Wednesday, May 1, 2024

కట్టల పాములు

- Advertisement -
- Advertisement -

Massively increased counterfeit notes:RBI report

ఆర్‌బిఐ నివేదిక ఆందోళన
నోట్ల రద్దు సాధించిన విజయమిదంటూ
మోడీ సర్కార్‌పై రాహుల్, టిఎంసి ధ్వజం

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ తాజా వార్షిక నివేదిక 2016లో మోడీ ప్రభుత్వం చేపట్ట్టిన నోట్ల రద్దు నిర్ణయంపై దాడి చేయడానికి ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లయింది. 2021 22 ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువల కరెన్సీల నకిలీ నోట్ల చెలామణి బాగా పెరిగిపోయిందని ఆర్‌బిఐ నివేదిక వెల్లడించింది. రూ.500 నకిలీ నోట్లు 101.9 శాతం, రూ.2,000ల నకిలీ నోట్లు 54.16 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా నల్లధనంలో పాటు నకిలీ నోట్ల చెలామణిని అరికట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2016 నవంబర్‌లో పెద్ద నోట్లయిన పాత వెయ్యి రూపాయలు, రూ.500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో ఆధునిక ఫీచర్లు, సేఫ్టీతో కూడిన రూ.2,000, రూ.500, రూ.100,రూ.50, రూ.20, రూ.10 విలువైన కొత్త నోట్లను వివిధ రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. అయితే రూ.2,000నోట్లు మార్కెట్‌నుంచి మాయమవుతుండడంతో వీటిని పెద్దఎత్తున నల్లధనం రూపంలో దాస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నోట్ల ముద్రణను చాలావరకు తగ్గించారు. మరో వైపు కొత్త కరెన్సీల నకిలీ నోట్లు మార్కెట్లను ముంచెత్తాయి.

ఈ నకిలీ నోట్ల చెలామణి పెరిగిన విషయాన్ని స్వయంగా ఆర్‌బిఐనే వెల్లడించింది. దీంతో విపక్షాల చేతికి మరో ఆయుధం దొరికినట్లయింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం పై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు మండిపడ్డాయి.‘ పెద్దనోట్ల రద్దు దురదృష్టకరమైన విజయం. భారత ఆర్థిక వ్యవస్థను హింసించడమే అది’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరిక్ ఓబ్రియెన్ కూడాట్విట్టర్ ద్వారా కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.‘ మిస్టర్ పిఎం మోడీకి నమస్కారం. డీమానిటైజేషన్ గుర్తుందా? మీ నిర్ణయంపై మమతాబెనర్జీ మిమ్మల్ని ఎలా నిలదీశారు? దేశంలో ఇది ఒక డెమో అని, నల్లధనాన్ని మొత్తం తుడిచిపెట్టేస్తుందని మీరు ఎలా హామీ ఇచ్చారు? నకిలీ నోట్లలో భారీ పెరుగుదలను సూచిస్తున్న ఆర్‌బిఐ తాజా నివేదిక ఇక్కడే ఉంది’ అంటూ ఎద్దేవా చేశారు. శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కూడా ఇదే తరహా విమర్శలు చేశారు.‘ నోట్ల రద్దుకు సంబంధించి ఒక ప్రయోజనం నెరవేరింది. రూ.2000 నోట్లలోని రహస్య చిప్స్ సైతం దీనికి అడ్డుకాలేదన్న విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నా’ అని ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News