Sunday, April 28, 2024

తొలిరోజే రజత భారతి ‘మీరాబాయి చాను’

- Advertisement -
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో బారత్ బోణీ
వెయిట్‌లిఫ్టింగ్‌లో వెండి పతకం
రాష్ట్రపతి, ప్రధాని, సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్

జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. శనివారం క్రీడల రెండో రోజు మీరాబాయి 49 కిలోల విభాగంలో రజతం సాధించింది. ఒలింపిక్ చరిత్రలోనే తొలి రోజు పతకం సాధించడం భారత్‌కు ఇదే మొదటిసారి. ఈ క్రమంలో 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు రెండో పతకం అందించింది.

టోక్యో : భారత ఒలింపిక్ చరిత్రలోనే ఇదో అరుదైన దినంగా చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌లో భారత్ తొలి రోజే పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగం పోటీల్లో మీరాబాయి చాను 49కిలోల విభాగంలో రజతం సాధించింది. ఒలింపిక్స్ వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. గతంలో తెలుగుతేజం కరణం మల్లీశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది. ఆ తర్వాత మరోసారి చాను భారత్‌కు పతకం సాధించి పెట్టింది. టోక్యో క్రీడల్లో భారీ ఆశలతో బరిలోకి దిగిన భారత ఆణిముత్యం మీరాబా యి అసాధారణ ఆటతో ఏకంగా రజతం సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచి వెండి పతకం తన ఖాతాలో వేసుకుంది. చారిత్రక విజయం సాధించిన చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు చాను ప్రతిభను కొనియాడారు. చారిత్రక విజయంతో భారత ఖ్యాతిని ఇనుమడింప చేసిందని ప్రశంసించారు. మరోవైపు పురుషుల హాకీలో భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. కాగా, మహిళల హాకీ జట్టు మొదటి మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది. షూటింగ్, ఆర్చరీ, జూడో తదితర విభాగాల్లో భారత్‌కు నిరాశే మిగిలింది. టిటిలో మనికా బాత్రా, టెన్నిస్‌లో సుమిత్ నాగల్ మొదటి రౌండ్‌లో విజయం సాధించారు.
ఆటతోనే సమాధానం..
కిందటి ఒలింపిక్స్‌లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న మీరాబాయి చాను టోక్యో క్రీడల్లో ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగింది. దీని కోసం ఏళ్ల తరబడి కఠో ర సాధన చేసింది. తనపై విమర్శలు చేసిన వారికి టోక్యోలో పతకంతోనే సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేసింది. ముందుగా చెప్పినట్టే టోక్యో క్రీడల్లో పతకం ముద్దాడింది. తనను తక్కువ చేసి మాట్లాడిన వారికి ఆటతోనే సమాధానం చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలుగా పేరున్న ఒలింపిక్స్‌లో తొలి రోజే రజతం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మణిపూర్ మణిపూస భారత జాతీయ జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది. అంతేగాక ఒలింపిక్స్‌లో మొదటి రోజే పతకం గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.


