Friday, April 26, 2024

తండ్రికి తగ్గ తనయుడిగా

- Advertisement -
- Advertisement -

MK Stalin to take over as Tamil Nadu Chief Minister

సార్థక నామధేయుడిగా స్టాలిన్ రాజకీయ ప్రస్థానం

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టనున్న ఎంకె స్టాలిన్ డిఎంకె అధినేత స్థాయికి ఎదగడానికి ఓవైపు రాజకీయ వారసత్వంతోపాటు మరోవైపు స్వయంకృషి కూడా ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణానంతరం డిఎంకె పగ్గాలు అందుకున్న స్టాలిన్ ఆ స్థాయికి రావడానికి ముందు పలు ఆసక్తికర ఘటనలు ఆయన పుట్టుక నుంచే మొదలయ్యాయి. కరుణానిధికి ముగ్గురు భార్యలు. కాగా, ఆయన రెండో భార్య దయాళ్ అమ్మాళ్ మూడో కుమారుడు స్టాలిన్. కరుణానిధి మరణానంతరం(2018లో) పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తన సొంత అన్న అళగిరి నుంచే పోటీ ఎదురుకాగా పార్టీ ఉన్నతస్థాయి నాయకత్వం, కార్యకర్తలు స్టాలిన్‌వైపే మొగ్గు చూపారు.

1953 మార్చి1న కరుణానిధి కుమారుడు స్టాలిన్ జన్మించారు. ఆ తర్వాత నాలుగు రోజులకు మార్చి 5న రష్యా అధినేత జోసెఫ్ స్టాలిన్ మరణించారు. ఉక్కు మనిషిగా పేరున్న కమ్యూనిస్ట్ నేత స్టాలిన్ పేరును తన కుమారునికి పెడ్తానంటూ ఆ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో కరుణానిధి ప్రకటించారు. దాంతో, ఆయన పేరు స్టాలిన్‌గా స్థిరపడింది. పేరుకు తగ్గంటే స్ఠాలిన్ చిన్న వయసు నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. 14 ఏళ్ల వయసులో తన మేనమామ మురసోలి మారన్ తరఫున 1967 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. 1973లో మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అదే ఏడాది డిఎంకె జనరల్ కమిటీకి ఎన్నికయ్యారు. 1975లో కేంద్రంలోని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించింది. ఆ సందర్భంగా ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

అందుకు నిరసనగా 1976లో తమిళనాడులో జరిగిన ఓ ఆందోళనకు నేతృత్వం వహించిన స్టాలిన్‌పై భద్రతాసిబ్బంది దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన సి.చిట్టిబాబు అనే స్టాలిన్ సహచరుడు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకు నేతృత్వం వహించిన స్టాలిన్‌ను మీసా చట్టం కింద అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. దాంతో, తమిళనాట స్టాలిన్ పేరు మారుమ్రోగిపోయింది. 1982లో డిఎంకె యువ విభాగాన్ని ఏర్పాటు చేసి, దానికి కార్యదర్శిగా స్టాలిన్‌ని నియమించారు. 38 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 2020లో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఆ పదవి చేపట్టారు.

ఓటమితో పాఠాలు

ప్రత్యక్ష ఎన్నికల్లో స్టాలిన్‌కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె తరఫున చెన్నై థౌసెండ్‌లైట్స్ నుంచి బరిలో నిలిచి ఎఐఎడిఎంకె అభ్యర్థి కె.ఎ.కృష్ణస్వామి చేతిలో ఓడిపోయారు. 1989లో అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారిగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1991లో తమిళనాడులోని డిఎంకె ప్రభుత్వాన్ని కేంద్రంలోని చంద్రశేఖర్ ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో, 1991లో తిరిగి నిర్వహించిన ఎన్నికల్లో మరోసారి కృష్ణస్వామి చేతిలో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1996,2001,2006 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011, 2016ల్లో కొళత్తూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2021లోనూ అక్కడి నుంచే ఎన్నికయ్యారు.

ఒకేసారి రెండు పదవుల్లో..

