Friday, April 26, 2024

చిరస్మరణీయుల జీవన ప్రస్థానం!

- Advertisement -
- Advertisement -

Biographies of the greats of Telangana

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమిటంటే – మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని, ములాలలోకి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతొంది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్యా, వైద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఎనలేని కృషి చేసిన తెలంగాణ మహనీయుల జీవిత విశేషాలను మన పరిశోధకులు వెలుగులోకి తెస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచలకులు మామిడి హరికృష్ణ , హైదరాబాద్ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ విష్ణు భట్ల ఊదయశంకర్ గార్ల సంయుక్త సంపాదకత్వంలో వెలువడ్డ ‘తెలంగాణ తేజోమూర్తులు’ ఈ కోవకు చెందిన గ్రంథాలలో అమూల్యమైనది. ఒకరు కాదు ఇద్దరు కాదు నూట యబై ముగ్గురు సుడిగుండాల జీవన నదులను ఈది వచ్చిన చరితార్ధుల వివరాలను ఈ గ్రంధంలో నిపుణులైన రచయితలు రాయడం జరిగింది.

మన జాతీయ గీత రచయిత రవీంద్ర కవీంద్రుడని అందరికి తెలుసు. ఆ గీతం పూర్తికాగానే ‘జైహింద్’ నినాద సృష్టికర్త అబిద్ హసన్ సఫ్రానీ అన్ని సంగతి ఈ గ్రంథంలోని జి. వెంకటరామారావు గారి వ్యాసం చదివితే చాలమందికి తెలుస్తుంది. సఫ్రానీ హైదరాబాద్ వాస్తవ్యులు కావటం మనకు మరింత గర్వకారణం ! వెలుదండ నిత్యానందరావు గారి వ్యాసం చదివితే, తెలంగాణ గత చరిత్రకు సంబంధించిన అనేక కొత్త అంశాలను తొలిసారి చెప్పినవారు ఆదిరాజు వీరభద్రరావు గారని తెలుస్తుంది. అరవై ఎనిమిది మంది గ్రీకు పురాణ దేవతలను హిందూ దేవతలతో పోల్చుతూ పిల్లల కోసం వారు రాసిన గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది.

వరంగల్ పట్టణ సామాజిక విద్యా వైద్య క్షేత్రాలలో చెరగని సంతకం చందా కాంతయ్య శ్రేష్టి గారిది. ప్రభుత్వ దవాఖానకు వార్డులను, క్వార్టర్లను కట్టించి ఇవ్వటమే కాక ఎం.జి.ఎం. జనరల్ ఆసుపత్రికి అయిదెకరాల స్థలాన్నీ దానం చేసిన వదాన్యులాయన ! తెలుగు భాషపై ప్రేమతో పాటు తెలుగు భాషకు తగిన ప్రచారం చేయాలనే లక్ష్యంతో నిజాం జమానాలో వేల రూపాయలు వెచ్చించి ఆంధ్ర విద్యాభివర్ధని కళాశాలను నిర్మించారు. అది ఆ తర్వాత డిగ్రీ, పీజీ కళాశాలగా అభివృద్ది పొందింది. స్వాతంత్య్రోద్యమ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను జాతీయ నాయకులు అడిగినదే తడువుగా కిలోల కొద్ది బంగారు ఆభరణాలను సమర్పించిన ఈ చందా కాంతయ్య శ్రేష్టి లోని సంఘ సంస్కరణ లక్షణాలను గుర్చి రామా చంద్రమౌళి గారు మంచి వ్యాసం రాశారు. హైదరాబాద్ కు చెందిన చెర్విరాల భాగయ్య గారు రచించిన ‘సుగ్రీవ విజయం’ యక్షగానం లక్ష ప్రతులు అమ్ముడుపోయిందని చాలా తక్కువ మందికి తెలుసు. భాగయ్య గారు శతాధిక గ్రంథకర్త.

