Sunday, April 28, 2024

బిజెపి గూటికి ఖుష్బూ

- Advertisement -
- Advertisement -

Khushboo sundar joins the BJP

 

కాంగ్రెస్‌ను వీడిన కొద్ది గంటల్లోనే చేరిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సోమవారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా, కర్నాటక బిజెపి నాయకుడు సిటి రవి, తమిళనాడు బిజెపి శాఖ అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో ఆమె న్యూఢిల్లీలో బిజెపిలో చేరారు. పార్టీలోని రాష్ట్ర నాయకులు తనను అణచివేస్తున్నారంటూ ఆరోపించి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తన రాజీనామా లేఖ సమర్పించిన ఖుష్బూ కొద్ది గంటల్లోనే బిజెపిలో చేరడం విశేషం.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బిజెపిలో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోడీ అవసరం ఎంతో ఉందని, అందుకే తాను బిజెపిలో చేరానని ఆమె చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తమిళనాడులో ఘన విజయం సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. తాను కూడా ఒక సామాన్య కార్యకర్తలా పార్టీ విజయానికి శ్రమిస్తానని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ ప్రకటించిన వెంటనే ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తక్షణమే తొలగించినట్లు ఎఐసిసి ప్రకటించింది. ఖుష్బూ సుందర్‌ను పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించినట్లు ఎఐసిసి కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ కార్యదర్శి ప్రణవ్ ఝా ప్రకటించారు.

ఖుష్బూచేసిందేమీ లేదు: టిఎన్‌పిసిసి

చెన్నై: పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఖుష్బూకు కీలక బాధ్యతలు అప్పగించినప్పటికీ గత కొద్ది నెలలుగా ఆమె పార్టీ కోసం ఏమాత్రం పనిచేయలేదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెఎస్ అళగిరి విమర్శించారు. హత్రాస్ హత్యాచార కేసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ప్రదర్శనలలో పాల్గొనడంతోపాటు బిజెపిలో తాను చేరే ప్రసక్తి లేదని ఖండించిన ఖుష్బూ ఇంతలోనే మారిన తన నిర్ణయానికి తానే వివరణ ఇచ్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఖుష్బూ రాజీనామా వల్ల నష్టం లేదు: దినేష్ గుండూరావు

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఖుష్బూ సుందర్‌కు సైద్ధాంతిక నిబద్ధత లేదని ఎఐసిసి తమిళనాడు ఇన్‌చార్జ్ దినేష్ గుండూరావు విమర్శించారు. ఆమె నిష్క్రమణ వల్ల తమిళనాడు రాజకీయాలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఆయన చెప్పారు. వారం రోజుల క్రితం వరకు బిజపిని, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించిన ఖుష్బూ ఇప్పుడు పదవుల కోసం బిజెపిలో చేరినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన ఆరోపించారు. తమిళనాడులో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. తమిళనాడులో క్షేత్రస్థాయిలో ఖుష్బూ నిష్క్రమణ వల్ల కాంగ్రెస్‌పై ఎటువంటి ప్రభావం ఉండబోదని, ఆమె సినీ నటి కాబట్టి మీడియా కొద్ది రోజులు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి ఆ తర్వాత ఊరుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఖుష్బూ బిజెపిలో చేరిక వల్ల ఆ పార్టీకి ఒనగూరే లాభం ఏమీ ఉండదని, ఇప్పటికే బిజెపి పట్ల తమిళనాడులో పూర్తి వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు.

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు సి సుందర్ సతీమణి అయిన ఖుష్బూ 2010మేలో డిఎంకెలో చేరారు. ఆమె పార్టీ పట్ల తన అంకితభావాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఖుష్బూ బిజెపిపైన, కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు. ఇటీవల చోటుచేసుకున్న హత్రాస్ ఘటనపై కూడా ఆమె కేంద్రంపైన, యుపిలోని బిజెపి ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు. అయితే అక్టోబర్ 10న ఆమె ఒక ట్వీట్ చేస్తూ పార్టీ మార్పుపై తన మనసులో మాటను సూచనప్రాయంగా వెల్లడించారు. నాలో మార్పును చాలా మంది చూస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మనం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం..మన అభిప్రాయాలు మారుతుంటాయి. ఇష్టాయిష్టాలు మారుతుంటాయి. ఆలోచనాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. కొత్త కలలు కంటాం..ఇష్టానికి ప్రేమకు మధ్య తేడా తెలుసుకుంటాం. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుంటాం..మార్పు అనివార్యం అంటూ 50 ఏళ్ల ఖుష్బూ ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News