Monday, April 29, 2024

మహిళల విజయం

- Advertisement -
- Advertisement -

Tanushree Dutta is first film actress to fight 'Me Too'

 

పని స్థలాల్లో తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి బాధిత మహిళలు ఆ తర్వాత కాలంలో బయటి పెట్టి బాధ్యుల ముసుగులను తొలగించడం ద్వారా సాటి స్త్రీలలో ధైర్యాన్ని మేల్కొలిపి వారికి రక్షణ కల్పించేందుకు దోహదపడుతున్న ‘మి టూ’ (నేను సైతం) ఉద్యమానికి ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయ స్థానంలో లభించిన విజయం విశేషమైనది. ఇది కేవలం ఈ కేసులోని వ్యక్తులకు సంబంధించినది మాత్రమే కాదు, మొత్తం మహిళలందరి ఆత్మగౌరవానికి, భద్రతకు హామీ ఇస్తున్న చరిత్రాత్మకమైన మలుపు. ఏళ్ల గతం నాటి లైంగిక వేధింపుల ఆరోపణతో తన అత్యున్నత ప్రతిష్ఠను దెబ్బ తీసిందంటూ ప్రియామణి అనే సీనియర్ మహిళా పాత్రికేయురాలిపై ప్రముఖ ఎడిటర్, కేంద్ర మాజీ మంత్రి ఎంజె అక్బర్ దాదాపు మూడేళ్ల క్రితం వేసిన పరువు నష్టం దావాను మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే కొట్టి వేశారు. ప్రియారమణిని నిర్దోషిగా ప్రకటించారు.

అదే సమయంలో లైంగిక వేధింపులు, అత్యాచారాల వంటి ఉదంతాలపై ఏ వేదిక మీది నుంచైనా, అవి జరిగిన దశాబ్దాల తర్వాతనైనా ఫిర్యాదు చేసే హక్కు బాధిత మహిళలకు ఉంటుందని తీర్పు ఇచ్చారు. మహిళ ఆత్మగౌరవం, జీవన హక్కు ముందు వ్యక్తుల పరువు ప్రతిష్ఠలు ఎంతటివైనా అవి దిగదుడుపేనని స్పష్టం చేశారు. ఈ తీర్పు ద్వారా గత కాలపు లైంగిక వేధింపులను బయట పెట్టడానికి సాహసించే మహిళలందరికీ ఈ ధర్మాసనం న్యాయ కవచాన్ని తొడిగింది. 1980, 90 దశకాల్లో ప్రముఖ ఆంగ్ల దినపత్రికల సంపాదకుడుగా పని చేసినప్పుడు ఎంజె అక్బర్ తమను లైంగిక వేధింపులకు గురి చేయడమే గాక, కాముక దాడులకు కూడా పాల్పడ్డారంటూ దాదాపు 20 మంది మహిళా జర్నలిస్టులు 2018 అక్టోబర్‌లో ప్రకటించడంతో అప్పటికి ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పుకోవలసి వచ్చింది.

తాను నిర్దోషినని వాదించిన అక్బర్ తనపై మొదటిసారిగా ఆరోపణ చేసిన ప్రియారమణి అనే జర్నలిస్టుపై కోర్టులో కేసు వేస్తానని బెదిరించారు. ఆ మేరకు ఆ వెంటనే ఆమెపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. చాలా కాలం పాటు సీనియర్ ఎడిటర్ పదవిలో ఉన్న అక్బర్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ప్రధాని మోడీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అక్బర్ ఉదంతం తర్వాత దేశంలోని రాజకీయ, మీడియా, సినిమా, న్యాయ, క్రీడలు, విద్య మున్నగు 14 రంగాల్లో ఉదోగినులపై జరిగిన లైంగిక అకృత్యాల ఉదంతాలను బాధిత మహిళలే బహిర్గతం చేశారు. పర్యవసానంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది. పని స్థలాల్లో సాటి ఉద్యోగాల్లోని మగవారు, సీనియర్ పదవుల్లోని పురుషులు సాగించే ఇటువంటి దారుణాల నుంచి ఉద్యోగినులకు అప్పటి నుంచి ఎంతో కొంత రక్షణ వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇప్పటి తీర్పుతో కార్యాలయాల్లోని కొద్ది బుద్ధుల పెద్దల నుంచి మహిళలకు మరింత రక్షణ కలుగుతుందని ఆశించవచ్చు.

లైంగిక వేధింపులకు గురవుతున్నా, అత్యాచారాలు జరిగిపోతున్నా బయటికి చెప్పుకుంటే సమాజం తమను చులకనగా చూస్తుందని, సొంత మనుషులే దూరంగా పెడతారని, దానితో బతుకు దుర్భరమైపోతుందనే భయంతో లోలోపలే కుమిలిపోయే మహిళలకు దేశంలో కొదువ లేదు. అటువంటి వారికి ఒక స్థాయిలోనైనా ‘మి టూ’ ఉద్యమం కొండంత బలాన్నిచ్చింది. తమపై అటువంటి నీచ దాడి జరిగిన చాలా కాలం తర్వాతనైనా దానిని బయటకు చెప్పుకుంటే సమాజం తమ వెంట నిలబడుతుందని, దోషులకు తగిన శాస్తి జరిగినా, జరగకపోయినా తమ సాహసాన్ని అది గుర్తిస్తుందనే అభయాన్నిచ్చిన ‘మి టూ’ ఉద్యమం మొట్ట మొదటి సారిగా 2006 లో తరానా బుర్కే అనే అమెరికన్ సామాజిక ఉద్యమ కారిణి తీసుకున్న చొరవతో మొదలైంది. తనలాంటి మహిళలకు ధైర్యం చెప్పి దారి చూపడానికి ఆమె తనపై జరిగిన లైంగిక హింసను గురించి మొదటిసారిగా గొంతు విప్పారు. మన దేశంలో తనుశ్రీ దత్త అనే సినిమా నటి మొదటిసారిగా ‘మి టూ’ పతాకం ఎగుర వేశారు.

నటుడు నానాపటేకర్ తన మీద షూటింగ్ స్థలంలోనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బహిర్గతం చేశారు. 2008లో జరిగిన ఈ ఉదంతంపై ఆమె అప్పట్లోనే గొంతు విప్పారు. మళ్లీ 2013లో ఆ విషయాన్ని బయట ప్రస్తావించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. 2018 సెప్టెంబర్‌లో తనుశ్రీ తన గోడు చెప్పుకోడంతో అప్పటికే ఊపందుకున్న ‘మి టూ’ ఉద్యమం ఇచ్చిన ఊపిరితో అది బాగా పని చేసింది. ఇలా చలన చిత్ర రంగంలో మరి కొంత మంది బాధిత మహిళలు ముందుకొచ్చి తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘మి టూ’ ఉద్యమం పై స్థాయిలోని మహిళలకు ఇస్తున్న ఊరటను సమాజం అట్టడుగు శ్రేణుల్లోని స్త్రీలకు కూడా కలిగించగలిగే నిలిచే రోజు రావాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News