Wednesday, May 1, 2024

ప్రజలు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం..

- Advertisement -
- Advertisement -

ప్రజలు సహకరిస్తే అక్రమ నిర్మాణాలు తొలగించి నాలాలు నిర్మిస్తాం..
త్వరలోనే కోవిడ్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తాం..
వరంగల్ మహానగర నాలాల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు
ముంపు ప్రాంతాల్లోని బాధితులను అడుగడుగునా అక్కున చేర్చుకున్న మంత్రి కెటిఆర్
కోవిడ్ ఆస్పత్రిలో పిపిఈ కిట్లతో బాధితుల పరామర్శ..

మనతెలంగాణ/వరంగల్: ప్రజలు సహకరిస్తే వరంగల్ మహానగరాన్ని ముంచెత్తుతున్న వరదలను నిర్మూలిస్తామని అందుకు తక్షణ సాయంగా రూ.25 కోట్లు మంజూరి చేస్తున్నట్లు ఐటి పురపాలక శాఖామాత్యులు, టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ప్రజలకు భరోసాను ఇచ్చారు. మంగళవారం ఉదయం వరంగల్ మహానగరంలో వరదలతో ముంచెత్తిన ముంపు ప్రాంతాలను మంత్రి కెటి రామారావుతో ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపిలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్‌రావు, వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్‌ల బృందం పర్యటించింది. ముందుగా ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు మంత్రి కెటి రామారావు హెలిక్యాప్టర్ ల్యాండ్ అయింది. మంత్రికి స్వాగతం పలకడానికి జిల్లా మంత్రులు, ఎంపి, ఎంఎల్‌ఎ, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్‌లు ఎదురెళ్లారు. మంత్రికి ఘనస్వాగతం పలికి ముంపు ప్రాంతాల్లో పర్యటించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో బయలుదేరారు. అక్కడి నుండి ముందుగా సమ్మయ్యనగర్‌లో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి అక్కడే ఉన్న నాలాల పరిస్థితిని పరిశీలించారు. సమ్మయ్యనగర్‌లో వరద తాకిడికి గురైన బాధితులతో మంత్రి కెటి రామారావు మాట్లాడారు. వారికున్న ఇబ్బందులు, వరదల కారణాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

కెయు నుండి కాజీపేటకు వెళ్లే 100 ఫీట్ల రోడ్డు ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మంత్రి అక్కడున్న పరిస్థితులపై మాట్లాడారు. కెయు 100 ఫీట్ల రోడ్డు నుండి పెద్దమ్మగడ్డ, ఆర్‌ఆర్ ఫంక్షన్‌హాల్, రోడ్లు, నాలాలను పరిశీలించారు. అక్కడి నుండి భద్రకాళి వాగు బ్రిడ్జిని పరిశీలించి అక్రమ నిర్మాణాలతో పాటు నాలాలుగా అడ్డుగా ఉన్న చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రిన్సిపాల్ సెక్రటరి, డైరెక్టర్‌లు పరిశీలన నిమిత్తం వరంగల్ నగరాన్ని పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోతననగర్, భద్రకాళి వరదను పరిశీలిస్తూ సంతోషిమాతా గుడి వద్ద నీట మునిగిన ప్రాంతంతో పాటు బొంది వాగును పరిశీలించారు. బొంది వాగు ఉప్పొంగడానికి ప్రధాన కారణాలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భద్రకాళి చెరువు వరద తాకిడికి ఎక్కువయ్యే పరిస్థితులు వస్తున్నందున అదనంగా తూంల నిర్మాణాన్ని చేపట్టేందుకు పరిశీలన చేస్తామని అక్కడి ప్రజలకు హామీనిచ్చారు. భద్రకాళి చెరువుకు వరద తాకిడి ఎక్కడినుండి ఎక్కడి వరకు వస్తుంది. దాని ప్రవాహం ఏ మేరకు ఉంటుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో పాటు కమిషనర్ పమేలా సత్పతిలను అడిగి తెలుసుకున్నారు. 180 సెంటిమీటర్ల స్థాయిలో వర్షం కురిసి వరదలు పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకూడదని బండ్ నిర్మాణం చేశామని వారు చెప్పారు. ఈసారి 270 సెంటిమీటర్ల వర్షం కురిసినందున ఈ పరిస్థితి వచ్చినట్లు అధికారులు మంత్రికి చెప్పారు. అక్కడి నుండి హంటర్‌రోడ్డు లోతట్టు ప్రాంతాలను మంత్రి కిలోమీటర్ల మేర నీటిలో నడుస్తూ ముంపు ప్రాంతాలను పర్యటించారు. అడుగడుగునా బాధితులతో పాటు స్థానిక ఎంఎల్‌ఎలుగా ఉన్న దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్‌లతో చర్చిస్తూ సమస్య పరిష్కారంపై దృష్టిని కేంద్రీకరించారు.
కోవిడ్ వార్డును సందర్శించిన మంత్రి కెటిఆర్..
వరంగల్ మహానగరంలోని ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి కెటిఆర్ బృందం నేరుగా ఎంజిఎం కోవిడ్ వార్డుకు వెళ్లారు. వార్డులోకి వెళ్లేముందే కోవిడ్ చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులు మంత్రిని కలిసి వారి గోడును వెల్లబోసుకున్నారు. వారిని ఓదార్చిన మంత్రి నేరుగా కోవిడ్ వార్డుకు వెళ్లే ముందు పిపిఈ కిట్లను ధరించారు. ఎంజిఎంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డుకు వెళ్లి బెడ్స్‌పై ఉన్న కోవిడ్ బాధితులలో ఒక్కొక్కరిని కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపుగా 15 నిముషాల పాటు వార్డులో పేషెంట్లను కలిసి వివరాలు తెలుసుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి కెటిఆర్ బృందంతో సెల్ఫీలు దిగారు. అక్కడి నుండి మంత్రి బృందం నిట్ కళాశాలకు చేరుకొని సమీక్షను ప్రారంభించింది.