తెలుగుతో పాటు మరాఠీ, సంస్కృతం, హిందీ భాషలలో నిష్ణాతులు. పండితులే నివ్వెరపోయే ‘లక్షణ సారం’ అన్న అలంకారశాస్త్ర గ్రంథాన్ని కూడా రచించారు. వారు కూలి పని చేయటమే కాదు, ఫ్రూఫ్ రీడర్ గా కూడా పనిచేశారు. ‘బండిపై కూరగాయలు’ పిప్పరమెంట్లు కూడా అమ్మార’ని నోరి రాజేశ్వర రావు గారు చెప్తున్నారు. యుద్దకాలంలో దరిద్ర దేవత ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సాహితీ సృష్టిని మాత్రం ఆపకుండా తెలుగు సారస్వత ప్రపంచానికి అందించిన మహనీయుడు చెర్విరాల భాగయ్య. కష్టజీవులకు తన కళను అంకితం చేసిన త్యాగమూర్తి, చిందుల ఎల్లమ్మ! నాలుగేండ్ల ప్రాయంలోనే బాలకృష్ణుని వేషధారణ చేసి మెప్పించిన నటీమణి, ఆ తర్వాత ’చిందు బాగోతం’ సంప్రదాయానికి చిరునామాగా మారిపోయారు. ‘నిచ్చెన మెట్ల వ్యవస్థలో అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గంలో ఉన్న మాదిగలకు ఉప కులమే చిందుకులస్థు’లంటున్నారు రచయిత్రి. ఎల్లమ్మ బృందం ఎప్పుడూ ప్రతికూల పరిస్థితుల నడుమ ప్రదర్శనలు ఇవ్వవలసి వచ్చింది.

చిందు ఎల్లమ్మ గారు ప్రదర్శించిన చెంచులక్ష్మి బాగోతానికి ముగ్ధుడైన నటరాజ రామకృష్ణ ఆ కళకు మంచి ప్రోత్సాహం అందజేశారు. 1950 నుండి 1995 మధ్యకాలంలో రచించిన 50 నవలలతో, నూరుకు పైగా కథలతో తెలుగు సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్న రచయిత్రి బొమ్మ హేమాదేవి. తాను సృష్టించిన సాహిత్యం ద్వారా సమాజాన్ని సంస్కరించాలనే తాపత్రయం హేమాదేవిలో కనిపిస్తుందంటున్నారు వ్యాసకర్త శాంతి ప్రబోధ. స్త్రీలకు జరిగే అన్యాయాల పట్ల ఎంతో ముందు చూపుతో రచనలు చేశారని కూడా వారు భావిస్తున్నారు. ’ భావన – భార్గవి’, ’తపస్విని’, ’ సంభారతి ’ ’వనజ’, ’ఆరాధన’, ’బంగారు గూడు’ – అన్న వారి నవలలు ముఖ్యమైనవి వారి కధలకు చాలా సార్లు పోటీలలో బహుమతులు వచ్చాయి. తెలంగాణకు గర్వకారణమైన కళాకారుల్లో ఒగ్గు కథకు మారుపేరైన చుక్క సత్తయ్య గారు ఒకరు.

కుర్మ కులానికి సంబంధించిన కళారూపమైన ఒగ్గుకథలో వారు బీరప్ప కథ, రేణుకా ఎల్లమ్మ, హరిశ్చంద్ర, భారతం కథలు చెప్పటంలో ప్రావీణ్యం సంపాదించారు. పాత్రకు దగ్గ ఆహార్యాన్ని క్షణాలలో మార్చి రక్తికట్టించే వారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల ద్వారా కూడా చుక్క సత్తయ్య ఒగ్గుకథలు ఎన్నో సార్లు ప్రసారమైనాయి. దేశవిదేశాలలో సుమారు పదమూడు వేల ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని సుసంపన్నం చేసిన మహా కళాకారుడు చుక్కసత్తయ్య. ‘ఊరు మనది రా – ఈ వాడ మనదిరా’ అంటూ అనేక భాషలలోకి అనువాదమైన పాటతో పాటు, ఆ స్థాయి పాటలెన్నో రాసి, పాడి దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన కళాకారుడు గూడ అంజయ్య. డబ్బుకోసమో, పేరుకోసమో కాక అణగారిన ప్రజల స్వేఛ్ఛా స్వాతంత్య్రాలకోసం గానం చేశాడంటున్నారు పసునూరి రవీందర్. తెలంగాణ ఉద్యమంలోనే కాదు, దళితోద్యమంలో కూడా వారిది చిరస్మరణీయమైన పాత్ర. ’దరకమే’ వంటి సంస్థల స్థాపనలో వారిది చురుకైన పాత్ర. కేవలం పాటలకే పరిమితం కాకుండా వారు అనేక కథలను కూడా రాశారు. గూడ అంజయ్య రచించిన ‘పొలిమేరలు’ నవలకు మంచి గుర్తింపు వచ్చింది.

