Saturday, April 27, 2024

ఫైనల్లో మెద్వెదేవ్

- Advertisement -
- Advertisement -

Medvedev reach Australian Open final

 

ఒసాకాతో బ్రాడీ తుది పోరు నేడే, మెర్టెన్స్ జంటకు డబుల్స్ టైటిల్

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ గ్రీస్‌కు చెందిన ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో మెద్వెదేవ్ డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)తో తలపడుతాడు. ఏకపక్షంగా సాగిన సెమీస్ సమరంలో మెద్వెదేవ్ 64, 62, 76తో సిట్సిపాస్‌ను చిత్తు చేశాడు. ఆరంభం నుంచే డానిల్ ఆధిపత్యం చెలాయించాడు. సిట్సిపాస్ కూడా తొలి సెట్‌లో కాస్త గట్టి పోటీనే ఇచ్చాడు. కానీ డానిల్ మాత్రం తనదైన షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతను ధాటికి సిట్సిపాస్ ఎదురు నిలువలేక పోయాడు. నిలకడైన ఆటతో అలరించిన డానిల్ తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు.

అయితే రెండో సెట్‌లో మాత్రం సిట్సిపాస్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. ఆరంభం నుంచే మెద్వెదేవ్ దూకుడును ప్రదర్శించాడు. అద్భుత షాట్లతో విరుచుకు పడిన డానిల్ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ మూడో సెట్‌లో మాత్రం సిట్సిపాస్ గట్టి పోటీ ఇచ్చాడు. డానిల్ ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ ముందుకు సాగాడు. డానిల్ కూడా ఒత్తిడిని తట్టుకుంటూ మళ్లీ పైచేయి సాధించాడు. చివరికి టైబ్రేకర్ వెళ్లిన సెట్‌ను గెలిచి మ్యాచ్ దక్కించుకున్నాడు. అంతేగాక జకోవిచ్‌తో జరిగే తుది పోరుకు అర్హత సాధించాడు. ఇదిలావుండగా టైటిల్ ఫేవరెట్లుగా భావించిన రఫెల్ నాదల్ (స్పెయిన్), డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా), జ్వరేవ్ (జర్మనీ) తదితరులు కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించారు. ఇదిలావుంటే ఊహించినట్టే జకోవిచ్ టైటిల్ వేటకు చేరి అభిమానులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక రష్యా ఆశాకిరణం మెద్వెదేవ్ కూడా ఫైనల్‌కు చేరి టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు.

నేడు మహిళల ఫైనల్

మహిళల సింగిల్స్ ఫైనల్ సమరం శనివారం జరుగనుంది. మూడో సీడ్ నొవాక్ ఒసాకా (జపాన్), 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)లు తుది పోరులో తలపడనున్నారు. ఒసాకా ఇప్పటికే నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. బ్రాడీ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి సారిగా ఫైనల్‌కు చేరింది. ఇక సెమీస్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించిన ఒసాకా ఫైనల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ప్రత్యర్థితో పోల్చితే ఒసాకా టైటిల్ సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరంభం నుంచే నిలకడైన ఆటతో ఒసాకా అలరిస్తోంది. ఎలాంటి తడబాటు లేకుండా ఊహించినట్టే ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇక పెద్దగా అనుభవంలేని క్రీడాకారిణి బ్రాడీతో జరిగే తుది సమరంలో ఒసాకా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు బ్రాడీ కూడా తొలి ప్రయత్నంలోనే టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

మెర్టెన్స్ జోడీకి టైటిల్

మహిళల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం), అరినా సబలెంకా (బెలారస్) జంట టైటిల్‌ను సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో మెర్టెన్స్ జోడీ చెక్ రిపబ్లిక్‌కు చెందిన మూడో సీడ్ బార్బొరా క్రెజ్సికొవాకటరినా సినియాకొవా జంటను ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో మెర్టెన్స్ జంట అలవోక విజయం అందుకుంది. ఆరంభం నుంచే ఈ జోడీ చెలరేగి ఆడింది. ప్రత్యర్థి జంటకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో అలవోకగా మొదటి సెట్‌ను దక్కించుకుంది. తర్వాత కూడా మెర్టెన్స్ జోడీ దూకుడును ప్రదర్శించింది. చివరి వరకు జోరును ప్రదర్శిస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. చివరికి 62, 63తో మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇదిలావుండగా పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్ రాజీవ్ రామ్ (అమెరికా)జోయ్ సాలిస్‌బరి (బ్రిటన్) జంట ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఈ జోడీ 64, 76తో ఆరో సీడ్ జెమీ ముర్రే (బ్రిటన్)బ్రూనోస్ (బ్రెజిల్) జంటను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News