Thursday, November 7, 2024

రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్

- Advertisement -
- Advertisement -

ఆయిల్‌పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రెండున్నర లక్షల టన్నుల్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యం
రైతులకు అవసరమైన సహాయ సహకారాలను బ్యాంకులు అందించాలి
నాబార్డు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా అనుకూలంగా రేట్లు ఉండాలి
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

Niranjan Reddy participated in icar video conference

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఆయిల్‌పామ్ సాగును చేపట్టనున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన సహాయ సహకారాలను బ్యాంకులు విరివిగా అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు నాబార్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా రైతులకు అనుకూలంగా రేట్లు వుండేట్లుగా విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు యూనిట్ ధరను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరాలకు సరిపడా ఆయిల్‌పామ్ పంటలను ఉత్పత్తి చేయకపోవడం వల్ల మన దేశం పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోవాల్సి వస్తోందన్నారు. పైగా నూనె దిగుమతులను పెత్తఎత్తున చేసుకుంటున్న కారణంగా కల్తీ సైతం జోరుగా సాగుతోందన్నారు. ఈ విధానం మారాలన్న లక్షంతోనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుపై అధిక దృష్టి సారించిందన్నారు. ఈ పంటను పండించే రైతులకు పలు రకాలుగా ప్రొత్సహించనున్నామన్నారు. మన రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం 38వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నదన్నారు. ఈ కొరతను అధిగమించడానికి రెండున్నర లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్షంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అందించాల్సిన ప్రొత్సాహంపై సోమవారం హైదరాబాద్‌లోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగు చేయుటకు మొదటి నాలుగు సంవత్సరాలకుగానూ సుమారు రూ.1,38,680ల (సూక్ష్మసేధ్యంతో కలిపి) ఖర్చు అవుతోందన్నారు. ఇందులో రూ.31,832 వరకు ప్రభుత్వం ద్వారా రాయితీ ఇస్తున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
మన దేశ జనాభాకు 22మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. మిగిలిన 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. – దేశంలో ప్రస్తుతం ఆయిల్ పామ్8.25 లక్షల ఎకరాలలో సాగులో ఏడాదికి 16.85 లక్షల మెట్రిక్ టన్నుల గెలలు, 2.81 లక్షల మెట్రిక్ టన్నుల ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్- దిగుమతులను పూర్తిగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలంటే, ఆయిల్ పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నూనె గింజల పంటల్లోకెల్ల పామాయిల్ ఎక్కువ దిగుబడినిస్తున్న (ఎకరానికి 10-12 టన్నుల గెలలు), 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఎడాదికి సుమారుగా రూ.1,20,000 నుండి రూ.1,50,000 వరకు ఆదాయం పొందడానికి అవకాశముందన్నారు. పైగా పర్యావరణానికి మేలు కలిగించేదిగా పేరుగాంచిందన్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో పెరిగిన నీటీ వనరులు, వాతావరణ అనుకూల పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పామ్ ఆయిల్ సాగును చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 25 జిల్లాలలో,అనువైన 8.14 లక్షల ఎకరాలలో సాగుకు అనుమతించడం జరిగిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సహకార శాఖ జీవోఎంస్ నెం 60 ద్వారా ఇటీవల పలు కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్ కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సదరు కంపెనీల యజమాన్యం ఉద్యాన శాఖకు సూచించిన ధరావతు చెల్లించి ఒప్పందం కుదుర్చుకోవలసి ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పిజెటిఎస్‌ఎయు విసి ప్రవీణ్‌రావు, భగవాన్ ఉద్యాన విశ్వ విద్యాలయం డిఆర్ భగవాన్, ఎస్‌బిఐ జిఎం, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ కృష్ణ శర్మ, నాబార్డ్ డిజిఎం సంతానంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Minister Niranjan Reddy meeting with state level bankers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News