Wednesday, May 1, 2024

బుమ్రాకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 9 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరచడంతో బుమ్రాకు టాప్ ర్యాంక్ వరించింది. ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లో భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బుమ్రా 881 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఐసిసి బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకున్న తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో బుమ్రా నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. కాగా, సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా 851 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

గతంలోనూ అతను రెండో ర్యాంక్‌లోనే కొనసాగాడు. అయితే భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కిందటిసారి అశ్విన్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. ఈసారి మాత్రం రెండు ర్యాంక్‌లు పడిపోయి మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక ర్యాంక్ కోల్పోయి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన జోష్ హాజిల్‌వుడ్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కాగా, అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన శ్రీలంక సంచలన బౌలర్ ప్రభాత్ జయసూర్య తాజా ర్యాంకింగ్స్‌లో మూడు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి దూసుకెళ్లాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో అతను తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నాడు. కాగా, ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ అండర్సన్ ఒక ర్యాంక్ పైకి ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి స్పిన్నర్ నాథన్ లియాన్ రెండు ర్యాంక్‌లను మెరుగుపడి 8వ స్థానానికి చేరుకున్నాడు. భారత స్టార్ బౌలర్ జడేజా రెండు ర్యాంక్‌లు కోల్పోయి తొమ్మిదో ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్ ఓలి రాబిన్సన్ పదో ర్యాంక్‌లో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News