నాటకం, సినిమా రంగాల ద్వారా మన సంస్కృతీ, సాహిత్యాలకు చిరస్మరణీయమైన సేవలు అందించిన మహితాత్ముడు చందాల కేశవదాసు గారిని గూర్చి ఎం. పురుషోత్తమాచార్య గారు సాధికారికమైన వ్యాసం రాశారు. చందాల కేశవ దాసు విరచిత ‘పరబ్రహ్మ పరమేశ్వర’ గేయం నాటకసమాజాలకు నాందీవాచకం అయిన తీరు, ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలోని ’భలే మంచి చౌక బేరము’ అనే పాట లక్షలాది ప్రేక్షకుల నాలుకల మీద నాట్యమాడిన సంగతి చరిత్రలో అధ్యాయాలుగా మిగిలిపోయాయి. అంతేనా అంటే – వేలాది ప్రదర్శనలతో కాలాన్ని శాసించిన ’ కనక్తార’ నాటకంలో అక్కినేని నాగేశ్వర రావు, పుట్టపర్తి సాయిబాబా గారలు నటించి వారి జీవితాలను చరితార్ధం చేసుకున్నారన్నది చిన్న విషయమా? సంకీర్తనాచార్యులుగా ప్రసిద్ధులై ‘తమ్మెర – రామదాసు’ గా పేరుపొందిన కేశవదాసు గురించిన మరెన్నో విశేషాలకు ఈ పుస్తకం ఓ చిరునామా !

శాసనసభ్యులుగానే కాక అనేక సామాజిక, రాజకీయ సంస్థలలో సభ్యురాలిగా సేవలందించిన వారు సుమిత్ర దేవి గారు. దళితుల సమస్యల పరిష్కారానికి పట్టువీడకుండా కృషి చేశారు. ఎన్నో సార్లు రజాకార్లను ధైర్యంగా ఎదుర్కొని వాళ్ల కుతంత్రాలను అడ్డుకున్న ధీరురాలామె. వారు స్థాపించిన ఆర్యయువజన పాఠశాల, జగ్జీవన్ పాఠశాలలు వారికి విద్యారంగం మీద వున్న అభిరుచికి నిదర్శనం రాజ బహదూర్ వెంకట రామారెడ్డి కళాశాలకు శంకుస్థాపన జరుగవలసిన ప్రదేశంలో దళితుల గుడిసెలుండేవి. వారికి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతనే సుమిత్రా దేవి గారు వాటిని ఖాళీ చేయించారంటున్నారు వ్యాసకర్త ముక్తేవి భారతీ . దళితులకోసం 500 ఇండ్లను నిర్మించి ఇవ్వటమే కాదు, దళితవాడల్లో 60 మంచినీటి బావులను తవ్వించి ఇవ్వటం కూడా వారి సేవానిరతికి తిరుగులేని నిదర్శనం.

రంగారెడ్డి జిల్లా బచ్చుపల్లికి చెందిన మంత్రి శ్రీనివాసరావు గారికి తొలి నుంచే నాటకాల పట్ల, నాటకరంగం పట్ల ఆసక్తి వుండేది. సరోజినీ నాయుడు గారి కుటుంబ సభ్యుల మూలంగా, అబ్బూరి వరద రాజేశ్వరరావు గారితో పరిచయం కారణంగా ఆ ఆసక్తి పెరుగుతూ వచ్చింది. లండన్ వెళ్ళి అధ్యయనం చేసి, నటనలో శిక్షణను పొంది తిరిగి వచ్చారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఏర్పడ్డ ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల శాఖకు మంత్రి శ్రీనివాస్ రావు అధిపతి అయ్యారంటున్నారు వ్యాసకర్త విజయకుమార్. ఇండియన్ నేషనల్ థియేటర్ ను స్థాపించి ఎన్నో కొత్త కొత్త నాటకాలను ప్రదర్శించారు. వీరు నాటక రంగంలో చేసిన ప్రయోగాలకు అంతులేదు. తెలుగు నాటకాలనే కాదు, గ్రీకు నాటకాలను, ఆంగ్ల నాటకాలను కూడా ప్రదర్శించారు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు 1964లో రాష్ట్రపతి భవన్ లో మృచ్ఛకటికమ్ నాటకాన్ని ప్రదర్శించారు. వీరు స్థాపించిన ‘నాట్య విద్యాలయం’ సంస్థ ఎందరికో శిక్షణ నిచ్చింది.

