Wednesday, May 15, 2024

ఉప్పొంగిన ఉక్కు ఉద్యమం

- Advertisement -
- Advertisement -

మంత్రి కెటిఆర్‌కు ఆంధ్రా ప్రజల జై
విశాఖలో కెటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
కెటిఆర్‌కు ఉక్కు పరిరక్షణ జెఎసి అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి మంత్రి కెటిఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రా ప్రజలు, స్టీల్‌ప్లాంట్ కార్మికులు కెటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కెటిఆర్ స్వయంగా ఉద్యమంలో పాల్గొంటానని తేల్చిచెప్పడంతో స్టీల్‌ప్లాంట్ కార్మికులు నూతనోత్తేజంతో కెటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరం కలిసి పోరాడి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు స్పష్టం చేశారు. తెలుగు వారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇదిలావుండా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి కెటిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పోరాడి సాధించుకొన్న విశాఖ ఉక్కును వందశాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటానికి కెటిఆర్ మద్దతు ప్రకటించారు. అవసరమైతే ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతితో విశాఖకు వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతిస్తామని అన్నారు.

‘ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమాన్ని మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకూ వస్తారని, ఈక్రమంలో విశాఖ ఉక్కును అమ్ముతున్నట్టుగానే రేపు బిహెచ్‌ఈఎల్, ఎల్లుండి సింగరేణిని అమ్ముతారు’ అని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్ పరం చేయాలంటారేమో అని కెటిఆర్ ఎద్దేవాచేశారు. తెలంగాణలో పిఎస్‌యూలను అమ్మే ప్రయత్నం జరిగితే ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వ సంస్థలను ఇక్కడ కాపాడుకుంటుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నదని కెటిఆర్ వివరించడంతో పాటు విశాఖ ఉద్యమానికి మద్దతు ప్రకటించడతో విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. మంత్రి కెటిఆర్ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేశారు కార్మికులు కెటిఆర్ నిర్ణయాన్ని కార్మికులతో పాటు ప్రజలకు కూడా ఆహ్వానించారు. ఈక్రమంలో గురువారం నాడు మంత్రి కెటిఆర్ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకాలు చేయడంతో పాటు సమ్మెబాట పట్టిన స్టీల్ ప్లాంట్ కార్మికులు యాజమాన్యానికి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దశలవారీ ఉద్యమ ప్రణాళిక నిర్ణయించేందుకు ఉక్కు పరిరక్షణ సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో అనతికాలంలో విశాఖ ఉక్కు కార్మిక సంఘాల జెఎసి నేతలు ఉద్యమానికి మద్దతు తెలిపిన రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను స్వయంగా కలువనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

KTR supports to Visakhapatnam steel plant protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News