Sunday, April 28, 2024

హైకోర్టుల చొరవ

- Advertisement -
- Advertisement -

Madras High Court has slams the Central Electoral Commission

 

మొన్న మద్రాస్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని చీల్చిచెండాడింది. దాని బాధ్యతారాహిత్యాన్ని చెరిగి వదిలిపెట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రాణాలను వేటాడి వెంటాడి హరిస్తున్న నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడాన్ని అరికట్టడానికి ఎన్నికల ప్రచారసభలను ఆపడంలో విఫలమైనందుకు ఇసి అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని ప్రకటించి ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆ దెబ్బతో దిగివచ్చిన ఇసి ఫలితాల ప్రకటనరోజున విజయోత్సవాలు, ఊరేగింపులు జరపరాదని ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని నగరంలోని ఆస్పత్రులకు ఇస్తానని మాట ఇచ్చిన ఆక్సిజన్ కోటాను ఆ మేరకు పూర్తిగా సరఫరా చేయనందుకు ఢిల్లీ హైకోర్టు ఈ మధ్య కేంద్రప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఎలాగైనా ఏ మార్గం ద్వారానైనా ఢిల్లీ ఆస్పత్రులకు ఆక్సిజన్ పూర్తి కోటాను సరఫరా చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. “నిండా మునిగిపోయాం, అన్ని సౌకర్యాలనూ కలిగించాల్సిందే. మీరే ఆ విధంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని చెప్పారు.

ఆ మేరకు పూర్తిగా ఇవ్వాల్సిందే. ప్రాణవాయువు కొరత వల్ల ఇప్పటికే ఎనిమిది మంది మరణించారు. మేము కళ్లు మూసుకొని ఉండలేం” అని స్పష్టం చేసింది. దానితో ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూస్తానని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. బిజెపి పాలిత రాష్ట్రాలైన హర్యానా, యుపిల నుంచి తాము కొనుక్కుంటున్న ఆక్సిజన్ ట్యాంకర్లను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని అంతకుముందు ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక డాక్టర్ సహా ఎనిమిది మంది కొవిడ్ రోగులు మరణించిన నేపథ్యంలో దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విధంగా కేంద్రాన్ని నిలదీసింది. ప్రభుత్వానికి మానవ ప్రాణాలంటే ఖాతరు లేనట్టుందని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్య చేసింది. యాచన చేసో, అప్పుతెచ్చో, దొంగతనానికైనా పాల్పడో ఏ విధంగానైనా ప్రజలను ఆదుకోండి. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి అని న్యాయమూర్తులు విపిన్ సంఘీ, రేఖా పల్లిల డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆ విధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ధర్మాసనం తన కర్తవ్యాన్ని గొప్పగా నిర్వర్తించింది.

‘ప్రభుత్వం వాస్తవ పరిస్థితిని గమనించకపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. అసలు ఏం జరుగుతున్నది? ప్రభుత్వం నిజాలను ఎందుకు చూడడం లేదు’ అని ధర్మాసనం నిలదీసింది. 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైతే, రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతూ మరింత ప్రాణవాయువును సరఫరా చేయవలసి ఉంటే కేవలం 400 మెట్రిక్ టన్నుల మేరకే అందజేయడం ఎంతవరకు సబబు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అవసరానికి తగినట్టు ప్రాణవాయువును సమకూర్చుకోవడం ఎలాగో కూడా హైకోర్టు కేంద్రానికి చెప్పింది. ప్రభుత్వరంగంలో నడు స్తున్న ఉక్కు కర్మాగారాలున్నాయి. పెట్రోలియం పరిశ్రమలు ఉన్నాయి. కొద్దిరోజుల పాటు వాటి ఉత్పత్తిని తగ్గించి అవి వినియోగించే ఆక్సిజన్‌ను ఆ మేరకు ఆసుపత్రులకు మళ్లించవచ్చు కదా అని సూచించింది.

నిజానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచే కొరడా దెబ్బలను తలపించే ఇటువంటి మాటలు పేలి ఉండాల్సింది ఎందుకో గానీ కరోనా రెండో కెరటం ప్రజల ప్రాణాలను ఇంతగా తుడిచిపెడుతూ స్మశానాల సహనాన్ని కూడా పరీక్షిస్తున్న స్థితిలో వ్యాక్సిన్, ఆక్సిజన్, ఆసుపత్రులు, వైద్య సిబ్బంది కొరత విషయంలో సుప్రీం కోర్టు నుంచి తిరుగులేని ఆదేశాలు వెలువడడం లేదనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలోని వైద్య చికిత్స వ్యవస్థ తగినంతగా లేని వాతావరణంలో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని ప్రజల కోసం వినియోగించాలని సుప్రీంకోర్టు తాఖీదు ఇస్తే కాదనేవారు ఎవరు? కరోనాను ఎదుర్కోవడంలో స్పష్టమైన జాతీయ విధానం లేకపోవడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే, వ్యాక్సిన్‌కు భిన్న ధరలేమిటని కేంద్రాన్ని అడిగింది.

ప్రజలకు టీకాల ఉచిత పంపిణీలో ఘనమైన చరిత్రను గడించుకున్న భారతదేశంలో వ్యాక్సిన్ ధరల నిర్ణయ స్వేచ్ఛను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడాన్ని, వాటిని బతిమిలాడుకొని సరఫరాను సాధించుకోవాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాలను నెట్టివేయడాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అందుకు బదులు దేశవ్యాప్తంగా ఉచిత టీకా సరఫరా బాధ్యతను కేంద్రంపై ఉంచుతూ కచ్చితమైన ఆదేశాలను సుప్రీం కోర్టు ఎందుకు జారీ చేయడం లేదనే ప్రశ్న తలెత్తడం సహజం. ఈ పరిస్థితుల్లో హైకోర్టులు కలుగజేసుకొని అల్టిమేటంలు జారీ చేయడం దేశ ప్రజల్లో కొంతైనా భరోసా కలిగిస్తున్నది. సమయం మించిపోతున్నది. శనివారం నాడు ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 4లక్షల మందికి కరోనా సోకింది. కేంద్రం నిర్లక్షం, తాత్సారం ఇక ఎంతమాత్రం కొనసాగకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాలదే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News