Tuesday, April 30, 2024

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు మెమో జారీ

- Advertisement -
- Advertisement -

మంత్రివర్గ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ-రేస్‌కు నిధులు విడుదల చేయడంపై ఆగ్రహం
వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని ప్రకటన
ఆయన హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన

అభివృద్ధి, లే ఔట్‌ల అనుమతులపై ప్రభుత్వం నజర్..!
త్వరలోనే వాటిపై సమీక్ష జరుపనున్న సిఎం?

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణపై వారంలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అరవింద్ కుమార్‌ను కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ఈ మెమో జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖతో పాటు హెచ్‌ఎండిఏ సంస్థకు కమిషనర్‌తో పాటు పలు కీలక శాఖల్లో పనిచేశారు.
ఔటర్ రింగ్‌రోడ్డు లీజులోనూ ఆయనదే పెత్తనం…
అయితే హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా మూడేళ్ల పైచిలుకు అరవింద్ కుమార్ పనిచేశారు. ఆయన కమిషనర్‌గా హెచ్‌ఎండిఏలో పనిచేసిన సమయంలో పలు అభివృద్ధి పనుల్లో అవకతవకలకు జరిగినట్టు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన హయాంలో పలు పార్కుల అభివృద్ధితో పాటు ప్లై ఓవర్‌లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్‌ఎండిఏ నిధులను కేటాయించింది. దీంతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డు లీజు కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ప్రస్తుతం ఈ ఫార్ములా రేస్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అరవింద్ కుమార్ ఔటర్ లీజు విషయంలోనూ తానే అంతా వ్యవహారించినట్టుగా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయన హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో చేపట్టిన పనులకు సంబంధించి పాత ఫైళ్లను పునః పరిశీలించాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సిఎం కూడా హెచ్‌ఎండిఏ విడుదల చేసిన నిధులు, తదితర వాటిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం.
లే ఔట్‌ల విషయంలోనూ అవినీతి
వీటితో పాటు పలు ప్లై ఓవర్‌ల నిర్మాణాల టెండర్‌లు, పలు పార్కుల అభివృద్ధికి సంబంధించిన టెండర్‌లలోనూ ఆయన సొంతం నిర్ణయం తీసుకునేవారని పలువురు అధికారులు సైతం పేర్కొంటున్నారు. ఇక హెచ్‌ఎండిఏ లే ఔట్ అనుమతుల విషయంలో అడ్డగోలుగా అనుమతులు జారీ చేశారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. హెచ్‌ఎండిఏ ఇచ్చే లే ఔట్‌ల విషయంలో చాలావరకు అవినీతి జరిగిందని, ఏజెన్సీల ద్వారానే లేఔట్‌లకు సంబంధించి ముడుపులు ముట్టేవని, ఈ ముడుపులు కమిషనర్ స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బందికి అందేవని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా తనకున్న పలుకుబడితో ఎంఐయూడితో పాటు హెచ్‌ఎండిఏలో ఆయన చక్రం తిప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విపత్తు నివారణ విభాగానికి బదిలీ
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ నుంచి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేస్ పై నిర్వాహకులు సానుకూలంగా స్పందించలేదు. ఫార్ములా ఈ రేసును రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు గత వారం ప్రకటించారు.
ప్రభుత్వ విధాన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి
అయితే, ఫార్ములా ఈ రేస్ 9,10వ సీజన్‌ల కోసం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా పార్మూలా ఈ రేస్ నిర్వహణకు గాను ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్‌ఎండిఏ నుంచి రూ. 54 కోట్లు బదిలీ చేశారని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కాగా, ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండిఏకు రూ. 54 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదలకు ఎవరు అధికారం ఇచ్చారని మెమోలో సిఎస్ ప్రశ్నించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసిందని ప్రభుత్వం ఆ మోమోలో పేర్కొంది.

Memo

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News