Wednesday, May 1, 2024

చేనేతల కోసం ‘ఢిల్లీతో ఢీ’

- Advertisement -
- Advertisement -

Minister KTR criticize Central govt over Handloom sector

చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది,
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది, కేంద్రం నుంచి ఎటువంటి
సహకారమూ లేదు వచ్చే బడ్జెట్‌లో ఒక
మెగాపవర్‌లూమ్ క్టస్టర్‌ను, భారతీయ చేనేత సాంకేతిక
సంస్థను ఇవ్వకపోతే కేంద్రంతో యుద్ధమే :
సిరిసిల్లలో మీడియాతో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : నేతన్నల సంక్షేమంపై కేంద్రంపై ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నామని టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, రాష్ట్ర చేనేత, జౌళి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కేంద్రం నుంచి తగు సహకారం వస్తున్నదని ఇప్పటి వరకు ఎంతో ఆశగా ఎదురుచూశామన్నారు. కానీ ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతోందన్నారు. చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేసినా కేంద్రం నుంచి సహకారం అందడంలేదని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏడేళ్లుగా కేంద్రానికి ఎన్ని ప్రతిపాదనలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయమని… ప్రజల పక్షాన డిమాండ్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం బిజెపి పాలిత రాష్ట్రాల కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. బిజెపి యేతర ప్రభుత్వాలను చూన్న చూపుచూస్తోందన్నారు. ఫెడరల్ వ్యవస్థకు పూర్తిగా విరుద్దంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వంపై టిఆర్‌ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

శుక్రవారం సిరిసిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, మరోసారి తనదైన శైలిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై, రాష్ట్రంలోని బిజెపి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఉమ్మడిరాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన చేనేత రంగానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొత్సాహం కారణంగానే ప్రస్తుతం చేనేత రంగం బతికి బయటపడిందన్నారు. ఈ రంగానికి చేయూతనివ్వడమే కాకుండా దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.

ఈ దిశగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. భారతదేశంలో నూలు, రసాయనాలపై 50శాతం సబ్సిడీ ఇస్తున్నది కూడా ఒక్క రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వము చేనేత కార్మికులకు ప్రత్యేకంగా రూ. 1134 కోట్ల ఆర్డర్లు ఇచ్చి వారికి జీవన భృతి మెరుగు పరిచిందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వివరించారు. వర్కర్ టు ఓనర్ పథకంను రూ. 400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర సహకారం నిల్ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో యత్నిస్తోందన్నారు. అయితే కేంద్రం నుంచి ఏ మాత్రం సహకారం అందించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఎన్ని ప్రతిపాదనలు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

పని చేస్తున్న ప్రభుత్వానికి, పని చేస్తున్న రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న రంగానికి అండదండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని చేనేత సమూహాల దగ్గర ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఏర్పాటు చేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అయితే కేంద్రం తీరు మాత్రం దున్నపోతుపై వాన పడిన చందంగానే వ్యవహరిస్తోందని మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీని కారణంగానే టెక్స్‌టైల్స్ రంగంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ వెనుకబడి ఉందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారతదేశంలో అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ పార్కుతో చేనేత రంగంలో ప్రపంచంతో పోటీ పడేందుకు వీలు ఉంటుందన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచి మెగా టెక్స్‌టైల్స్ పార్కుకు ప్రత్యేకంగా రూ.1000 కోట్లు మంజూరు చేయమని అడిగామన్నారు. కానీ ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు…ఎలాంటి స్పందన రాలేదన్నారు.

వాటిని మంజూరు చేయకపోతే ..

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఒక మెగా పవర్ రూమ్ క్లస్టర్‌ను, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని, చేనేత కార్మికుల కోసం బ్లాక్ లెవల్ క్లస్టర్‌ను మంజూరు చేయకపోతే కేంద్రంపై యుద్దం తప్పదని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిలు చేసిన ఆందోళనలను…చేనేత విషయంలో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రతియేటా రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రధానంగా చేనేత కళాకారులకు ఉపాధి కల్పించడంతోపాటు మరెన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పట్ల చేనేత, జౌళి పరిశ్రమ కార్మికులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో నేతన్నలకు మెరుగైన జీవన విధానం లభిస్తోందన్నారు.

బిజెపి ఎంపిలు… అనవసర రాజకీయాలు మానుకోవాలి

తెలంగాణకు ఒక్క రూపాయి తీసుకరాలేని రాష్ట్ర బిజెపి ఎంపిలు అనవసర రాజకీయాలు మానుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ఉత్తగా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పడి ఏడవడం కంటే… రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రత్యేక ప్రోత్సాహకాలను సంపాదించే ప్రయత్నం చేయాలన్నారు. ఈ విషయంలో వారు ఎలాంటి చొరవ తీసుకున్నా ….దానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇలాంటి ప్రయత్నం చేయకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనామ్ చేసేందుకు యత్నిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News