Tuesday, April 30, 2024

కాసేపు సరదాగా ఫేక్ న్యూస్

- Advertisement -
- Advertisement -

‘చాతుర్వర్ణం మయా సృష్టం’ అని ఓ కల్పిత పాత్రతో చెప్పించి మనువాదులు చేతులు దులుపుకొన్నారు. ‘సంభవామి యుగే యుగే’ అని తనను తాను సృజించుకుంటానని చెప్పుకొన్న ఓ కల్పిత పాత్ర సమాజంలో నాలుగు వర్ణాలు నేనే సృష్టించాను అని కూడా చెప్పుకొంది. ఇకనేం బ్రాహ్మణార్యులు శతాబ్దాలుగా శ్రమ లేకుండా సుఖాలు, భోగాలు అన్నీ ఉచితంగా అనుభవిస్తున్నారు అబద్ధాలు ప్రచారం చేసుకోవడం మన దేశంలో ఎప్పటి నుండో వుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ! సమకాలీనంలో ఏలిన వారి అబద్ధాలు పౌరుల జీవితాల్లోకి ఇంకిపోతున్నాయి. చదువుకొన్న వారిని కూడా వివేక హీనులుగా తయారు చేస్తున్నాయి.

ఒక అధికార పార్టీ నాయకురాల్ని ఒకసారి ఒక గడియారాల షాపు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కార్యక్రమం అయిపోయాక, ఆమె షాపులోని ఒక్కొక్క గడియారం చూస్తూ తిరిగింది. గోడ గడియారాలన్నీ నడుస్తున్నాయి. వాటి పెండ్యూలాలు ఊగుతున్నాయి. అయితే, మధ్యలో ఒక పెద్ద గడియారం ప్రత్యేకంగా అమర్చారు. అది నడవడం లేదు. “ఈ ఆగిపోయిన గడియారం ఇక్కడెందుకు పెట్టారు?” అని అడిగింది అధికార పార్టీ నాయకురాలు.

“మేడమ్! అది సత్యహరిశ్చంద్రుడి దండీ! ఇంత వరకు ఆ గడియారం ముళ్ళు ఒక్కసారి కూడా కదల్లేదు” అన్నాడు షాపు యజమాని. “అదేమిటీ? నడవని గడియారాలెందుకు షాపులో? అని అంది నాయకురాలు.“అలా కాదు మేడమ్ గారూ. ఇవన్నీ అబద్ధాల గడియారాలు. మనుషులు అబద్ధాలాడుతున్న కొద్దీ ఇవి నడుస్తాయి. వీటి ప్రత్యేకత అదే”నన్నాడు షాపతను. “ఓహో అలాగా!ఈ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ అబద్ధాలు బాగానే ఆడుతుంది. వాళ్ళకు కనెక్టయిన గడియారం వుందా?” “ఆ వుంది కదా మేడమ్ గారూ. చూడండి నా టేబుల్ ఫ్యాన్ ఎలా కునికి పాట్లు పడుతూ తిరుగుతోందో వారి గడియారానికి ఈ టేబుల్ ఫ్యాన్ కనెక్ట్ చేశాం. వాళ్ళ అబద్ధాల శక్తి అంత పెద్దగా లేదు.“మరి మాకు ప్రతిపక్షంగా కొనసాగుతూ కేంద్రంలో మాపై అబద్ధాలు గుప్పిస్తున్న పార్టీల గడియారాలెవ్వీ ” కుతూహలంగా అడిగింది నాయకురాలు.

