Wednesday, May 1, 2024

వ్యంగ్యం ఎక్కువ… వ్యవహారం తక్కువ

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షంపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయడం సరికాదు
అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు
చిన్న వయసులో సిఎం కావడం తన అదృష్టమని రేవంత్ అన్నారు
పివికి భారతరత్నపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలి

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువైంది.. వ్యవహారం తక్కువైందంటూ సిఎంకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు చురకలంటించారు. ప్రతిపక్షంపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. చాలా చిన్న వయసులో సిఎం కావడం తన అదృష్టమని రేవంత్ అన్నారని, కాబట్టి వ్యంగ్యం తగ్గించుకొని, వ్యవహారం మీద దృష్టి సారించాలని సిఎంకు సూచిస్తున్నానని పేర్కొన్నారు. చక్కగా మాట్లాడితే తప్పకుండా సహకరిస్తాం అని హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వడం మనందరికీ గర్వకారణమని అన్నారు. పివికి భారతరత్న ఇవ్వాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. పివికి భారతరత్న ఇచ్చినందుకు అసెంబ్లీ ఏగక్రీవ తీర్మానం చేసి కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాలని కోరారు. మన పివి గౌరవాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పివిని పట్టించుకోలేదని,బిఆర్‌ఎస్ ప్రభుత్వం పివి ఘాట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో పివి చిత్రపటం ఏర్పాటు చేసిందని, పివి కుమార్తె సురభి వాణిదేవీకి ఎంఎల్‌సి ఇచ్చామని అన్నారు. తాము పివి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. భారతరత్న ఇవ్వాలని తాము నినందించామని, అది నిజం కావడం మనందరికీ గర్వకారణమని, ఈ నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరుతున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అగ్గిపెట్టె ముచ్చటపై హరీశ్‌రావు ధ్వజం
శాసనసభలో పదేపదే బిఆర్‌ఎస్ నాయకత్వాన్ని విమర్శించిన సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏదన్నా మాట్లాడితే.. సిఎం అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారని అన్నారు. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా ఈ అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్ చేయండి అని పేర్కొన్నారు. తమను కించపరిచి, రాజకీయంగా విమర్శిస్తాం అనుకుంటే.. అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని రేవంత్‌రెడ్డిను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించలేదని, అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదని పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు అమరవీరుల పాడే మోసినోళ్లు కాదు అని విమర్శించారు. తుపాకులతో ఉద్యమకారులను బెదిరించిన మీకు తెలంగాణ పోరాటం, అమరవీరులకు గురించి తెలుస్తదని అనుకోను అని సిఎంను ఉద్దేశించి పేర్కొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఎస్‌ఎల్‌బిసి విషయంలో సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పదేండ్లలో కిలోమీటర్ తవ్వారు అని ఇటీవల ప్రెస్‌మీట్‌లో రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు. దీన్ని సిఎం సవరించుకోవాలని సూచించారు. ఇంకోసారి మాట్లాడేప్పుడు అవగాహనతో మాట్లాడాలని రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సూచించారు. నాగార్జున సాగర్ విషయంలో కూడా సిఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. శ్రీశైలం ఎపి ప్రభుత్వం కంట్రోల్‌లో, నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌లోకి ఇచ్చారని, ఎన్నికలు జరిగే సమయంలో సాగర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ సిఆర్‌పిఎఫ్ భద్రతలో సాగర్ ఉందని అన్నారు.
1న జీతాలు ఇచ్చామనడం అసత్యం
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు ఇచ్చామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పడం అసత్యం హరీశ్‌రావు పేర్కొన్నారు. పలు శాఖల్లో ఏడో తారీఖు వరకు కూ డా జీతాలు పడ్డాయని, ఇప్పటికీ కొన్ని శాఖల్లో జీతాలే పడలేదని స్పష్టం చేశారు. విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్‌లో జీతాలు పడని పరిస్థితి ఉందని, వీటిని సిఎం సవరించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జనవరి నెలలో ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని, ఫిబ్రవరి ఒకటి, రెండో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారని, అది జనవరి నెలదా..? ఫిబ్రవరి నెలదా..? స్పష్టత ఇవ్వాలని కోరారు. ఒకటో తారీఖు రోజునే పెన్షన్లు ఇచ్చామని గొప్పలు చెప్పి పప్పులో కాలేశారన్నారు. రైతుబంధు విషయంలో అసత్యాలు మాట్లాడారని అన్నారు. తాము రూ. 7,500 కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే.. దాదాపు రూ. 6 వేల కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చామని, మిగిలిన మొత్తం విడుదలలో కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది అని హరీశ్‌రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News