Saturday, April 27, 2024

వంటగ్యాస్ ధరలు తగ్గించకపోతే.. మరో పోరాటం తప్పదు

- Advertisement -
- Advertisement -

 

Minister Srinivas Goud protest against hike in LPG gas

 

హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడలేని వంట గ్యాస్ ధరలు మనదేశంలోనే ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 8 ఏళ్లలో వంట గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచారని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపుమేరకు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో పెంచిన గ్యాస్ ధరలపై ధర్నాలో పాల్గొన్నారు. వంటగ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదని మంత్రి కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. గ్యాస్ ధర 2014లో రూ.450 ఉండగా ఇప్పుడు రూ. 1100 కు పైగా దాటిందని… సబ్సిడీగా ఇస్తున్న రూ.240 ను దశలవారీగా ఎత్తేసి పేదలపై ఊహించని భారం మోపారని మంత్రి ఆరోపించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్రప్రభుత్వం సామాన్యుడి బతుకు దుర్భరంగా మారుస్తున్నదన్నారు. కూలి నాలి చేసుకునేవాళ్లు, చిరు ఉద్యోగుల తాము సంపాదించిన దాంట్లో కనీసం 10 శాతానికి పైగా వంట గ్యాస్, పెట్రోల్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశలవారీగా వంట గ్యాస్ పై ఉన్న సబ్సిడీని ఎత్తివేసి పేదల నడ్డి విరుస్తున్నారు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో గ్యాస్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించడమే కష్టంగా మారిందనన్నారు.

కేంద్రం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ ఈడీ ద్వారా వేధింపులకు గురి చేస్తూ నోరెత్తకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని… కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎనిమిదేళ్లలో పేదల సంక్షేమం కోసం చేసింది శూన్యమన్నారు. అభివృద్ధి చేయకపోయినా మతం పేరుతో సెంటిమెంటును రెచ్చగొట్టి అధిక సంఖ్యకులైన హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు బిజెపి సర్కారు కుట్రలు చేస్తోందని.. రాష్ట్రంలోని యువత బిజెపి మత రాజకీయాలను గమనించాలని పిలుపునిచ్చారు.

రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ చేయాలని కుట్రలు చేస్తోందన్నారు. మహిళలను తీవ్రంగా కష్టాలకు గురిచేస్తున్న మోడీ ప్రభుత్వం వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని లేదంటే కేంద్రంపై మరో పోరాటానికి సిద్ధమన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయించేందుకు దేశవ్యాప్తంగా రైతులంతా ఢిల్లీలో చేసిన పోరాటం మాదిరిగానే లక్షలాదిగా మహిళలు దేశ రాజధానికి తరలి కేంద్రంపై పోరాడేందుకు సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే కేంద్రం మెడలు వంచి గుణపాఠం చెప్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు కొరమోని నరసింహులు, బస్వరాజు గౌడ్ లక్ష్మీ, మూడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, డిసిసిబి వైస్ చైర్మన్, కొరమోని వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మత్స్య సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, పార్టీ నాయకులు వినోద్, శివరాజు తదితరులతో పెద్ద ఎత్తున మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News