Friday, May 3, 2024

జీవితానికి రంగులద్దిన కొండపల్లి

- Advertisement -
- Advertisement -

చిత్రకారులు హోలీ ఆడుకునే చిన్నపిల్లలు. దిగంతం నుండి అనంతం దాకా వారి ఎల్లలు. కుంచె వారి చేతిలో హరివిల్లై వివిధ విన్యాసాలను కురిపిస్తూ వుంటుంది. ఒకసారి గంభీరంగా, మరోసారి శృంగారంగా, ఇంకోసారి చిలిపిగా, మరింకోసారి స్పష్టాస్పష్టంగా వారి మనోరథం నడిపించిన దారిలో నడుస్తుంటారు. అట్లాంటి భారతీయ చిత్రకారుల్లో కొండపల్లి శేషగిరిరావు గారు ఒకరు. వారు మన తెలంగాణ వారు కావటం మన అదృష్టం, వారి దురదృష్టం. చిత్రకళలో ప్రావీణ్యం సాధించటానికి వారు శాంతినికేతన్ వెళ్ళారు. నందలాల్ బోస్, అవనీంద్రనాథ్ టాగోర్ వంటి దిగ్దంతుల శిష్యరికం పొందారు. సంవత్సరం దాటీ దాటక ముందే తిరిగి తెలంగాణకు వచ్చేశారు. అట్లా కాకుండా అక్కడే మరికొన్ని సంవత్సరాలు ఉండి విదేశాలకు వెళ్ళగలిగి వుంటే జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి చిత్రకారులై వుండేవారు.శేషగిరిరావు గారిది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానుకోట దగ్గరి పెనుగొండ గ్రామం. వరంగల్లులో చదువుకునే రోజుల్లో నాయుడు అనే డ్రాయింగ్ టీచర్ ప్రభావం వీరిమీద పడింది. ఆయన పాకాల వైపు అడవులకు వెళ్ళి ప్రకృతి చిత్రాలు గీసేవాడు.శేషగిరిరావులో చిత్రకళ మీద ఆసక్తి కలిగించాడు.

తొలి పాఠాలు నేర్పించాడు.అంతే ప్రకృతి ద్వారం గుండా విస్తృత కళా సామ్రాజ్యంలోకి ప్రవేశించారు. వీరి ప్రతిభను గుర్తించిన వారు సామాన్యులు కారు. జాతీయోద్యమ నాయకులు. మందుమల నరసింగరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, పెండ్యాల రాఘవరావు. వారు శేషగిరిరావు గారిని కళాపోషకులు, నిజాం ప్రభుత్వంలో గొప్ప పలుకుబడి కలిగినవారు అయిన మెహిదీ నవాజ్ జంగ్ గారి దగ్గరకు తీసుకు వెళ్ళారు. నవాజ్ జంగ్ గారు శేషగిరి రావు గారిని ఐదేళ్ళ పాటు తమ ఇంట్లోనే ఉంచుకొని ఫైన్ ఆర్ట్ కళాశాలలో చేర్పించారు. శిక్షణ ఇప్పించారు. కలకత్తాలో సంవత్సరంపాటు తమ కళను పదును పెట్టుకొని, మరికొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైనతర్వాత శేషగిరి రావు గారికి తాము చదువుకున్న కళాశాల ఫైన్ ఆర్ట్ కాలేజిలోనే ఉద్యోగం దొరికింది. అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు పొంది, వేలాది విద్యార్థినీ విద్యార్థులను చిత్రకళా రంగంలో తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో అనేక పురస్కారాలను పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం వారికి డాక్టరేట్ ప్రదానం చేసింది.
శేషగిరిరావు గారికి మంచి సాహిత్య జ్ఞానం ఉంది. దాశరథి, సినారెలు వారి మీద కవితలు రాశారు.