21 ఏళ్ల తర్వాత..
ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో దాదాపు 21 ఏళ్ల క్రితం పతకం సాధించింది. అప్పుడూ తెలుగుతేజం కరణం మల్లీశ్వరి భారత్‌కు పతకం అందించింది. ఆ తర్వాత ఈ విభాగంలో భారత్ ఓ పతకం సాధించడం ఇదే తొలిసారి. మహిళల 49 కిలోల విభాగంలో చాను అద్భుత ప్రదర్శన చేసింది. ఏకం గా 202 కిలోల బరువును ఎత్తి రజతం దక్కించుకుంది. స్నాచ్ లో 87 కిలోలు ఎత్తింది. అంతేగాక క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోల బరువును ఎత్తి రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. చైనా వెయిట్ లిఫ్టర్ హూ జిహూయి, మీరాబాయిల మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. ఇద్దరు అద్భుత ఆటతో ముందుకు సాగారు. ఒక దశలో మీరాబాయికి స్వర్ణం ఖాయంగా కనిపించింది. కానీ కీలక సమయంలో చైనా లిఫ్టర్ హూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చాను 202 కిలోల వద్దే నిలిచిపోగా, హూ 210 కిలోల బరువును ఎత్తి స్వర్ణం సొంతం చేసుకుంది. అయితే చాను చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.
అసాధారణం ఆమె పోరాటం..
టోక్యోలో రజతం సాధించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మీరాబాయి చాను విజయంలో కఠోర శ్రమ దాగివుంది. రియో ఒలింపిక్స్‌లో ఎదురైన ఓటమినే విజయ సోపానాలుగా మార్చుకున్న వైనాన్ని ఎంత పొగిడినా తక్కువే. పట్టుదల, కఠోర సాధనల కలయికే ఈ అపూర్వ విజయానికి ప్రతిరూపంగా చెప్పొచ్చు. పతకం సాధించాలనే పట్టుదలతో టోక్యో క్రీడల బరిలో దిగిన చాను చిరస్మరణీయ ప్రదర్శనతో రజతం సొంతం చేసుకుని భళా అనిపించుకుంది. కిందటి క్రీడ ల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన చానుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా సాగిన విమర్శలు చానును ఎంతో బాధించాయి. అయితే ఆ విమర్శలను చాను సవాలుగా తీసుకుంది. తనను అవమానించిన వారికి పతకంతోనే సమాధానం చెప్పాలనే నిర్ణయానికి వచ్చేసింది. రియో ఒలింపిక్స్ వైఫల్యం కుంగదీసినా చాను వెనుకడుగు వేయలేదు. నిరంతరం కఠోర శ్రమతో ముందుకు సాగింది. ఇక కష్ట సమయాల్లో కుంటు ంబం అంత చానుకు అండగా నిలిచింది. దీంతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. టోక్యో క్రీడల కోసం దాదాపు ఐదేళ్లుగా చాను కఠోర సాధన చేస్తోంది. ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదలతో శిక్షణలోనే ముగిని తేలింది. ఈ ఐదేళ్ల కాలంలో చాను ఇంటి వద్ద ఉన్నది కేవలం ఐదు రోజులు మాత్రమే. దీన్ని బట్టి టోక్యో క్రీడల కోసం మీరాబాయి ఏ స్థాయిలో శ్రమించిందో ఊహించుకోవచ్చు. టోక్యోలో పతకం సాధిస్తాననే గట్టి నమ్మ కం చానుకు ముందు నుంచే ఉంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈసారి పతకంతోనే సొంతూరుకు వస్తానని చాలెంజ్ కూడా చేసింది. చెప్పినట్టే సాధించింది.
ప్రముఖుల ప్రశంసలు..
చారిత్రక ప్రదర్శనతో రజతం సాధించి చరిత్ర సృష్టించిన భార త ఆణిముత్యం మీరాబాయి చానుపై అభినందనలు వెల్లువెత్తా యి. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చాను ప్రతిభను కొనియాడారు. ఒలింపిక్‌లో రతజ పతకం గెలిచి చాను భారత కీర్తిని ప్రపంచానికి చాటిందని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇక మీరాబాయి అద్భుత ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగి పోతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించిన ఆభినందనలు అని ప్రధాని ట్విట్ చేశారు. ఇక చాను ఒలింపిక్స్‌లో రజ తం సాధించడం దేశానికి గర్వకారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇక తమ రాష్ట్రానికి చెందిన చాను ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిర్, జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు సిఎం స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు చానును అభినందించిన వారిలో ఉన్నారు. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, గంగూలీ, కుంబ్లే, యువరాజ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కూడా చానును అభినందించారు.

గర్వంగా ఉంది

ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే తన కల నెరవేరడం గర్వంగా ఉందని మీరాబాయి చాను పేర్కొంది. తాను పడ్డ కష్టానికి తగిన ఫలితం లభించింది. అయితే స్వర్ణం సాధించే అవకాశం చేజారడం కాస్త నిరాశకు గురి చేసింది. అయితే రజతం కూడా తనను ఎంతో సంతృప్తి ఇచ్చిందని తెలిపింది. టోక్యో క్రీడల కోసం ఐదేళ్లుగా ఎంతో శ్రమిస్తున్నారు. చివరికి తన శ్రమ ఫలించ డం ఎంతో ఊరటకలిగించిందని వివరించింది. ఇక పతకం సాధించడంతో సగర్వంగా సొంతూరికి బయలుదేరి వెళుతానని చాను పేర్కొంది.

చాను ఇంట్లో సంబరాలు

చారిత్రక ప్రదర్శనతో టోక్యోలో రజతం సాధించిన మీరాబాయి చాను ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. మీరా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆనందసాగరంలో మునిగి పోయారు. చాను ఇంటలో పెద్ద ఎత్తున సంబరా లు చేసుకున్నారు. తన కుటుంబంలోని ఆరుగు రు సంతానంలో మీరాబాయి అందరికంటే చిన్న ది. ఇక చాను సాధించిన అపూర్వ విజయానికి కుటుంబ సభ్యులు అంతా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ క్రమంలో చిన్నప్పుడూ మీరాబాయి అడవి నుంచి కట్టెలను మోసుకొచ్చిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు.

Mirabai Chanu won gold at Tokyo Olympics

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News