Thursday, May 16, 2024

కాంగ్రెస్ లో టిక్కెట్ హామీతో చేరికలు..?

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో కాంగ్రెస్ సంచలన విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కూడా ఊపందుకుంది. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ కే అధికారం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ప్రజలు సైతం కాంగ్రెస్ కే మద్దతుగా నిలుస్తారనేది క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్. దీంతో పార్టీలోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు జోరుగా సాగుతున్నాయి. అందరూ కాంగ్రెస్ సీటు కావాలనే షరతు పెడుతున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించి ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం వచ్చే వారికి హామీలు గుప్పిస్తుంది. కొత్త వారు చేరికలు అవసరమే అయినా..పాత వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పని చేసిన వారు తమ నియోజకవర్గాల్లో సీట్లపైన ఆశలు పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో కొత్త నేతలను చేర్చుకునే క్రమంలో సీట్ల హామీలు ఇస్తుండటం వారికి రుచించటం లేదు. దీంత పార్టీకి ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది.

ఇప్పుడు వీరిని పార్టీ ఎలా సమన్వయం చేస్తుంది? సీట్ల విషయంలో అనుసరించే ఫార్ములా ఏంటి? ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది? ఇవ్వలేని వారికి ఎలా న్యాయం చేస్తుంది? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధాన చర్చగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగరంలోని కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో చేరికలపైన నాగం జనార్ధనరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దామోదర్ రెడ్డి తన కుమారుడికి సీటు పైన హామీ కోరారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు సిద్దమయ్యారని తెలుస్తుంది. తన వర్గానికి సీట్లపైన హామీ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామం జిల్లాలోని పార్టీ నేతలకు అంతుచిక్కటం లేదు. ఖమ్మం జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొని ఉంది. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం తిరిగి పార్టీలో చేరటమే కాక సీటు పైన కూడా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో సీతక్క కుమారుడు అక్కడ చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు ఖాయమయ్యాయి. ఈ సమయంలో వారికి ఇస్తున్న హామీలతో పార్టీనే నమ్ముకున్న నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.

కొత్త వారికే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తే నష్టం తప్పదనే హెచ్చరికలు ఉన్నాయి. అధికారమే దిశగా పార్టీకి అన్ని రకాలుగా కలిసి వస్తున్న సమయంలో పాత వారికి ఎక్కడా నష్టం లేకుండా, అదే సమయంలో కొత్త వారిని ఆకట్టుకునేలా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు టీ కాంగ్రెస్ ముఖ్య నేతల పైన ఉంది. ఇది నేతల సమర్థతకు పరీక్షగా మారుతోంది. కొత్త నేతలను చేర్చుకోవటం పైన అభ్యంతరం లేదంటున్న నేతలు, సీట్ల విషయంలో మాత్రం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్న వారి కంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అంటిపెట్టుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News