‘సరస కవితా విధేయ శేషగిరిరాయ’ అన్నారు సినారె. ఆంధ్ర భాగవతంలోని ఘట్టాలను, పోతన చిత్రానికి రూపకల్పన చేయటానికి వారు భాగవతాన్ని 16 సార్లు చదివి బొమ్మలు వేశారట. అందుకే ఆధ్యాత్మిక కళ సంతరించుకున్న పోతన చిత్రం మనకు సాక్షాత్కరించింది. ఈ చిత్రాన్ని పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావు ఆవిష్కరించారు. పురాణాలలోని ఘట్టాలను గీయటానికి వాటి పూర్వాపరాల జ్ఞానం చాలా అవసరం. నవరసాలను రంగులలోకి దించగలిగే ప్రజ్ఞ కూడా అవసరం. వీరు గీసిన పంచవర్ణ చిత్రం ‘గజేంద్ర మోక్షం’ పరిశీలిస్తే కరుణరసం కేంద్రంగా రూపొందిందని గమనిస్తాం. అంతేకాదు ‘సిరికిం జెప్పడు శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు’ పోతన పద్యానికి రూపకల్పన చేశారు. ఇందులోని గజేంద్రుడు, గరుత్మంతుడు మానవులు కారు. కాని చిత్రకారుని కుంచె నుండి మానవీయత జాలువారింది! కాళిదాసు శాకుంతలంలో శకుంతల కణ్వశ్రమానికి వీడ్కోలు చెప్పి దుష్యంతుని దగ్గరకు వెళ్తున్న ‘బరువైన’ సన్నివేశం కూడా శేషగిరిరావు గారి కళానైపుణ్యానికి తిరుగులేని నిదర్శనం. శకుంతల ముఖంలో ఒక ఉద్విగ్నత కనిపిస్తుంది. అదే సమయంలో ముఖ్యమైన పాత్రల చిత్రణ మూలంగా చిత్రం నిండుగా, కనులవిందుగా రూపొందింది.

ఇట్లాంటివి పెద్ద కాన్వాసు మీద ఎంతో సమయాన్ని వెచ్చించి వేయవలసినవి. శేషగిరిరావు గారికి సంప్రదాయ చిత్రాలు వేయటంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నట్టు సులభంగా తెలుసుకోవచ్చు. తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమం రెండు పాయలుగా సాగింది. గాంధీజీ మార్గంలో జాతీయోద్యమం, కమ్యూనిష్టుల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఉద్యమం, గాంధీజీ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరోచిత పోరాటం చేసిన వారి చిత్రాలు ఎన్నింటినో వీరు వేశారు. పురావైభవ గానం చేసే ఘట్టాలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. ప్రఖ్యాత చిత్రకారుడు మోహన్ ఒకసారి మఖ్దూం భవన్ కు వెళ్ళితే ఒక కుడ్యచిత్రంలో రావినారాయణ రెడ్డి గారు వీరోచితంగా ముందుకు సాగుతుంటే దీనులైనవారు అనుయాయులైనవారు వారి వెనుక వస్తున్నారు. నిజాం ఆగడాలను స్ఫురింపజేసే ఈ ఘట్టాన్ని ‘గాడీ’ కలర్స్ లో వేసి మెప్పించటం మోహన్‌ను ఆశ్చర్య పరిచిందట. మొత్తం మీద బీభత్స వీర రసాల సమ్మేళనంగా ఇట్లాంటి చిత్రాలను చూడవచ్చు.ప్రకృతికి సంబంధించిన చిత్రాల్లో జలాశయాలు, తామరపూలు, చెట్టుకొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు సహజంగా చిత్రించటంలో కొండపల్లికి సాటివచ్చేవారు తక్కువ. విరగగాసిన ఎర్రని మోదుగ పూల చెట్టు చిత్రాన్ని చూడండి.

కవులు మోదుగపువ్వును అగ్నిపుష్పం అని ఎందుకు వర్ణించారో అర్థమవుతుంది. శేషగిరిరావు గారు తన చిత్రకళా జ్ఞానాన్ని భావితరాలకు అందించటానికి ఎన్నో వ్యాసాలు రాశారు. వారు రాసిన వ్యాసాల కొన్ని శీర్షికలు చూస్తే చాలు వారి మేధాసంపద తెలియవస్తుంది. ‘మారుతున్న కళారీతులు – జాతీయపాత్ర’, ‘కాకి పడగలు’, ‘తెలంగాణ చిత్రకళ’, ‘అలంకరణకళ’, ‘కుడ్యచిత్రణము’, ‘కాకతీయ కళ – చిత్రణ’ మొదలైన ఎన్నో వ్యాసాలను వారు రాశారు. చిత్రకళా రంగంలో కృషి చేసిన గొప్ప తెలుగు కళాకారులను గూర్చిన వ్యాసాలు కూడా ఉన్నాయి. అడవి బాపిరాజు, అంట్యాకుల పైడిరాజు, పి.టి.రెడ్డి, కాపురాజయ్య మొదలైన వారిని గూర్చి రాసి తన పెద్దమనసును చాటుకున్నారు. మన సంస్కృతికి తన కళారూపాలతో చిరస్థాయిని కల్పించిన మహాచిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు గారు. ఈనెల 27న వారి శతజయంతి. ఇది చిత్రకారులకు పర్వదినం. కళను, కళాకారుల జీవితాలను సమీక్షించుకోవటానికి ఇదొక మంచి అవకాశం. వారి కళను, సంస్కృతిని, సంప్రదాయాన్ని సజీవంగా ఉంచటానికి వారి కుమారులు కొండపల్లి వేణుగోపాలరావు, కోడలు డా. కొండపల్లి నీహారిణి చేస్తున్న కృషి అభినందనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News