Tuesday, April 30, 2024

కృష్ణా జలాలపై అలసత్వం గొడ్డలిపెట్టే

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే భవిష్యత్తులో అడుక్కోవాలి

జాతీయ హోదాతెస్తామని చెప్పి, ఢిల్లీకి అప్పగిస్తున్నారు : హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే భవిష్యత్తులో అడుక్కోవాల్సి వస్తుందని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా భవిష్యత్తు తరాలకు గొడ్డలి పెట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, రావుల చంద్రశేఖర్‌లతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం బిఆర్‌ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది తప్ప పరిపాలనపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పజెప్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టి భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పగిస్తోందని విమర్శించారు. పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదా కేంద్రం ఇవ్వమంటే ఒప్పుకున్నట్లుగానే, కెఆర్‌ఎంబికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తుందన్నదని ఆరోపించారు. కెఆర్‌ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన హక్కులపై ఏదీ తేలకుండా కెఆర్‌ఎంబికి ప్రాజెక్టులను అప్పగిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు కెఆర్‌ఎంబి పరిధిలోకి వారం రోజుల్లోగా వెళ్తాయని ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి మీటింగ్‌లో నిర్ణయమైనట్టుగా తెలుస్తున్నదని, ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు లాభం, తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 2021లోనే కేంద్రం బిఆర్‌ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనను అప్పుడు కెసిఆర్ గట్టిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. తాము ఆనాడు కొన్ని షరతులు పెట్టామని, వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదని తెలిపారు. కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేలనప్పుడు కెఆర్‌ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని ఎపికి 50 శాతం, తెలంగాణకు 50 శాతం పంపిణీ చేయాలని కూడా షరతుపెట్టారని, శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టిఎంసిల నీటిని నాగార్జున సాగర్‌ఎకు విడుదల చేయాలని మరో షరతు పెట్టామని చెప్పారు. ఏకపక్షంగా కెఆర్‌ఎంబిపై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని తాము ఆనాడే కోరామని అన్నారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా కెఆర్‌ఎంబి పరిధిలోకి ఎలా తెస్తారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి…
ఏదీ తేలకుండా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని, జలవిద్యుత్ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి కోల్పోతామని హరీశ్‌రావు అన్నారు. సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని, హైదరాబాద్, ఇతర జిల్లాలకు తాగునీటి సమస్యలు వస్తాయని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి సహా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ప్రశ్నార్థకం అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా ఖండిస్తారని చూశానని కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ప్రాజెక్టులు కెఆర్‌ఎంబి చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు.

పోతిరెడ్డిపాడు ద్వారా గోదావరి డెల్టాకు నీటిని తరలిస్తే సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని తెలిపారు. ఇప్పుడు ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని కోరారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీరు తీసుకుపోతే సాగర్ ఆయకట్టు, ఎడమ కాల్వకు నీరు ఉండదని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కట్టినట్లు కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బిజెపి ఒత్తిడి తెస్తున్నా, కాంగ్రెస్ కనీసం స్పందించడం లేదని అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే బిఆర్‌ఎస్ పోరా టం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం బిఆర్‌ఎస్ ఎంతకైనా తెగిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీరు తెచ్చుకోవచ్చని హరీశ్ రావు సూచించారు. ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఆ నీటిని లిఫ్ట్ చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు. కాళేశ్వరం పంపులను సాంకేతికంగా 24 గంటలు నడపాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News