త్వరలో కోవిడ్ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని ప్రారంభిస్తాం: మంత్రి కెటిఆర్
వరంగల్ మహానగర ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి కెటి రామారావు బాధితులకు రెండురకాల హామీలనిచ్చి వాటిని అమలు పరుస్తున్నట్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ మహానగరంలో నాలాల అక్రమ రవాణను తొలగిస్తూ వాటి అభివృద్ధికి తక్షణమే రూ.25 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మహానగర జనాభా వరదల తాకిడిని దృష్టిలో పెట్టుకొని నాలాల నిర్మాణం ప్రణాళిక బద్ధంగా నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరి, డైరెక్టర్‌లు తగిన ఇంజనీరింగ్ రూట్ మ్యాప్‌ను తయారు చేస్తారన్నారు. దానిని అనుసరించి నాలాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తారన్నారు. వరంగల్ ఎంజిఎంకు కోవిడ్ బాధితుల తాకిడి అధికంగా ఉన్నందున సూపర్‌స్పెషాలిటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. 150 పడకలతో ఆస్పత్రి సేవలు కొనసాగుతాయని త్వరలోనే కెఎంసి పరిధిలోని పిఎం ఎస్‌ఎస్‌వై ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. కోవిడ్ బాధితులకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా, మందులు, పిపిఈ కిట్లు, మాస్క్‌లు అవసరం మేరకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామని బాధితులు ఎవరు కూడా అధైర్యపడవద్దని హామీనిచ్చారు.
ముంపు ప్రాంతాల్లో సాదాసీదాగా మంత్రి పర్యటన..
వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి కెటిఆర్ బృందం చేపట్టిన పర్యటన సాదాసీదాగా కొనసాగింది. రాష్ట్ర ఐటి పురపాలక శాఖతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో అధికార యంత్రాంగం కెటి రామారావుకు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. అడుగడుగునా ప్రజల్ని నియంత్రించడానికి ముంపు ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండడానికి నియంత్రిత చర్యలు తీసుకున్నా మంత్రి కెటిఆర్ మాత్రం అధికారులను పక్కకు పెట్టి సాదాసీదాగా పర్యటించారు. మంత్రి పర్యటించిన ప్రాంతాల్లో నయీంనగర్, సమ్మయ్యనగర్, గోపాల్‌పూర్, పెద్దమ్మగడ్డ, యూనివర్సిటీ రోడ్డు, పోతననగర్, బొందివాగురోడ్డు, రామన్నపేట, హంటర్‌రోడ్డు, సంతోషిమాత గుడి, ఉర్సు, రంగశాయిపేట, శివనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ప్రాంతాలన్ని మోకాళ్ల లోతు నీరున్నా అందులో నుండే కిలోమీటర్ల మేర మంత్రి నడవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అన్నింటికి మించి స్థానిక మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రజల సమస్యలు చెప్పబోతుంటే నివారించే పరిస్థితి చేసినా కెటిఆర్ మాత్రం ప్రజల్ని సమస్యలను చెప్పమని ప్రోత్సహించడం ముంపు బాధితులను ఎంతగానో ఆకర్షించింది. అడుగడుగునా మంత్రి సమస్యలపై స్పందిస్తూ అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం సంచలనం కలిగించింది.

Ministers KTR and Etela Rajender visits Warangal 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News