Monday, April 29, 2024

కన్నుల పండువగా మల్లన్న కల్యాణోత్సవం

- Advertisement -
- Advertisement -

కోరిన వారి కోర్కేలు తీర్చే కోర మీసాల మల్లన్న కల్యాణం అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు.. శరణు.. అంటూ జయజయ ద్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. మల్లన్న కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఓగ్గు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజే మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మల్లన్నకు బంగారు కీరిటం, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెంలో నెత్తిన పెట్టుకొని సంప్రదాయబద్ధంగా మేళతాళాల నడుమ మంత్రులు తలసాని, మల్లారెడ్డి వెంటరాగా సమర్పించారు.

బ్రహన్మఠాధీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం వైభవపేతంగా జరిగింది. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణతంతుతో ప్రారంభమయ్యాయి. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామి వారి కల్యాణం జరగడం అనవాయితీగా వస్తుంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ మహోత్సవం జరిగింది. వధువుల తరుపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు. వేడుకల్లో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పి చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News