Saturday, April 27, 2024

ప్రధాని అసహనం.. కేజ్రివాల్ క్షమాపణ

- Advertisement -
- Advertisement -

Kejriwal livestreams meeting with Modi, profusely apologises when scolded

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మోడీ అసహనం వ్యక్తం చేశారు.సమావేశంలో కేజ్రివాల్ ప్రధానంగా ఢిల్లీలో ఆస్పత్రులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరతను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ‘ కొవిడ్‌పై పోరాడేందుకు జాతీయ ప్రణాళిక ఉంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆ దిశగా ముందుకెళ్లగలవు’ అంటూ ఆయన మాట్లాడుతుండగా వెంటనే ప్రధాని కల్పించుకొని ..‘ ఏం జరుగుతోంది. ఇది మన సంప్రదాయానికి, నిబంధనలకు పూర్తి విరుద్ధం. అంతర్గత సమాచారాన్ని ఒక ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నారు. ఇది సముచితం కాదు.

మనం సంయమనం పాటించాలి’ అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. కేజ్రివాల్‌ను ఉద్దేశించి మందలించారు. కాగా దీనిపై కేజ్రివాల్ స్పందిస్తూ ప్రధానని క్షమించమని కోరారు. జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. ఆ తర్వాత కేజ్రివాల్ తాను మాట్లాడుతున్న అంశాన్ని కొనసాగించారు. ఇలా ఈ సమావేశాన్నిప్రత్యక్ష ప్రసారం చేయడాన్న్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తప్పుబట్టాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ‘ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని మాకు కేంద్రంనుంచి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో .. మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. రహస్య సమమాచారం లేని ప్రజాప్రాముఖ్యత ఉన్న విషయాలు ప్రత్యక్ష ప్రసారం చేసిన సందర్భాలున్నాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని వివరణ ఇచ్చింది.

అంతకు ముందు కేజ్రివాల్ మాట్లాడుతూ ‘ సర్ మాకు మీ మార్గదర్శకత్వం కావాలి. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ లేకపోతే ఢిల్లీవాసులకు ప్రాణవాయువు లభించదా? ఢిల్లీకి రావలసిన ఆక్సిజన్ ట్యాంకర్‌ను వేరే రాష్ట్రంలో నిలిపి వేస్తే .. దాన్ని ఢిల్లీకి రప్పించేందుకు నేను ఎవరిని సంప్రదించాలో చెప్పండి. ఢిల్లీకి చేరకుండా పెద్ద ఎత్తున ట్యాంకర్లను నిలిపివేస్తున్న వేరే రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకోండి. ప్రధానిజీ.. మీరు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడండి.. అప్పుడే గ్యాస్ ఢిల్లీకి చేరుతుంది’ అని కేజ్రివాల్ ప్రధానిని అభ్యర్థించారు.

అలాగే ఢిల్లీ ఆస్పత్రుల్లో కొరతను తీర్చేందుకు పశ్చిమ బెంగాల్, ఒడిశాలనుంచి విమానాల ద్వారా ఆక్సిజన్‌ను తరలించే వీలు కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని కోరారు.సైన్యం సహకారంతో అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను స్వాధీనం చేసుకోవాలని, రవాణా సమయంలో ప్రతిఒక్క ట్రక్కుతో పాటు ఆర్మీ ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రివాల్ కోరారు. ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఉండడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారం కావడం చర్చకు దారి తీసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News