Saturday, April 27, 2024

సెకండ్ వేవ్ నుంచి ఇంకా విముక్తి పొందని కేరళ

- Advertisement -
- Advertisement -
Kerala not yet free from Corona second wave
థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి అదనపు జాగ్రత్తలపై సమీక్ష

తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ నుంచి కేరళ ఇంకా విముక్తి పొందలేదని, అందువల్ల థర్డ్ వేవ్ రాకుండా ప్రజలు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు పాటించాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి శనివారం హెచ్చరించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించడానికి ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర జనాభాలో సగం కన్నా ఎక్కువ మందికి కరోనా సంక్రమించే ప్రమాదం కనిపిస్తోందని డెల్టా వేరియంట్ నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మెజార్టీ జనాభా వ్యాక్సిన్ పొందేవరకు ఐసొలేషన్ పాటించాలని సూచించారు. ప్రతివారికి టీకా అందేలోపు థర్డ్ వేవ్ వ్యాపిస్తే ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉంటుందని, ఆస్పత్రి పాలయ్యే వారు ఎక్కువౌతారని పేర్కొన్నారు.

కావలసినన్ని టీకాలు అందుబాటు లోకి వస్తే యుద్ధప్రాతిపదికన టీకాల పంపిణీ జరుగుతుందని, అలాగే దేనినైనా ఎదుర్కోడానికి ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. టీకాలు పొందినప్పటికీ జాగ్రత్తలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే ఆక్సిజన్ లభ్యత, చికిత్స సదుపాయాలు ఎంతవరకు అందించ గలమో సమీక్షించారు. కేంద్ర , రాష్ట్ర పథకాల నిధులను, కార్పొరేట్ సంస్థలు, సేవా సంస్థల నుంచి విరాళాలు సమీకరించి కరోనా నియంత్రణకు ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పడానికి వినియోగించడానికి నిర్ణయించారు. రాష్ట్రంలో ఆగస్టు నాటికి 33 ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాలని, దాని ద్వారా 77 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాని కేరళ మెడికల్ సర్వీస్ కార్పొరేషన్‌కు మంత్రి జార్జి ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెడికల్ కాలేజీలు, మెడికల్ సెంటర్లలో కొవిడ్ వైద్యసరఫరాలు నిల్వ చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News