Monday, April 29, 2024

దుబాయ్‌లో హీరా ద్వారా 47 సార్లు లాగిన్?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ సభ్యత్వ లాగిన్ దుర్వినియోగం ఆరోపణలపై టిఎంసి ఎంపి మహూవా మొయిత్రాని ఎథిక్స్ కమిటీ గురువారం విచారిస్తుంది. ప్రత్యేకించి ఈ ఎంపి పార్లమెంటరీ ఖాతా లాగిన్ ద్వారా దుబాయ్‌లోని పలు ప్రదేశాల నుంచి ఏకంగా 47 సార్లు ఇతరులు చొరబడినట్లు వెలువడ్డ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, దుబాయ్‌లో పలు కంపెనీలు ఉన్న దర్శన్ హీరానందని ఈ ఎంపి ఖాతాను దుర్వినియోగపర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎథిక్స్ కమిటీ ఇప్పుడు సబంధిత విషయంపై ఎంపిని ప్రశ్నించే వీలుంది. అంతేకాకుండా సంబంధిత అంశంపై మూడు మంత్రిత్వశాఖల నుంచి తమకు అందిన నివేదిక ప్రాతిపదికన టిఎంసి ఎంపిని ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందని కమిటీకి సంచలనాత్మక అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తనకు ఎంపిలాగిన్ అందిందని తెలిపారు. పలు ఇతర విషయాలను కూడా ప్రస్తావించారు. అయితే ఇప్పటికీ ఆయన నుంచి కానీ ఆయన కంపెనీ వర్గాల నుంచి కానీ ఇదంతా కూడా క్యాష్ ఫర్ క్వరీగా సాగిందా? లేదా అనే విషయంపై వివరణ రాలేదు .

అయితే నిర్థిష్ట ప్రశ్నలను ఈ ఎంపి పార్లమెంటరీ లాగిన్‌కు పంపించినట్లు అంగీకరించారు. కాగా అక్టోబర్ 31వ తేదీన ఎథిక్స్ కమిటీ ముందు ఈ ఎంపి విచారణకు హాజరు కావల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాలతో తాను ఈ తేదీన రాలేకపోతున్నట్లు ఆమె తెలిపారు. దీనితో ఆమెకు చివరి అవకాశంగా ఈ నెల 2వ తేదీన (నేడు) హాజరయ్యేందుకు వీలు కల్పించారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సమాచార సాంకేతిక శాఖ, విదేశాంగ శాఖలు ఈ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. గత నెల 26వ తేదీన కమిటీ ఈ ఎంపి సంబంధిత విషయంపై సమావేశం అయింది. విచారణకు ఒక్కరోజు ముందు ఆమె లాగిన్‌కు సంబంధించి బిజెపి ఎంపి నిశికాంత్ దూబే చేసిన ఆరోపణలలోని కొన్ని ఇతర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆమె పార్లమెంటరీ అకౌంట్‌కు చెందిన దాదాపు 47 లాగ్ ఇన్స్ దుబాయ్ నుంచి చేసినట్లుగా ఉన్నాయని వెల్లడైంది. కాగా తనపై వచ్చిన నేరపూరిత ఆరోపణలను విచారించే అధికారం పార్లమెంటరీ నైతిక వ్యవహారాల కమిటీకి లేదని టిఎంసి ఎంపీ ఓ లేఖ పంపించారు.

తనకు సమన్లు వెలువరించినట్లు మీడియాకు సమాచారం ఇవ్వడం , అంతకు ముందు తనకు వ్యతిరేకంగా ప్రచారానికి వీలు కల్పిండచం వంటి నేపథ్యంలో విచారణకు ముందు రోజు ఈ లేఖను తాను వెలువరిస్తున్నట్లు ఈ ఎంపి తెలిపారు. నేరాభియోగాలు వచ్చినప్పుడు, ఇందులో ఆర్థిక అంశాలు ముడివడి ఉన్నందున దీనిపై దర్యాప్తు సంస్థలు స్పందిస్తే తాము ఎదుర్కొంటామని ఎంపి ఇందులో పేర్కొన్నారు.

