Saturday, May 4, 2024

గణేష్ నిమజ్జనంలో గతేడాది ఉత్తర్వులే ఈసారి కూడా: హైకోర్టు స్పష్టీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక నిమజ్జనానికి సంబంధించి గతేడాది జారీ చేసిన ఉత్తర్వులే ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వీలు లేదని పోయిన సంవత్సరమే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఏడాది కూడా పిఒపి విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకూడదని.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని చెప్పింది.

గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీ దారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) నిబంధనలను కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. మరోవైపు గతేడాది కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో పిఒపితో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. పిఒపి విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తివేయాలన్న పిటిషన్‌పై విచారణను సెప్టెంబరు 25వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News