వీరేకాదు మరెందరో మహానీయులు జీవిత చరిత్రలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. సిపాయిల తిరుగుబాటు కాలంలో వీరమరణం పొందిన తుర్రేబాజ్ ఖాన్ , తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ, శ్రీ శ్రీ వారసుడనిపించుకున్న అలిశేట్టి ప్రభాకర్, శాసన పరిశోధనల ద్వారా తెలంగాణకు చరిత్రలో స్థానం సంపాదించి పెట్టిన బి.ఎన్. శాస్త్రి, జానపద సాహిత్య పరిశోధకులు, గ్రంథ పరిష్కర్త బిరుదురాజు రామరాజు, యాభై వేల ఎకరాలను సేకరించి భూదానోద్యమ కాలంలో వినోబా భావే గారికి దానం చేసిన పల్లెర్ల హనుమంత రావు, శ్రమైక జీవన సౌందర్యాన్ని రంగులతో, రేఖలతో సజీవం చేసిన చిత్రకారుడు కాపు రాజయ్య, విసునూరు రామచంద్రారెడ్డిని ముఖాముఖీ ఎదిరించిన ధీరుడు జోగ్యా నాయక్, ‘పేరిణి ’ నాట్యాన్ని పునరుద్ధరించిన నాట్యయోగి నటరాజ రామకృష్ణ, తెలంగాణ టైగర్ గా పేరు పొందిన రైతాంగ పోరాట యోధుడు నల్లా నరసింహులు, జాతీయ స్థాయి అభ్యుదయ కవి మఖ్దూం మోహి యుద్దీన్…… ఇట్లా చరిత్రలో ఆదర్శాల అడుగుజడలు పరిచి వెళ్ళిన త్యాగధనులు ఎందరో ‘తెలంగాణ తేజోమూర్తులు’ గ్రంథంలో దర్శనమిస్తారు.

ఈ గ్రంథంలో ఉన్న మరో విశిష్టత ఏమిటంటే, ఇది తెలంగాణ వైతాళికుల గురించిన జీవిత విశేషాలను అందచేయడమే కాక, వారి ఫోటోలను రంగులలో ముద్రించడం, అందులోనూ దాదాపు 33కు పైగా మహనీయుల అరుదైన తైలవర్ణ చిత్రాలను పూర్తి పేజీలో ముద్రించడం విశేషం. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది మహనీయుల పేర్లు తెల్సినప్పటికీ, వారి రూపు రేఖలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు. ఇక నేటి తరం యువతకు దాదాపుగా తెలియదు. ఈ గ్రంథంలో మహనీయుల చిత్రాలను కూడా పుస్తకం చివరన దాదాపు 48 పేజీలలో అందించడం ద్వారా, మహనీయుల రూపాలను కూడా చూసే అవకాశం లభించింది.

అలాగే భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన అన్ని గ్రంథాలకు లాగే ఈ గ్రంథం కూడా పేజీ మేకప్, లేఔట్, డిజైన్ లో కూడా నవ్యపంథాను అనుసరించింది. అలాగే కవర్ పేజీపైన ముఖ చిత్రంలో తెలంగాణ బౌగోళిక పటం బ్యాక్ డ్రాప్ లో తేజోమూర్తుల ముఖచిత్రాలను అందించడం, బ్యాక్ కవర్ లో తెలంగాణ చిరస్మరణీయుల ముఖ చిత్రాలను స్టాంప్ ఆకారంలో ముద్రించడం ఈ పుస్తక ముద్రణలో సంపాదకుడు హరికృష్ణ చూపించిన సృజనాత్మక ఆలోచనకు అద్దం పట్టడమే కాక, చూడగానే ఆకట్టుకునేలా ఉండి చదవాలనే ఆసక్తిని పాఠకులకు కలిగిస్తుంది.సంపాదకులలో ఒకరైన మామిడి హరికృష్ణ గారు అన్నట్టు ప్రపంచాన్నంతా ఒక్కచోట చూడాలనుకుంటే భారత దేశాన్ని చూస్తే చాలు.

అదే కోవలో భారత దేశాన్ని ఒక్క దగ్గర చూడాలనుకుంటే తెలంగాణలో అడుగు పెడితే చాలు అనేంతగా అనాది కాలం నుంచి అనంతమైన ప్రత్యేకత, విశిష్టత కలిగిన భూమి తెలంగాణ! ఈ ’తెలంగాణ తేజోమూర్తుల’ కాంతిపుంజాలు చీకటి మూలలను కూకటి వేళ్ళతో కూల్చివేసి చరిత్రను దేదీప్యమానం చేస్తున్నాయి. ఈ అమూల్య గ్రంథంలోని వ్యాసాలను గ్రంథ రూపంలో చిరస్మరణీయంగా వుండేటట్లుగా రూపొందటానికి దోహదం చేసిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఇలాంటి ఎన్నో అరుదైన ప్రచురణలతో తెలంగాణా సంస్కృతి, చరిత్ర, కళలు, సాహిత్యాన్ని డాక్యుమెంట్ చేస్తూ భవిష్యత్ తరాలకు అందిస్తున్నందుకు అభినందించకుండా ఉండలేము !

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News