Sunday, April 28, 2024

టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్

- Advertisement -
- Advertisement -

Mamilla Rajender‌ as Telangana TNGO President

 

హైదరాబాద్ : ప్రస్తుత అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సోమవారం పదవీ విరమణ చేయడంతో మామిళ్ల రాజేందర్‌ను రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకుంది. టిఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం టిఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయం నాంపల్లి, హైదరాబాద్‌లో జరిగింది. కార్యవర్గ సమావేశంలో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవ తీర్మానంతో ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మామిళ్ల రాజేందర్‌ను టిఎన్జీఓ రాష్ట్ర సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజేందర్ ప్రస్తుతం ఆఫీసు సూపరింటెండెంట్ రంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. 1986 సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో సంగారెడ్డిలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి ఆయన 1990లో సీనియర్ అసిస్టెంట్‌గా 2011లో ఆఫీసు సూపరింటెండెంట్ గా డిఎంహెచ్‌ఓ సంగారెడ్డి కార్యాలయంలో పనిచేస్తూ, ప్రస్తుతం ఆఫీసు సూపరింటెండెంట్‌గా డిఎంహెచ్‌ఓ రంగారెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్నారు.

2016 నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా..

టిఎన్జీఓ సంఘంలో 1990లో సంగారెడ్డి పట్టణ శాఖ కోశాధికారిగా ఎన్నికైన ఆయన 1992లో కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యుడిగా అప్పటి అధ్యక్షుడు స్వామినాథం, ప్రధాన కార్యదర్శి కే. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పనిచేశారు. 1998 నుంచి 2007 సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2007 నుంచి 2011 వరకు సంగారెడ్డి అధ్యక్షుడిగా పనిచేశారు. 2016 నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొదటిసారిగా ఎన్నికై 2020 ఆగస్టు 31 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రస్తుతం టిఎన్జీఓ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

భవిష్యత్ కార్యక్రమాలను చేపడతా : మామిళ్ల

తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఉద్యోగ గర్జన నుంచి మొదలుకొని సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, సడక్ బంద్ లాంటి అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహి ంచడమే కాకుండా ఉద్యోగుల హక్కుల సాధన ఉద్యమంలో మెరుగైన పిఆర్‌సిను సాధించడంలో ముందువరుసలో ఉండి పోరాడటం వల్లే తనను ఏకగ్రీవంగా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని మామిళ్ల రాజేందర్ తెలిపారు. రాబోయే కాలంలో ఉద్యోగుల హక్కుల సాధన విషయంలో ప్రభుత్వంతో చర్చించి తప్పకుండా హక్కులను సాధించుకునే క్రమంలో ఉద్యోగుల సూచనల మేరకు భవిష్యత్ కార్యక్రమాలను చేపడతానని ఉద్యోగులందరూ తనపై విశ్వాసం ప్రకటించి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

రిటైర్మెంట్‌తో పాటుగా టిఎన్జీఓ అధ్యక్ష బాధ్యతల వైదొలగి..

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టిఎన్జీఓ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సోమవారం రిటైర్ అయ్యారు. రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం టిన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడిగా, ఉద్యోగ సంఘాల జేఏసి చైర్మన్‌గా ఉన్నారు. కాగా, రిటైర్మెంట్‌తో పాటుగా టిఎన్జీఓ అధ్యక్ష బాధ్యతల నుంచి రవీందర్ రెడ్డి తప్పుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News