Sunday, May 5, 2024

త్వరలోనే కరోనా సంక్షోభం తొలగిపోతుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని వలసకూలీల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వారు ఉన్న పలు ప్రాంతాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వలస కూలీలతో మాట్లాడి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గచ్చిబౌలిలోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ సైట్‌లో పని చేసేందుకు వచ్చిన సుమారు 400మంది ఉన్న క్యాంపుని మంత్రి ఈ సందర్భంగా దర్శించారు. ఈ క్యాంపులో ఒరిస్సా, బెంగాల్, బీహార్ పలు రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉన్నారు. కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా మంత్రి వెంట ఉన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో అందరూ నిబంధనలు పాటించాలని కోరారు. ఇప్పుడు పనులు లేనందున వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న ఆహారం, రేషన్ సరుకుల గురించి ప్రత్యేకంగా వాకబు చేశారు.

లాక్ డౌన్ సమయంలో ఏవిధంగా గడుపుతున్నారన్న విషయాన్ని పలువురుతో మాట్లాడి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని కాపాడు కోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచించారు. త్వరలోనే కరోనా మహమ్మారి సంక్షోభం తొలగిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి అప్పటివరకు బయటికి వెళ్లకుండా వారికి ఏర్పాటు చేసిన వసతిలోనే ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వలస కూలీలు ఉంటున్న వసతి ప్రాంతాల్లో (షెడ్డులో) తిరిగిన మంత్రి వారి పేరు, ఎక్కడి నుంచి వచ్చారు వంటి వివరాలు అడిగారు. పని లేనందున సొంత ప్రాంతాలకు పోవాలని ఉన్నదా?లేదా? ఇక్కడ అంతా బాగానే నడుస్తుందా?అంటూ వారితో మాట్లాడారు. వారి కుటుంబాల యొక్క బాగోగులను సైతం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తమ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని ఇక్కడ క్షేమంగానే ఉన్నామని మంత్రి కెటిఆర్‌కు వలస కూలీలు పలువురు తెలియజేశారు. వలస కూలీలను ఈ రెండు వారాల పాటు వారికి కనీస అవసరాలను తీరుస్తూ జాగ్రత్తగా చూసుకోవాలని కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో పాటు స్థానిక అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు.

బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల తనిఖీ

బాల్ నగర్‌లో ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మంత్రి కెటిఆర్ తనిఖీ చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ట్రాఫిక్ తక్కువగా ఉండటం, సామగ్రి రవాణాకు వీలుండడం వంటి అనుకూల అంశాలను ఉపయోగించుకొని రోడ్డు, ఇతర మౌలిక వసతుల( ఇన్‌ఫ్రా) పనులను వేగవంతం చేయాలని సూచించారు. దీంతో పాటు అక్కడే నిర్మాణంలో ఉన్న నాలా విస్తరణ, రోడ్డు విస్తరణ వంటి పనుల పురోగతి కూడా జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రానున్న రెండు వారాల్లో పెద్ద ఎత్తున ఈ పనులు కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో పౌరులకు తక్కువ అసౌకర్యం కలుగుతుందని, ఈ లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. మంత్రి వెంట హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసికి చెందిన ఇంజనీరింగ్,టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులు ఉన్నారు.

KTR Visits Migrant Workers Camp at Gachibowli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News