చెన్నై నగరపాలక సంస్థ మేయర్ పదవికి 1996లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలుపొందిన
స్టాలిన్ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పదవి చేపట్టిన తొలి మేయర్‌గా చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఆయన ఎంఎల్‌ఎగా
కూడా కొనసాగుతూ జోడు పదవులు నిర్వహించారు. తన పదవీకాలంలో చెన్నైలో 9 ఫ్లైఓవర్లు నిర్మించి అభివృద్ధికి బాటలు పరిచారు. 2001లోనూ మరోసారి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఉండేందుకు వీల్లేకుంగా 2002లో చట్టం తెచ్చారు. అయితే, అది కోర్టులో కొట్టివేతకు గురైంది. ఆ తర్వాత తెచ్చిన మరో చట్టం వల్ల స్టాలిన్ మేయర్ పదవి కోల్పోయారు.

నిర్మాతగా, నటుడిగా..

తన తండ్రి కరుణానిధితోపాటు ఎఐఎడిఎంకె అధినేత ఎంజిఆర్, జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే
కావడంతో స్టాలిన్ కూడా అటువైపు దృష్టి సారించారు. 25 ఏళ్ల వయసులోనే 1978లో నంబిక్కై నట్చత్రంతో నిర్మాతగా మారారు. ఒరే రత్‌తమ్(1988),మక్కల్ అనయిట్టల్ (1988) చిత్రాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత కురింజి మలార్, సూరియా అనే టివి సీరియళ్లలోనూ నటించారు.

తండ్రి ఆశీస్సులతో పార్టీ అధినేతగా..

2010 నుంచి స్టాలిన్‌కు కుటుంబసభ్యుల నుంచే పార్టీపై ఆధిపత్యం కోసం పోటీ ఎదురైంది. పెద్ద కుమారుడు అళగిరితోపాటు కూతురు కనిమొళిని కరుణానిధి తన వారసత్వ రాజకీయాల్లోకి తెచ్చారు. అయితే, అళగిరి వ్యవహారశైలి కాస్త అహంకారపూరితంగా ఉండటంతో ఆయనకు కార్యకర్తలు దూరంగా ఉండేవారు. అయినా మదురై ప్రాంతంలో ఆయనకు కొంత పట్టు ఉండేది. చెన్నైలో మాత్రం స్టాలిన్‌నే తమ నాయకుడిగా స్థానిక కార్యకర్తలు గుర్తించారు. దాంతో, కరుణానిధి దృష్టి స్టాలిన్‌పై పడింది. తనకు తగిన వారసుడిగా స్టాలిన్‌ని ఆయన గుర్తించారు. తన తదంతరం పార్టీ నాయకత్వం స్టాలిన్‌కే అప్పగించాలని నిర్ణయించారు. అడ్డగించేందుకు యత్నించిన అళగిరిని 2014లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

సీనియర్లు, కార్యకర్తలతో అనుబంధం

తమిళనాడులోని ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తూ స్థానిక సమస్యలను స్టాలిన్ కార్యకర్తల నుంచి తెలుసుకునేవారు. దాంతో, ఆయనకు క్షేత్రస్థాయిలోనూ పట్టు ఏర్పడింది. కుటుంబసభ్యులతోనూ, తన తండ్రికి నమ్మకమైన అనుచరులుగా పని చేసిన పార్టీ సీనియర్లతోనూ స్టాలిన్ ఆత్మీయంగా మెలిగేవారు. సవతి తల్లి కూతురు కనిమొళి నుంచి మొదట కాస్త పోటీ ఎదురైంది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె రచయితగా మారారు. మంచి వక్త కూడా. అయితే, తన సోదరుడు స్టాలిన్‌కు పార్టీ కార్యకర్తల్లో ఉన్న బలం చూసి ఆయన నాయకత్వాన్ని సవాల్ చేసేందుకు వెనకాడారు. ప్రస్తుతం ఆమె కూడా అన్న బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నారు.

దాంతో, డిఎంకెలో స్టాలిన్ ఎదురులేని నేత అయ్యారు. మరోవైపు ప్రత్యర్థి పక్షం ఎఐఎడిఎంకెలో జయలలిత మరణానంతరం నాయకత్వం కోసం మొదలైన కుమ్ములాటలు ఆ పార్టీని ప్రజల మధ్య ఒకింత చులకన చేయడం కూడా స్టాలిన్‌కు కలిసి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే డిఎంకె బలం రుజువైంది. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిన కాంగ్రెస్, వామపక్షాలకు అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గౌరవప్రదంగా సీట్లు కేటాయించి జాతీయ స్థాయిలోనూ పట్టు సాధించారు. ఈ ఎన్నికల్లో 173 స్థానాల్లో పోటీ చేసిన డిఎంకె,12 మిత్రపక్షాలకు 61 సీట్లు కేటాయించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News