Tuesday, May 7, 2024

ఎపికి కేంద్రం షాక్!

- Advertisement -
- Advertisement -

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇచ్చిన డిపిఆర్‌పై తీవ్ర అసంతృప్తి
మళ్లీ సమగ్ర నివేదికను పంపాలని ఆదేశం
ముందస్తూ అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడంపై నిషేధం
డిపిఆర్‌లో సిడిబ్లూసి మార్గదర్శకాలను పాటించాల్సిందేనని వెల్లడి

Modi govt serious on Rayalaseema Upliftment Scheme

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి ప్రభుత్వానికి కేంద్రం షాక్‌నిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్చించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)పై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల డిపిఆర్ సరిగ్గా తయారు చేయడం కూడా రాదా? అని ప్రశ్నించింది. డిపిఆర్‌ను ఎలా తయారు చేయాలో సిడిబ్లూసి రూపొందించిన మార్గదర్శకాలను చదువుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. డిపిఆర్‌లో అసలు ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జల్‌శక్తిశాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో మళ్ళీ డిపిఆర్‌ను తయారు చేసి పంపాలని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులకు సంబంధించి ఎలాంటి ముందస్తూ అనుమతులు లేకుండా ఎపి ప్రభుత్వం ప్రారంభించడం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సిడబ్లూసి మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందేనని ఎపి ప్రభుత్వాన్ని కేంద్రం గురువారం ఆదేశించింది.

ఎపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరి నుంచి రోజులు మూడు టిఎంసిల నీటిని శ్రీశైలం నుంచి ఎత్తిపోసే ప్రాజెక్టును మొదలుపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రాజెక్టు డిపిఆర్‌ను ఎపి ప్రభుత్వం అపెక్స్ కమిటీకి పంపారు. అలాగే ఎపి ప్రభుత్వం హడావిడిగా టెండర్లు పిలవటంపై కూడా తెలంగాణా రాష్ట్రం అభ్యంతరం చెప్పింది. టెండర్లు పిలవటం వెంటనే నిలిపి వేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా రాసింది.

దీనిపై ఎపి ప్రభుత్వం స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసింది. అందులో ప్రతి రోజూ 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా రూ. 3,248 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నట్లు వివరించింది. సంబంధిత డిపిఆర్‌ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కొద్ది రోజుల క్రితం సమర్పించింది. అందులో శ్రీశైలం డ్యాంలో 800 మీటర్ల నీటిమట్టం నుంచి రోజూ 7 టిఎంసిలు మళ్లించడానికి తెలంగాణ ప్రభుత్వానికి అవకాశముందని, నీటిమట్టం 841 అడుగులకు దిగువన ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఎపికి నీటిని తీసుకోలేమని వివరించింది. ఈ నేపథ్యంలో చెన్నై తాగునీటి సరఫరా, సీమ ప్రాజెక్టులకు ఉన్న కేటాయింపుల మేర నీటిని తీసుకోవడానికి… రాయలసీమ ఎత్తిపోతల అవసరముందని డిపిఆర్‌లో ఎపి ప్రభుత్వం పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల్లో భాగంగా సంగమేశ్వర వద్ద 787.40 అడుగుల మట్టం నుంచి 17.59 కిలోమీటర్ల దూరం అప్రోచ్ కాలువ తవ్వి…. పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో కలుపుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను రూపొందించిన డిపిఆర్‌లో ప్రతిపాదించింది.

ఈ అప్రోచ్ కాలువ నాలుగు రీచ్‌లుగా ఉండగా అందులో 8.89 కిలోమీటర్ల దూరం లైనింగ్ చేపట్టాలని పేర్కొంది. శ్రీశైలం 800 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకునే అవకాశం తెలంగాణకు ఉందని, దానితో 23.37 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేయనుందని వివరించింది. 2020..20-21లో విద్యుత్ బ్లాక్ నుంచే అగ్నిప్రమాదం జరిగే సమయానికే రోజుకు 4 టిఎంసిల చొప్పున 110 టిఎంసిలను దిగువకు వదిలారని వెల్లడించింది. ఆ సమయంలో నాగార్జునసాగర్ కింద సాగు అవసరాలూ లేవని, పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల అవసరాలకు వీలుగా శ్రీశైలంలో 854 అడుగుల మట్టం నిర్వహించాలని కోరినా పట్టించుకోలేదని పేర్కొన్నది.

ప్రస్తుతం శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 875 అడుగులపైన ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించబోమని ఏపీ స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి కాలువ ద్వారా తీసుకుంటామని వివరించింది. నీటిమట్టం 841 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవడం వీలవుతుందని….. దిగువకు ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లిస్తామని పేర్కొంది. 841 నుంచి 874 అడుగుల మధ్య అవసరమైనప్పుడు లిఫ్ట్ వినియోగిస్తామని స్పష్టం చేసింది.

వాస్తవానికి గతంలోనే ముందస్తు పర్యావరణ అనుమతులు పొందకుండా రాయసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశించింది. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణ అనుమతులు పొందే ప్రక్రియను తప్పించుకోవడానికేనని, ఈ ప్రాజెక్టులో సాగునీటి కంపోనెంట్ లేదని వ్యాఖ్యానించింది. కేవలం తాగునీటి ప్రాజెక్టు మాత్రమేనని నిర్ణయానికి వచ్చేలా ఈ ప్రాజెక్టును చిత్రీకరించారని ఎన్‌జిటి అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన మరుసటి రోజే రాయలసీమ ఎత్తిపోతల పథకం డిపిఆర్‌పై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయవర్గాల్లో వాడివేడిగా చర్చ సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News