాలును ఒంటరిగా ఎదుర్కోగలిగినప్పటికీ అర్ధికంగా లాభదాయకం కాదు గనుక మన వంటి దేశాలను అమెరికా తన వ్యూహంలోకి లాగుతున్నది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధంలేని, దాని లక్ష్యాల పట్ల ఏమాత్రం గౌరవం లేని శక్తులు నేడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌లో కూడా తరాలు మారి నయావుదారవాద విధానాల పట్ల మోజు పెరిగింది కనుకనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వాటిని అమలు జరిపారు. రాష్ట్రాల హక్కుల సమస్యల మీద ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు కూడా నయా ఉదారవాద విధానాలకు అనుకూలమే గనుక వాటికి అధికారం తప్ప కాంగ్రెసా, బిజెపినా అనే తేడా పెద్దగా ఉండదు.

ఎండమావులను చూసి నీటి సరస్సులుగా భావించినట్లు అమెరికా, పశ్చిమ దేశాలను చూసి మన దేశం వాటితో జత కట్టి లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇప్పటికే అమెరికా ఐరోపా ధనిక దేశాల మధ్య మిత్ర వైరుధ్యం ఉంది. తమకు పోటీగా మన వంటి మరొక దేశాన్ని ఎదగనిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. అనూహ్యంగా తమను సవాలు చేస్తున్న చైనాను దెబ్బ తీసేందుకు పొరుగునే దానికి చికాకు కలిగించే శక్తివారికి కావాలి. గతంలో మనలను లొంగదీసుకొనేందుకు పాకిస్ధాన్‌ను అమెరికా, పశ్చిమ దేశాలు ప్రయోగించినట్లే ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టాలన్నది బహిరంగ రహస్యం.

పాకిస్ధాన్ బావుకున్నదేమీ లేదు. మనకూ అదే మర్యాద జరగబోతున్నది. గతంలో అమెరికా సోవియట్ యూనియన్ ఢీకొన్న సమయంలో పరిస్ధితి వేరు, ఇప్పుడు వేరు. సోవియట్ స్ధానంలో చైనాను దెబ్బ తీయాలని చూస్తున్నారు. మొదటి విషయం చైనా నాటి సోవియట్ కాదు. నాడు సోవియట్‌కు వ్యతిరేకంగా యావత్ ఐరోపా ధనిక దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. తరువాత ఏం జరుగుతుందో తెలియదు గానీ ఇప్పుడు చైనాను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని అవి చూస్తున్నందున గతంలో మాదిరి అమెరికా ఏమి చెబితే అది నడవదు. ఈ తేడాను గమనించకుండా మన దేశం అమెరికాకు తోకగా మారితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News