“అదిగో పైకి చూడండి మేడమ్. ప్రతిపక్ష గడియారాల ముళ్ళు ఊడదీసి పైన రూఫ్‌కు అమర్చాం. ఎంచక్కా సీలింగ్ ఫ్యాన్లలా తిరుగుతున్నాయి.” అంటూ పైకి చూపించాడు షాపు యజమాని. అధికార పార్టీ నాయకురాలి కళ్ళు చల్లబడ్డాయి. “మా మీద ఎదురు దాడికి దిగి, ఎన్నెన్ని అబద్ధాలాడుతున్నారో ఇకనైక ఈ దేశ ప్రజలు గ్రహిస్తారు. చాలా సంతోషమండి సరే మరి వెళ్ళొస్తాను” అంది నాయకురాలు. “అదేమిటీ? మన అధికార పార్టీ గడియారాలు చూడకుండానే వెళ్ళిపోతారా?” ఆఁ ఏముంది? మా అబద్ధాలతో రిస్టు వాచి కూడా నడుస్తుందో లేదో సరే చూపించండి!” అని అంది అధికార పార్టీ నాయకురాలు. “మరీ అంత తీసిపారెయ్యకండి మేడమ్! మన అధికార పార్టీ నాయకుల అబద్ధాలతో గడియారాలే కాదు. మోటార్‌లే నడుస్తున్నాయి. రండి చూద్దురు గానీ. వాటిని బయట ఆవరణలో పెట్టాం. చూడండి. ఈ వంద ఇంజిన్ల మన వాళ్ళ అబద్ధాలతోనే నడుస్తున్నాయి. అండర్ గ్రౌండ్‌లో పైపు లేశాం. అవి అబద్ధాల్ని తోడిపోస్తాయి. దేశ వ్యాప్తంగా అబద్ధాల పంటలు పండించాలన్నదే మా ధ్యేయం! మన దేశ నాయకుడి హితవు మేరకు మేమీ పని చేస్తున్నాం. ఒక్క దేశ నాయకుడి అబద్ధాలే మూడొంతుల ఇంజిన్లు నడవడానికి ఇంధనం అందిస్తున్నాయి” షాపు యజమాని ఆపకుండా చెప్తున్నాడు.
ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే అని మనసులో పీక్కుని, ముఖం కందగడ్డ చేసుకొని, వెనక్కు తిరిగింది. ఏ కొంచెం ఆలస్యం చేసినా, పత్రికల వాళ్ళు, టెలివిజన్ వాళ్ళు దాడి చేసేట్లు వున్నారు ‘గప్‌చిప్‌గా ఉడాయించడం మేలు’ అనుకుంది. ఉన్నఫళంగా అక్కడి నుంచి మాయమైంది.

“హిందీ మాట్లాడని వారు దేశం విడిచి వెళ్ళాలి!” అని ప్రకటించారు ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ మూర్ఖుల పార్టీ రాజ్యమేలుతున్నప్పుడు వారి మాటలు, చేష్టలూ ఇలాగే వుంటాయి. మూర్ఖుల్ని ఎన్నుకొన్న ప్రజలులెంత మూర్ఖులు? వారిని అధికారంలో కొనసాగనిస్తున్న ప్రతిపక్ష పార్టీల వైఫల్యమెంత? అని మనలాంటి సామాన్యులు వాపోతుంటాం. అక్షరాస్యత అనేది ముఖ్యమైన అంశం. కేరళలో 90 శాతం అక్షరాస్యత వుంది. అక్కడ ప్రజలు ఆలోచించి ఓట్లేస్తారు. ఆ రాష్ట్రంలో 55 శాతం హిందువులు, 45శాతం మైనారిటీలు వున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ భిన్నమైంది. అందుకే అక్కడ బిజెపి ఎదగడం లేదు అని తీర్మానించింది ఎవరో కాదు కేరళ బిజెపి ఎంఎల్‌ఎ ఓ. రాజగోపాల్. బిజెపి పార్టీలో వున్న వాళ్ళలో కూడా ఒక్కోసారి విశ్లేషించుకొనే శక్తి వుంటుందన్న మాట! ఒక అంతర్జాతీయ ఆరోగ్య సదస్సులో జపాన్, జర్మనీ, ఇండియన్ డాక్టర్లు కలుసుకొన్నారు. టీ బ్రేక్‌లో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వున్నప్పుడు జపాన్ డాక్టరన్నాడు. “మేం ఒక అతనికి కిడ్నీ మార్చాం అతను పది రోజుల్లో కోలుకొని లేచి వెళ్ళి జాబ్ వెతుక్కున్నాడు” అని గొప్పగా కళ్ళెగరేస్తూ మిత్రుల వంక చూశాడు. “ఓ.యస్!మేమూ చేశామండీ” అన్నాడు జర్మన్ డాక్టర్. “మేము ఒక మనిషికి హార్ట్ మార్చాం. విచిత్రం అతను వారంలోనే లేచి జాబ్ వెతుక్కున్నాడు” తాము కూడా తక్కువ కాదన్నట్టు భుజాలెగరేశాడు. ఆ ఇద్దరి మాటలు విన్న ఇండియన్ డాక్టర్ తల వంచుకొన్నాడు. “ఫ్రెండ్స్! మీ ఇద్దరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ, మా దేశంలో జరిగింది వేరు. మా ఖర్మకాలి  మేమొకణ్ణి మార్చాం! అంతే దేశంలోని వాళ్ళంతా జాబ్‌ల వేటలో పడ్డారు” అని అన్నాడు. మిగతా ఇద్దరూ అయోమయంగా చూశారు. ఇంకా వివరాలు అక్కర లేదన్నట్లు ఇండియన్ డాక్టర్ అక్కణ్ణించి వెళ్ళిపోవాల్సి వచ్చింది.