దేశ భద్రత విషయంపై అంతాస్పందించాలి ః దూబే
లోక్‌సభ సభ్యురాలిగా ఉంటూ మొయిత్రా ఇతరులకు తమ పార్లమెంటరీ లాగిన్ వివరాలు ఇవ్వడం, కీలక ప్రశ్నలకు ఇతరులకు అవకాశం కల్పించడం తీవ్రస్థాయి విషయం అని బిజెపి ఎంపి దూబే విమర్శించారు. ఇది దేశ ప్రయోజనాలను దెబ్బతీసే అంశం అవుతుందని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ, ముందు ఎంపిపై తక్షణ చర్య అవసరం అని డిమాండ్ చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డా నుంచి మూడుసార్లు ఎంపి అయిన దూబే ఈ ఎంపి చేసిన పని సాధారణ విషయం కాదని మండిపడ్డారు. ఆమెకు లంచాలు ఇతరత్రా మేలు చేసి వ్యాపారవేత్త హీరానందని ఏకంగా లోక్‌సభలో తనకోసమే (హీరానందని ) ప్రశ్నలు అడగటం నిజమేనా?

ఇది నిజమైతే భారత పార్లమెంట్‌కు ఇది అత్యంత అవమానకర విషయం అవుతుంది. దీనిపై ఇతర ఎంపిలు అంతా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే ఎంపిల విశ్వసనీయతకు భంగం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ, ప్రజల కోసం పనిచేయాల్సిన వారమైన ఎంపీలం ఈ విధంగా పెట్టుబడిదార్ల ప్రయోజనాలకు పనిచేయాలా? లేక వారికి అమ్ముడుపోవాలా? అని దూబే నిలదీశారు. టిఎంసి ఎంపి వ్యవహారం ఇప్పుడు వ్యాపారవేత్త అఫిడవిట్ ద్వారా వెలుగులోకి వచ్చిందని లేకపోతే ఈ విధంగా దేశ భద్రత సమాచార ప్రక్రియకు మరింతగా భంగం వాటిల్లుతూ ఉండేదని విమర్శించారు.

హీరానందనిని బెదిరించారు ః మొయిత్రా
ఇప్పుడు తనపై వస్తున్న ఆరోపణలు, ఈ క్రమంలో హీరానందని అఫిడవిట్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ బెదిరింపు వ్యవహార శైలి ఫలితం అని టిఎంసిఎంపి మొయిత్రా ఆరోపించారు. వ్యాపార విషయాలపై ఆయనను బెదిరించి ఉంటారని, వివరణ ఇచ్చుకునేలా ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. తనకు ఆయన ముడుపులు ఇచ్చారనే విషయంపై ఆయనను ప్యానల్ విచారణ దశలో ప్రశ్నించేందుకు వీలు కల్పించాలని కోరారు. అయితే పార్లమెంటరీ ప్యానల్ పద్థతుల ప్రకారం ఇందుకు వీలుండదు. అయితే తనకు న్యాయం జరిగేందుకు ఇతరత్రా అవకాశం ప్యానల్ కల్పిస్తుందా? అని ఎంపి ప్రశ్నించారు. తాను అదానీ వ్యాపార సముదాయాల అక్రమాలను అదేపనిగా ఎండగడుతూ రావడం వల్లనే ఇప్పుడు తనపై తప్పుడు అభియోగాలకు పాల్పడ్డారని , ఈ తప్పుడు అభియోగాల వెనుక ఉన్నది కేవలం అదానీ గ్రూప్ అని, ఇక ప్రభుత్వంలో ఈ వ్యక్తికి కంపెనీలకు ఉన్న పలుకుబడి ఎంత విస్తారితం అనేది ఇప్పుడు తనపై సాగుతోన్న దుష్ప్రచారంతో స్పష్టం అయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News