Sunday, May 5, 2024

బిజెపిది నిరుద్యోగ దీక్ష కాదు.. ఆత్మవంచన దీక్ష: కెటిఆర్ బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

KTR Letter on BJP's Nirudyoga Deeksha

హైదరాబాద్: బిజెపికి నిజంగానే చిత్తశుద్ధి  ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు, ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేయాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రేపు ఇందిరా పార్క్ లో బిజెపి నాయకులు చేపట్టనున్న నిరుద్యోగ దీక్షపై, బిజెపి వైఫల్యాలపై మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. బిజెపి ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలి. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా?. మీ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా?. హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు, లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 9 లక్షల ఉద్యోగ ఖాళీలు, ప్రభుత్వ బ్యాంకులు, సాయుధ బలగాల్లోని 5 లక్షల ఖాళీలు మొత్తంగా 15లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి. ఈ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారో ముందు స్పష్టం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగాలను, సంపద సృష్టించలేని మీ చేతగానితనంతో ప్రయివేటు రంగంలోనూ చతికిల పడిన మీ రిపోర్ట్ కార్డుని ప్రజల ముందు ఉంచాలి.

మా ప్రభుత్వం  భారీస్థాయి ఉద్యోగాల కల్పనకు హైదరాబాద్ ఫార్మాసిటీ,  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెడికల్ డివైసెస్ పార్కు, మెగా మెగా పవర్ లూమ్ పార్క్, వీవింగ్ పార్క్ వంటి మరెన్నో పారిశ్రామిక పార్కులను చేపట్టినా, వాటిలో ఒక్కదానికీ అదనపు సహాయం తీసుకురాలేని చేతకాని పార్లమెంటు ప్రాతినిధ్యం మీది కాదా?. తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తుంటే పారిశ్రామిక కారిడార్లు ఇవ్వాలని కోరినా కొర్రీలు వేసిన ప్రభుత్వం మీదే కాదా?. హామీ ఇచ్చిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని, మీ చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు  వివరణ ఇవ్వాలి. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి కోసం ఇచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రోత్సాహం ఏమైనా ఉంటే చెప్పాలి. లేకుంటే కొలువుల భక్షకులే దొంగ దీక్షలు చేస్తామంటే కొంగలు కూడా సిగ్గు పడుతాయి. రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులపై కపట ప్రేమను గుమ్మరిస్తూ రాజకీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్న మీరు అత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోండి. నిరుద్యోగులకు, రాష్ట్ర యువతకు ఏ సాయమూ చేయలేని మీ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ కోరండి. లేకపోతే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. తెలంగాణ యువతకు ఈ సందర్భంగా ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ యువత  అకాంక్షలను సంపూర్ణంగా అర్దం చేసుకున్న ప్రభుత్వం మాది. యువతకు  ఉపాధి కల్పనలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పనకు మా ప్రయత్నం యథావిధిగా కొనసాగుతుంది. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం చేసే అసత్య ప్రచార ప్రభావానికి లోనుకాకుండా విజ్ఞతతో అలోచించాలని కోరుతున్నాను అని కెటిఆర్ లేఖలో పేర్కొన్నారు.

KTR Letter on BJP’s Nirudyoga Deeksha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News