మన దేశంలో నాయకులు మతం కవచంతో నిర్లజ్జగా తిరుగుతున్నారు. పేదలు తిండి లేక ఆకలితో నకనకలాడుతున్నారు. మండిపోతున్న కూరగాయలు, పప్పు దినుసులు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ కొనలేక జనం అల్లల్లాడిపోతున్నారు. ఉద్యోగాల్లేని యువత భవిష్యత్తు శూన్యమైపోతోంది. తనను తాను శివాజీ అనుకున్న దేశ ప్రధాని మాత్రం కాశీలో చూపు, చిత్తం అన్నీ కెమెరా మీద కేంద్రీకరించి శివుడికి హారతిస్తాడు. వారణాసిలో ఒక రోజులో నాలుగు సార్లు దుస్తులు మారుస్తాడు. ‘పని ముఖ్యం రా నాయనా అంటే కాదు, పబ్లిసిటీ ముఖ్యం’ అని అంటాడు. ఎన్నికలు ఎక్కడ ఏ రాష్ట్రంలో వచ్చినా ఈ దేశానికి మూడు విషయాలు తప్పక గుర్తు చేస్తాడు. 1. మొఘల్ ఖాన్‌దాన్ 2. చైనా -పాకిస్తాన్ 3. రామ్ భగవాన్. ఆ అబద్ధాల కళలో ఆరితేరిన మోడీ బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో తను కూడా వీరోచితంగా పోరాడానని అంటాడు. కేరళలో క్రిస్టియన్ల ఓట్ల కోసం బైబిల్ ప్రవచనాలు చెపుతాడు. ఆయన బాల్యంలో ఒక సంఘటన జరిగిందట! జీవశాస్త్రం బోధించే టీచర్ క్లాసులో ఒక ప్రశ్న అడిగింది “గాల్లో ఎగురుతూ కూడా తన పిల్లల్ని భూమి మీద కనే క్షీరదం ఏదీ?”మొదటిసారి బాల నరేంద్ర చెయ్యెత్తాడు. ఎందుకంటే ఆ ప్రశ్నకు జవాబు తనకు తెలుసుననుకున్నాడు. అందుకే జవాబు చెప్పే అవకాశం తనకే ఇవ్వాలన్నట్టు, ఆరాటపడిపోతూ చెయ్యి ఊపుతున్నాడు. లేచి లేచి కూచుంటున్నాడు. ‘వీడో బండహరి కదా? వీడికి సమాధానం ఎలా తెలుసూ? అనుకుంది టీచర్. “సరే చెప్పు నరేంద్రా!” అని అంది. బాల నరేంద్ర ఉత్సాహంగా నిలబడి “ఎయిర్ హోస్టెస్ టీచర్!! అని అరిచాడు. దాంతో టీచర్‌తో సహా క్లాసంతా అవాక్కయ్యింది. పదకొండు వేల కోట్లు భారత్‌కు బ్రిటన్ సహాయం చేస్తే అందులో మూడు వేల కోట్లు “స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో సర్దార్ పటేల్ విగ్రహానికి ఖర్చు పెట్టడాన్ని బ్రిటన్ తప్పు పట్టింది. భారత్‌లో పలు ప్రాజెక్టుల కోసం తాము చేసిన సహాయం వృథా అయ్యిందని బ్రిటన్ అధికార పక్షం పార్లమెంటు మెంబర్, కన్వర్వేటివ్ పార్టీ డిప్యూటీ లీడర్ పీటర్ బోన్ తీవ్రంగా విమర్శించారు. (7 నవంబర్ 2021), భారత్ దగ్గర తగిన సమాధానం లేకపోయింది.

