Thursday, May 16, 2024

ర్యాష్ డ్రైవింగ్ కేసు..మాజీ ఎంఎల్ఎ షకీల్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ సీనియర్ నేత, బోధన్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు సాహిల్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద వున్న బారికేడ్లను షకీల్ కుమారుడు కారుతో ఢీకొట్టాడు. మద్యం మత్తులో వున్న సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారు అతనిదేనని, నడిపింది కూడా అతనేనని తేల్చారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్‌కు తరలిస్తుండగా సాహిల్ పారిపోయాడని ప్రచారం జరిగింది. అయితే కేసును కొందరు పోలీసులు తప్పుదోవ పట్టించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. సాహిల్ తండ్రి షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కస్టడీలో వున్న కొడుకును తప్పించి, తన ఇంట్లో పనిచేస్తున్న అబ్ధుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సిపి శ్రీనివాస్ రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు.

కమీషనర్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిసరాల్లోని సిసిటివి ఫుటేజ్‌ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలోనే సాహిల్‌ను పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. అయితే నైట్ డ్యూటీలో వున్న పోలీసులు సాహిల్‌ను ఈ కేసు నుంచి తప్పించి అబ్ధుల్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చినట్లుగా డిసిపి తేల్చారు. నైట్ డ్యూటీలో సిఐ దుర్గారావు, ఎఎస్‌ఐ విజయ్ కాంత్ వున్నట్లుగా గుర్తించారు. దీంతో సిఐని సిపి శ్రీనివాస్ రెడ్డి విధుల నుంచి సస్పెండ్ చేశారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో సాహిల్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేదని డిసిపి విజయ్ కుమార్ పేర్కొన్నారు. పోలీసులు నిర్వహించిన అంతర్గత విచారణలో మాత్రం ఏ1గా సాహిల్‌ను, ఏ2గా అబ్ధుల్‌ను చేర్చినట్లుగా తేలింది. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు , పరారీలో వున్న సాహిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News