Monday, April 29, 2024

తాలిబన్లతో మసూద్ అజహర్ భేటీ

- Advertisement -
- Advertisement -
JeM chief Masood Azhar meets Taliban leadership
కాశ్మీర్‌లో ఉగ్ర చర్యలకు మద్దతు కోరిన జైషేమహ్మద్ అధినేత

న్యూఢిల్లీ: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఇటీవల అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ నేతలతో సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో తాము నిర్వహించే ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వాల్సిందిగా తాలిబన్ నేతలను మసూద్ కోరినట్టు భావిస్తున్నారు. గత వారం కాందహార్‌లో తాలిబన్ సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌తోపాటు మరికొందరు నేతలతో మసూద్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15న అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు వశం చేసుకున్నారన్న వార్తల పట్ల హర్షం వ్యక్తం చేసిన మసూద్, ఆ సందర్భంగా తాలిబన్లను అభినందిస్తూ మంజిల్‌కీ తరాఫ్(లక్షం దిశగా) అంటూ పాకిస్థాన్‌లోని తన అనుచరులకు ఓ సందేశాన్నిచ్చారు. అఫ్ఘన్‌ను ఆక్రమించడాన్ని ముజాహిదీన్ విజయంగా మసూద్ అభివర్ణించారు. ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం జిహాదీ(పవిత్ర యుద్ధం) నిర్వహించేవారిని ముజాహిదీన్‌లుగా పేర్కొంటారు.

పాక్‌లోని బహావల్‌పూర్ కేంద్రంగా జైషే మహ్మద్ తన ఉగ్ర కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. సిద్ధాంతపరంగా తాలిబన్లతో సాన్నిహిత్యమున్న సంస్థగా జైషేకు పేరున్నది. ఈ రెండు సంస్థలకు చెందిన ఉగ్రవాదులు సున్నీ ఇస్లామిక్ దియోబందీ పాఠశాలల్లో రాజకీయ శిక్షణ పొందేవారే కావడం గమనార్హం. 1999లో జైలు నుంచి విడుదలైన తర్వాత జైషే మహ్మద్‌ను మసూద్ స్థాపించాడు. అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్‌లో ఈ సంస్థ ఉగ్ర కార్యకలాపాల్ని కొనసాగిస్తోంది. జైషేతో తాలిబన్లకున్న గత సంబంధాలను దృష్టిలో పెట్టుకునే భారత నిఘావర్గాలు ఓ కన్నేసి ఉంచాయి. జమ్మూకాశ్మీర్‌లో నిఘాను మరింత పటిష్టం చేశాయి. కాగా, తాలిబన్లు మాత్రం అఫ్ఘన్‌ను ఆక్రమించిన తర్వాత తమ స్వరం మార్చారు. ఉగ్ర సంస్థలకు అఫ్ఘన్‌లో ఆశ్రయం ఇవ్వబోమని అన్నారు. అయితే, వారి మాటల్ని ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News