Friday, April 26, 2024

భుజాన కూతురి శవంతో.. 10 కిలోమీటర్లు నడక

- Advertisement -
- Advertisement -

Man carrying daughter body for 10-km in chhattisgarh

చత్తీస్‌గఢ్‌లో హృదయవిదారక ఘటన
వీడియో వైరల్ కావడంతో దర్యాప్తుకు మంత్రి ఆదేశం

అంబికాపూర్: ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ తండ్రి తనకుమార్తె మృత దేహాన్ని భుజాన మోసుకుంటూ పది కిలోమీటర్లు నడుచుకొంటూ వెళ్లిన హృదయవిదారక ఘటన చత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్‌దేవ్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అందాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్తె అనారోగ్యానికి గురయింది. కొద్ది రోజులనుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో శుక్రవారం ఉదయం లఖాన్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆక్సిజన్ స్థాయిలు 60కి పడిపోయాయి.

ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం పాప చనిపోయింది. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఈశ్వర్‌దాస్ కుమార్తె మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్లారు. రోడ్డుపై ఈశ్వర్ నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లవెత్తాయి. దీంతో స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టిఎస్ సింగ్‌దేవ్ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి అంబికాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ సంఘటనపై ఆస్పత్రి సిబ్బంది వాదన వేరుగా ఉంది. అంబులెన్స్ వస్తుందని తాము చెప్పినప్పటికీ ఆ కుటుంబం వినకుండా వెళ్లిపోయిందని రూరల్ మెడికల్ అసిస్టెంట్ డాక్టర్ వినోద్ భార్గవ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News