Monday, April 29, 2024

కరోనా సంక్షోభంలో ప్రపంచం.. వూహాన్‌లో జలకాలాటలు..

- Advertisement -
- Advertisement -

అప్పుడు కరోనా పుట్టిల్లు వూహాన్
ఇప్పుడు వూ…హా కేరింతల జనజాతర
మాస్క్‌లు తీసి మూలకు పెట్టారు
భౌతిక దూరం గట్టుకు నెట్టారు

Wuhan Water Parks pack out with thousands of people

బీజింగ్: వూహాన్.. చైనాలోని ఈ నగరం కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయింది. తరువాతి క్రమంలో ఇక్కడి నుంచే ప్రపంచానికి కరోనా వైరస్ వ్యాప్తికి రవాణా సెంటర్ అయింది. అయితే, ఇప్పుడు వూహాన్‌లో ఎటుచూసిన జనం సందడి కన్పిస్తోంది. వేలాదితో వాటర్ పార్క్‌లు కిటకిటలాడుతున్నాయి. జనం అంతా వైరస్ గైరస్ భయాలు లేకుండా, కనీసం ఇక్కడి నుంచి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సూక్ష్మజీవిని ప్రసారితం చేశామనే సంకోచాలకు తావివ్వకుండా కేరింతలు కొడుతూ ఆటపాటలతో గడుపుతున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో చైనా వారి చోద్యం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టిన ఇచ్చోట కరోనా పూర్తిగా కట్టుడటంతో, లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో జనం పట్టపగ్గాలు లేకుండా సంచరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ముఖానికి అనివార్యం అయిన మాస్క్‌లు ఇక్కడ మూలకు పడ్డాయి. మాస్క్‌లు తీసేసి, భౌతికదూరాలు అంటూ ఏమీ పాటించకుండా పూర్తిస్థాయి సోషలిజం పద్ధతులు పాటిస్తూ ఈ కమ్యూనిస్టు దేశంలో ప్రజానీకం తమ ఇష్టం ఇతరులకు కష్టంతో మాకేంటీ నష్టం అనుకుంటూ గడుపుతున్నారు.వేలాది మంది పోటాపోటీగా పార్టీలకు వెళ్లుతున్నారు. విందులు వినోదాలతో గడుపుతున్నారు. ప్రత్యేకించి వారాంతాలలో ఇక్కడ నిర్వహించే వాటర్ పార్క్‌లకు, ఇతరత్రా జలక్రీడలకు యమ గిరాకీ ఏర్పడింది. చాలా కాలంగా ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన వాటర్ పార్క్‌లు మూతపడ్డాయి.

దీనితో నిర్వాహకులు ఇన్నేళ్లూ చేసేది ఏమీ లేక గడిపారు. అయితే ఇటీవలి కాలంలో దేశంలో కరోనా పూర్తిగా కంట్రోలు అయిందని, ఇక దేశ పొలిమేరలు దాటి వైరస్ ఇతరదేశాల వీధుల్లోకి వెళ్లి తన ప్రతాపం చూపిస్తోందని తెలియడంతో స్థానిక ప్రభుత్వం కరోనా కట్టుబాట్లను సడలించింది. ఆంక్షలు గింక్షలు ఏమీ లేవని ప్రకటించింది. ఈ క్రమంతో వాటర్ పార్క్‌ల నిర్వాహకులు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక తగ్గింపు ధరలు ప్రకటించారు. తమ పార్క్‌కు వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, పైగా ఛార్జ్‌లు తక్కువని పోటాపోటీగా దూసుకువెళ్లుతున్నారు. దీనితో ప్రతి వాటర్ పార్క్‌లో ఇప్పుడు జనం జాతర కన్పిస్తోంది. స్జేజీ నృత్యాలు, ఈలలు చప్పట్లతో ప్రాంతం అంతా దద్దరిల్లిపోతోంది. ఎక్కడ దూరం పాటించడం లేదు. మనుష్యులంతా ఒక్కటే అనే రీతిలో వ్యవహారాలు వైరస్ శృతి మించి రాగాన పడ్డాయి. కొత్త కరోనా కేసులు నమోదు కాకపోవడంతో హుబే ప్రాంతంలో కరోనా ఆంక్షలను సడలించినట్లు అధికారులు తెలిపారు. ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు ఏకంగా 400 పర్యాటక ప్రాంతాలలో ఉచిత ప్రవేశాన్ని కూడా కల్పించారు. దీనితో ఆయా ప్రాంతాలకు జనం పోటెత్తుతున్నారు. ఇక్కడ పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి అవతారం ఎత్తి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకుంది. కోట్లాది మందికి అమ్మోరులా సోకింది. అయితే దీనితో సంబంధం లేకుండా చైనాలో ఇప్పుడు జనం రోడ్లపైకి ఉరుకులు పరుగులపై బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ కరోనా వైరస్ తిరిగి అంటుకొంటోంది. కానీ అత్యధిక స్థాయిలో కరోనా నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేయడంతో వైద్య ఆరోగ్య శాఖవారు చెప్పే జాగ్రత్తలు ఎవరూ పాటంచడం లేదు. దీనితో చైనాలో మరో మారు వైరస్ వేవ్‌కు ఛాన్స్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరించారు. అయితే దీనిని పట్టించుకోకుండా జనం పదండి ముందుకు పదండి తోసుకు అంటూ ముందుకు సాగడం చైనాకే కాదు ప్రపంచానికే ఎటువంటి విపత్కర పరిస్థితిని తెచ్చిపెడుతుందో అనే భయాలు నిండుకున్నాయి.

Wuhan Water Parks pack out with thousands of people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News