ట్రేడింగ్ ఎకనమిక్స్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో ఉద్యోగులకు కనీస వేతనం గత ఐదేళ్ళుగా పెరగలేదు. కానీ, 2019తో పోలిస్తే అంబానీ ఆదాయం తొమ్మిది శాతం, అదానీ ఆదాయం 261 శాతం పెరిగింది. అంటే అంబానీ రోజుకు 163 కోట్లు సంపాదిస్తూ వుంటే.. అదానీ రోజు వారీ సంపాదన రూ. 1002 కోట్లు. మోడీ చెప్తున్న అచ్ఛేదిన్ ఎవరికీ అని సామాన్యులు బిత్తరపోయి దిక్కులు చూస్తున్నారు.

“ఈసారి చలి పెరిగింది. అందుకే గొర్రెలకు ఉన్ని కోటు ఉచితంగా ఇస్తాం” అని ప్రకటించాడు దేశ నాయకుడు. ఒక్కొక్కరి బ్యాంకు ఎకౌంట్‌లో పదిహేను లక్షలు వేస్తానన్న మహా పురుషుడు ఈయనే కదా? అని గొర్రెలు గతాన్ని గుర్తు చేసుకొన్నాయి. ఏమో మనకు నిజంగానే ఇస్తాడేమో అని గొర్రెలు ఖుషీ ఖుషీగా ఎగిరి గంతేశాయి. ‘రాజువయ్యా మహారాజు వయ్యా అని పొగడుతూ పాట కూడా పాడాయి. ఒక అమాయకపు తెలివిలేని గొర్రె ఇలా అడిగింది “రాజు గారూ రాజు గారు! అంత ఉన్ని ఎక్కడి నుంచి తెస్తారండీ?” అని. రాజుగారి జవాబు విని గొర్రెలన్నీ అవాక్కయ్యాయి. “ఇంకెక్కడి నుంచి తీస్తా? గొర్రెల నుంచే తీస్తా!! రండి. రండి.. గొర్రెలన్నీ వచ్చి వరుసగా ఇక్కడ లైను కట్టండి” అన్నాడు దేశ నాయకుడు. దేశ నాయకుణ్ణి గొర్రెలు మాత్రమే రాజుగా భావిస్తాయని మనం ఇక్కడ అర్థః చేసుకోవాలి. ప్రధాన మంత్రి యోజన పేరుతో వచ్చే పథకాలన్నీ ఇదిగో ఇలాగే వుంటాయి. కొవిడ్ చికిత్స కోసం ప్రస్తుత మోడీ ప్రభుత్వం గొప్ప సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గాయత్రీ మంత్రంతో కొవిడ్‌ను నాశనం చేయాలని అనుకుంటోంది. రిషికేశ్ లోని ఎయిమ్స్‌తో డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసి సంయుక్తంగా ట్రీట్‌మెంట్‌కు సిద్ధమయ్యారు.

కరోనా రోగులను రెండు బ్యాచ్‌లుగా విభజిస్తారు. ఒక బ్యాచ్‌కు మామూలుగా కరోనా వైద్యం అందిస్తారు. మరో బ్యాచ్‌తో రోజుకు గంట సేపు గాయత్రీ మంత్రం చదివిస్తారు. తర్వాత మరో గంట పాటు ప్రాణాయామం చేయిస్తారు. ఈ రెండు బ్యాచ్‌లలో రోగ నిరోధక శక్తి ఎలా వుందోనన్నది మధ్య మధ్యలో నమోదు చేయిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అమోఘమైన ప్రయోగం విజయవంతం కావాలని దేశంలోని సన్యాసులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. వైద్య సహాయం అందించకుండా కేవలం గాయిత్రీ మంత్రానికి పరిమితమైన బ్యాచ్‌లో ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? లేక, ఆ రోగుల పూర్వ జన్మ పాపాలకు లింకు పెడుతుందా? అన్నది తక్షణం వెల్లడించాల్సిన విషయం.

– డా. దేవరాజు మహారాజు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News